ఏసీ @ 24.. ఆదా సూపర్‌ | ACs to be replaced by central government decision | Sakshi
Sakshi News home page

ఏసీ @ 24.. ఆదా సూపర్‌

Jun 13 2025 3:58 AM | Updated on Jun 13 2025 3:58 AM

ACs to be replaced by central government decision

ఏటా 2,000 కోట్ల యూనిట్ల విద్యుత్‌ ఆదా 

రూ.10,000 కోట్ల ప్రజాధనం పొదుపు చేసినట్టే 

కర్బన ఉద్గారాలు తగ్గి పర్యావరణానికీ మేలు 

ఏసీలు ఇకమీదట 20–28 డిగ్రీల సెట్టింగుతో 

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో మారనున్న ఏసీలు 

సాక్షి, స్పెషల్‌ డెస్క్ : ‘ఏసీ లేనిదే నాకు నిద్రపట్టదు’.. తరచూ మన చుట్టూ ఉండే వాళ్లు చెప్పే డైలాగ్‌. ఇంట్లో, ఆఫీసులో.. చివరకు కారులో కూర్చున్నా చాలామందికి చల్లని గాలి వీయాల్సిందే. ఎక్కువమందికి ఏసీ 16–20 డిగ్రీల మధ్యే ఉండాలి. అంతలా జనం ఏసీ చల్లదనానికి అలవాటుపడ్డారు. ఏటా భారత్‌లో 1.5 కోట్ల ఏసీలు అమ్ముడవుతున్నాయంటే కారణం ఇదే. 

ఇదంతా నాణేనికి ఒకవైపు. కానీ, అతి చల్లదనం.. మనకుగానీ, పర్యావరణానికి గానీ మంచిది కాదని వైద్యులు, పర్యావరణ నిపుణులు చెబుతున్నమాట. అందుకే కనిష్టంగా 20.. గరిష్టంగా 28 డిగ్రీల సెల్సియస్‌కు ఏసీల సెట్టింగ్స్‌ను తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరి, ఇలా చేస్తే మనకు, పర్యావరణానికి ఏంటి ప్రయోజనం? 

సీలు మనకు ఎంత చల్లదనాన్ని
ఇస్తాయో.. విద్యుత్‌ వ్యవస్థకు, పర్యావరణానికి అంత ‘వేడి’కూడా చేస్తాయి. అంటే... విద్యుత్‌ వాడకం పెరుగుతుంది! మనం వాడే విద్యుత్‌.. బొగ్గు వంటి వాటితో ఉత్పత్తి అయితే ఆ మేరకు పర్యావరణంపైనా ప్రభావం పడుతుంది. పర్యావరణంపై ప్రభావాన్ని కొందరు తేలిగ్గా తీసుకోవచ్చు.. ఎందుకంటే, అది ఎప్పటికోగానీ ఫలితం చూపించదు అనుకుంటారు కాబట్టి! కానీ, విద్యుత్‌ వాడకం పెరగడం వల్ల మాత్రం ఫలితాలను మనం తక్షణమే చూడాల్సి వస్తుంది.. చూస్తున్నాం కూడా.. కరెంటు కోతల రూపంలో!! 

విద్యుత్‌ అంతరాయాలు 
దేశంలో విద్యుత్‌ డిమాండ్‌.. విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని మించిపోయింది. దీని ఫలితంగా ముఖ్యంగా వేసవిలో ఏప్రిల్‌ నుండి జూన్‌వరకు కొన్ని ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా 2024లో గరిష్ట డిమాండ్‌ 250 గిగావాట్లకు చేరుకుంది. ఈ డిమాండ్‌ 2025లో 8 శాతం పెరుగుతుందని అంచనా. వేసవిలోనూ దేశంలో వర్షాలు పడడంతో విద్యుత్‌ డిమాండ్‌ అదుపులో ఉంది. 

అయితే జూన్‌లో వేడి గాలులు తిరిగి వీయడంతో విద్యుత్‌ వినియోగం పెరిగింది. విద్యుత్‌ డిమాండ్‌ ఈ ఏడాది జూన్‌9న 241 గిగావాట్లకు చేరింది. 2025లో ఇదే గరిష్టం. పెరుగుతున్న విద్యుత్‌ వాడకాన్ని కట్టడి చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. అందుకే ఇళ్లు, హోటళ్లు, కార్లలో వినియోగించే ఏసీలకు సరికొత్తగా ‘ఉష్ణోగ్రత నిబంధన’ను వర్తింపజేయనున్నట్టు ప్రకటించింది.  

