ఘోర అగ్నిప్రమాదం 17మంది బలి | 17 Dead In Fire At A Building In Gulzar Houz Near Charminar, More Details Inside | Sakshi
Sakshi News home page

ఘోర అగ్నిప్రమాదం 17మంది బలి

May 19 2025 5:43 AM | Updated on May 19 2025 11:01 AM

17 dead in fire at a building in Gulzar Houz near Charminar

ఎగసిపడుతున్న అగ్నికలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

పాతబస్తీలోని గుల్జార్‌హౌస్‌లో పెను విషాదం

మృతుల్లో 8 మంది చిన్నారులు

అందరూ బంధువులే..

భవనంలో షార్ట్‌ సర్క్యూట్, ఉడ్‌ పార్టీషన్‌ గదులతో మంటల వ్యాప్తి.. పొగ పీల్చడం వల్లే ఎక్కువ మంది మృతి

ఇరుకు మార్గాలు, మెట్ల మార్గానికి తాళంతో లోపల ఇరుక్కుపోయిన కుటుంబం.. లోపలన్నీ విషాద దృశ్యాలే

పిల్లలను కాపాడటానికి యత్నించిన మహిళలు.. వారిని హత్తుకొని అపస్మారక స్థితిలో కనిపించిన వైనం

రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పున, కేంద్రం రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌/చార్మీనార్‌/దూద్‌బౌలి:  అది హైదరాబాద్‌ పాతబస్తీలోని ఓ భవనం. ముందు దుకాణాలు ఉంటే, వెనుక అంతస్తుల్లో ఇళ్లు ఉన్నాయి. తెల్లవారుజామున అకస్మాత్తుగా విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ చోటుచేసుకుంది. దీంతో మంటలు చెలరేగాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు మొదటి, రెండో అంతస్తుల్లోకి దట్టమైన పొగ, మంటలు విస్తరించాయి. గ్రౌండ్, మొదటి, రెండో అంతస్తులో నిద్రిస్తున్న 23 మందిని చుట్టుముట్టాయి. మంటల తీవ్రతతో పాటు పొగ పీల్చడంతో అపస్మారక స్థితికి చేరుకున్న నాలుగు కుటుంబాలకు చెందిన 8 మంది చిన్నారులు సహా 17 మంది ప్రాణాలు కోల్పోయారు.

నలుగుర్ని అగ్నిమాపక సిబ్బంది కాపాడగా.. మంటల్ని తొలుత గమనించిన ఇద్దరు మహిళలు బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. మృతుల్లో కొందరికి కాలిన గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం 5.30–6.00 గంటల సమయంలో చార్మీనార్‌ సమీపంలోని గుల్జార్‌ హౌస్‌లో ఈ ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ నగర చరిత్రలో ఒకే అగ్ని ప్రమాదంలో ఇంత మంది చనిపోవడం, అంతా బంంధువులే కావడం ఇదే తొలిసారి. 

అంతా బంధువులే... 
    రాజస్తాన్‌కు చెందిన అన్నదమ్ములు ప్రహ్లాద్‌ మోడీ, రాజేందర్‌ మోడీ, బంకట్‌ మోడీ, దేవనాథ్‌ మోడీ, సునీల్‌ మోడీ ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చి బంగారం, వెండి, ముత్యాల వ్యాపారం చేస్తున్నారు. ప్రహ్లాద్‌ మోడీ, రాజేందర్‌ మోడీ, బంకట్‌ మోడీ తమ కుటుంబాలతో గుల్జార్‌ హౌస్‌లోని చార్మీనార్‌ రోడ్డులో ఉన్న భవనంలో నివసిస్తున్నారు. దీని ముందు భాగంలో శ్రీకృష్ణ పెరల్స్, మోడీ పెరల్స్‌ పేరుతో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. సునీల్‌ మోడీ అత్తాపూర్, దేవనాథ్‌ మోడీ హిమాయత్‌ నగర్‌లో ఉంటున్నారు.

గుల్జార్‌ హౌస్‌లోని దుకాణాల (జీ ప్లస్‌ వన్‌) వెనుక ఉన్న రెండు అంతస్తుల భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో గోదాములు, షాపులు, కార్ఖానాలు ఉండగా..మొదటి, రెండో అంతస్తుల్లో ప్రహ్లాద్, రాజేందర్, బంకట్‌ కుటుంబాలు ఉంటున్నాయి. రాజస్తాన్‌లో ఉండే సునీల్‌ బంధువులు వేసవి సెలవులు కావడంతో అత్తాపూర్‌కు వచ్చారు. వారాంతం నేపథ్యంలో శనివారం కొందరు బంధువులు గుల్జార్‌ హౌస్‌లోని ముగ్గురు అన్నదమ్ముల ఇళ్లకు వచ్చారు. ఇలా మొత్తం 23 మంది ఆ భవనంలో శనివారం రాత్రి నిద్రపోయారు.  

Charminar Gulzar House: ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి

మీటర్‌ వద్ద మొదలైన మంటలు 
    ఈ భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న కరెంట్‌ మీటర్లతో పాటు సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద కూడా కొన్ని రోజులుగా నిప్పు రవ్వలు ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న కరెంట్‌ మీటర్ల వద్ద షార్ట్‌ సర్క్యూట్‌ జరిగింది. దీంతో అక్కడ మొదలైన మంటలు మొదటి, రెండో అంతస్తులకు విస్తరించాయి. మంటలకు ఫస్ట్‌ ఫ్లోర్‌లో ఉన్న ఏసీ కంప్రెషర్‌ పేలడంతో అగ్ని కీలలు మరింత ఎగిశాయి. ఉదయం సుమారు 6.15 గంటల సమయంలో వీటిని గుర్తించిన గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని ఇద్దరు మహిళలు బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు.

మంటలు అంటుకున్న విషయాన్ని అక్కడి వారికి చెప్పారు. ఉదయం 6.16 గంటలకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. 6.20 గంటలకు మొఘల్‌పుర నుంచి మొదటి ఫైర్‌ ఇంజన్‌ ఆ ప్రాంతానికి చేరుకుంది. అదే సమయంలో మక్కా మసీదులో ప్రార్థనలు ముగించుకుని బయటకు వచి్చన ఐదుగురు యువకులు ఈ భవనం వద్దకు చేరుకురు. అప్పటికే మంటలు, దట్టమైన పొగ ఆ భవనాన్ని చుట్టేశాయి. రోడ్డు పైన ఉన్న ఇద్దరు మహిళలు భవనంలో తమ కుటుంబీకులు ఉన్నారని, వారిని కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. దీంతో అగ్నిమాపక శాఖ అధికారులతో పాటు ఐదుగురు యువకులూ ఇంట్లోకి వెళ్లే మార్గాల కోసం అన్వేíÙంచారు.  

భవనానికి 3 అడుగులు, 1 అడుగు మార్గాలే.. 
    మోడీ కుటుంబాలు నివసించే ఈ భవనం ముందు రోడ్డు వైపు శ్రీకృష్ణ, మోడీ పెరల్స్‌తో పాటు ఇతర దుకాణాలు ఉన్నాయి. వెనుక వైపు ఉన్న నివాస భవనంలోకి వెళ్లడానికి ఓ చోట మూడు అడుగులు, మరోచోట అడుగు వెడల్పుతో ఉన్న మార్గాలే ఉన్నాయి. భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి మొదటి, రెండో అంతస్తులకు వెళ్లడానికి కేవలం రెండున్నర అడుగుల వెడల్పుతో ఉన్న ఒకే ఒక్క మెట్లగది (స్టెయిర్‌ కేస్‌) ఉంది. మూడు అడుగుల వెడల్పు మార్గం ఉత్తర దిక్కున ఉండగా.. ఈ మెట్లు దక్షిణ దిక్కున ఉన్నాయి. దీంతో వ్యాపించిన మంటలు, పొగలో ఆ మెట్ల వద్దకు చేరుకోవడం సాధ్యం కాలేదు. భవనంలో ఎక్కువగా వుడ్‌ (చెక్క) పార్టీషన్‌తో ఉన్న గదులు ఎక్కువగా ఉండటం మంటలు త్వరగా వ్యాపించడానికి కారణమైంది. 

గోడలకు రంధ్రాలు చేసి లోపలకు.. 
    పక్కన ఉన్న మరో భవనం మొదటి అంతస్తుకు చేరిన యువకులు, అగ్నిమాపక శాఖ అధికారులు అక్కడ ఉన్న, ఈ భవనంలోని మరో గోడకు రంధ్రాలు చేసి ఇంట్లోకి నీళ్లు చిమ్మారు. మంటలు కొద్దిగా అదుపులోకి వచ్చాక మొదటి అంతస్తులోకి వెళ్లిన అధికారులు, యువకులు అక్కడ దాదాపుగా అపస్మారక స్థితిలో ఉన్న 17 మందితో పాటు రెండో అంతస్తు నుంచి టెర్రస్‌ పైకి వెళ్లి పొగతో ఉక్కిరిబిక్కిరైన నలుగురిని బయటకు తీసుకువచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న 17 మందిని వివిధ ఆస్పత్రులకు తరలించగా వారు చనిపోయినట్లు వైద్యవర్గాలు ప్రకటించాయి. 

అపస్మారక స్థితిలో..సెల్‌ఫోన్‌ లైట్‌ వెలుగుతూ.. 
    సహాయ చర్యల సందర్భంగా భవనం మొదటి అంతస్తులోని గదుల్లో అత్యంత హృదయ విదారక దృశ్యాలు కన్పించినట్లు అధికారులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. లోపల నుంచి గడియ పెట్టి ఉన్న ఓ గదిలో ఓ మహిళతో పాటు నలుగురు చిన్నారులు ఒకేచోట పడిపోయి ఉన్నారు. ఇంకో గదిలో మరో నలుగురు చిన్నారులతో పాటు ఉన్న మహిళ ఓ మూలన అపస్మారక స్థితిలో కూర్చుని ఉంది. అయితే ఆమె చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ లైట్‌ వెలుగుతూ కన్పించింది. చిన్నారులు కూడా అపస్మారక స్థితిలోనే ఉన్నారు. దొంగల భయంతో భవనం టెర్రస్‌ పైకి వెళ్లే స్టెయిర్‌ కేస్‌కు గేటు ఏర్పాటు చేసుకున్న మోడీ కుటుంబీకులు దానికి తాళం వేశారు. మొదటి అంతస్తుకు, రెండో అంతస్తుకు మధ్య ఉన్న గేటుకు తాళం వేయడంతో పొగలో రెండో అంతస్తులో ఉన్న వాళ్లు పైకిగానీ, కిందికి గానీ వెళ్లడానికి వీల్లేకుండా పోయింది.   

భార్య, పిల్లల కోసం లోపలికి వెళ్లి.. 
    ప్రహ్లాద్‌ మోడీ పెద్ద కుమారుడైన పంకజ్‌ మోడీ అగ్ని ప్రమాదాన్ని గుర్తించి మొదటి అంతస్తులోని గదిలోంచి బయటికి వచ్చి పోలీసు, ఫైర్‌ విభాగాలకు సమాచారం ఇచ్చారు. ఆపై తన భార్య, పిల్లల్ని రక్షించడం కోసం మళ్లీ గదిలోకి వెళ్లారు. ఇంతలో దట్టమైన పొగలు, మంటలు వ్యాపించాయి. భార్య పిల్లలతో సహా పంకజ్‌ మోడీ కూడా వాటిల్లో చిక్కుకుని బయటకు రాలేకపోయారు. తాను తప్పించుకునే అవకాశం వచి్చనా కుటుంబ సభ్యులను కాపాడాలని ప్రయత్నించిన పంకజ్‌ మోడీ చనిపోవడం స్థానికుల హృదయాలను కలచివేసింది.  

ప్రహ్లాద్‌ కుటుంబం అంతా మృత్యువాత 
    ఈ ప్రమాదంలో ప్రహ్లాద్‌ మోడీ కుటుంబంలోని అంతా చనిపోయారు. ప్రహ్లాద్‌ మోడీకి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. వేసవి సెలవులకు తన తండ్రి ప్రహ్లాద్‌ మోడీ ఇంటికి వచి్చన కుమార్తెలు వారి చిన్నారులు మృతి చెందారు. ప్రహ్లాద్‌ మోడీ మరో సోదరుడైన బంకట్‌ మోడీ టెర్రస్‌ పైకి వెళ్లి ప్రాణాలు రక్షించుకున్నారు. అయితే ఆయన కుమారుడు అభిషేక్‌ మోడీ, ఆయన భార్య మృతి చెందారు. బంకట్‌ మోడీతో పాటు రాజేందర్‌ మోడీతో పాటు ఆయన భార్య, మరో వ్యక్తి టెర్రస్‌ పైకి వెళ్లడంతో బతికిపోయారు. గోవింద్‌ మోడీ కుటుంబ సభ్యులు అత్తాపూర్‌లో నివసిస్తుండడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రహ్లాద్‌ మోడీ కుటుంబ సభ్యులతో పాటు షోరూంల్లో పనిచేసే సిబ్బంది సైతం ఇదే భవనంలో నివసిస్తుంటారు. వేసవి కాలం కావడంతో ఆ పని వారంతా టెర్రస్‌ పైన పడుకోవడంతో మృత్యువు నుంచి తప్పించుకున్నారు.  

కిషన్‌రెడ్డి, పొన్నం, డీజీపీ సందర్శన 
    కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ జితేందర్, నగర సీపీ సీవీ ఆనంద్, అగ్నిమాపక శాఖ డీజీ వై.నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్, మేయర్‌ విజయలక్ష్మి, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఎమ్మెల్యేలు మీర్‌ జుల్పికర్‌ అలీ, అహ్మద్‌ బలాల, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఘటనా స్థలాన్ని సందర్శించారు.  

అగ్నిమాపక శాఖపై కిషన్‌రెడ్డి ఫైర్‌ 
    కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అగ్నిమాపక శాఖపై ఆరోపణలు చేశారు. ఫైర్‌ ఇంజన్లు