ఏటా రూ. 7.5 లక్షల కోట్లు ఆదా!
ఏసీ ఉష్ణోగ్రత ఒక్కో డిగ్రీ పెరిగితే (ఉదాహరణకు 16 నుంచి 17 డిగ్రీల సెల్సియస్‌కు చేరితే ).. విద్యుత్‌ వినియోగం 6 శాతం తగ్గుతుందని కేంద్ర విద్యుత్‌ కార్యదర్శి పంకజ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. ఈ స్థాయి తగ్గింపు వల్ల దేశం మొత్తంగా చూస్తే.. గరిష్ఠంగా 3 గిగావాట్ల వరకు ఆదా చేయవచ్చునట. ‘దేశంలో దాదాపు 10 కోట్ల ఎయిర్‌ కండీషనింగ్‌ ఉపకరణాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 1.5 కోట్ల ఏసీలు కొత్తగా తోడవుతున్నాయి. ఏసీలతో 50 గిగావాట్ల విద్యుత్‌ ఖర్చు అవుతోంది. 

మొత్తం దేశీయ డిమాండ్‌లో ఇది సుమారు 20 శాతం. ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి, విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించే ప్రతిపాదిత చర్యలతో 2035 నాటికి భారత గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌లో 60 గిగావాట్లను ఆదా చేసే అవకాశం ఉంది’అని ఆయన తెలిపారు. ఇదే జరిగితే నూతన విద్యుత్‌ ఉత్పత్తి, గ్రిడ్‌ మౌలిక సదుపాయాల ఖర్చుల విషయంలో భారత్‌ ఏటా రూ.7.5 లక్షల కోట్లను ఆదా చేస్తుందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం అధ్యయనం వెల్లడించింది.  

2వేల కోట్ల యూనిట్ల ఆదా! 
ఏసీని 24 డిగ్రీల వద్ద వాడటం వల్ల.. వచ్చే కరెంటు బిల్లు మొత్తం తగ్గడమే కాదు, విద్యుత్తును కూడా భారీగా ఆదా చేయవచ్చని బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ) చెబుతోంది. ఖర్చు ఆదా, పర్యావరణ ప్రయోజనాల కోసం బాధ్యతాయుతంగా ఏసీ వినియోగాన్ని ప్రోత్సహించడానికి బీఈఈ పలు నగరాల్లో ఇంధన పరిరక్షణపై ప్రచారం చేస్తోంది. 

ఏసీలను 24ని డిగ్రీల వద్ద సెట్‌ చేస్తే.. సంవత్సరానికి 2,000 కోట్ల యూనిట్ల వరకు విద్యుత్‌ ఆదా అవుతుంది. తద్వారా రూ.10,000 కోట్లు పొదుపు చేయవచ్చు. సగం మంది వినియోగదారులు తమ సూచలను పాటించినా 1,000 కోట్ల యూనిట్ల విద్యుత్‌ ఆదా చేయవచ్చని, రూ.5,000 కోట్లు పొదుపు చేసినట్టేనని తెలిపింది. అంతేకాదు, కర్బన ఉద్గారాలు సంవత్సరానికి 82 లక్షల టన్నులు తగ్గుతాయని బీఈఈ వెల్లడించింది.  

కొత్తవి వచ్చేది 2027లోనే? ప్రస్తుతం ఏసీలు 16–30 డిగ్రీల సెట్టింగ్స్‌తో వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత నిబంధన ఈ ఏడాదే అమలులోకి వస్తే.. కొత్త ఏసీలు కనీసం 20, గరిష్టం 28 డిగ్రీల ఉష్ణోగ్రతతో మాత్రమే పనిచేసేలా కంపెనీ సెట్టింగ్స్‌తో వస్తా యి. కానీ ఈ కొత్త ఏసీలు ఇప్పుడే వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఏసీ తయారీ కంపెనీలకు 2025 సమ్మర్‌ సీజన్‌నిరాశను మిగిల్చింది. 

చాలా ప్రాంతాల్లో 2024 స్థాయిలో ఎండలు లేకపోవడం, అకాల వర్షాలతో వాతావరణం చల్లబడింది. దీంతో అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరగలేదు. డీలర్లు, తయారీ కంపెనీల వద్ద ఏసీ యూనిట్ల నిల్వలు పేరుకుపోయాయి. వీటి అమ్మకాలు జరిగేది 2026 సీజన్‌లోనే. వచ్చే ఏడాది భానుడు ప్రతాపం చూపిస్తే కొత్త ఏసీలు రంగ ప్రవేశం చేసే అవకాశం ఉంది.  

» దేశంలోఏసీలతో ఖర్చయ్యే మొత్తం విద్యుత్‌ 50 గిగావాట్లు 
» మొత్తం దేశీయ డిమాండ్‌లో ఇది సుమారు 20% 
» ఏసీలను 24 డిగ్రీల వద్ద సెట్‌ చేస్తే..  ఏడాదికి 2 వేలకోట్ల యూనిట్ల విద్యుత్‌ ఆదా  
» రూ.10,000 కోట్లు పొదుపు 
» ఏటా 82 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలుతగ్గుదల 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement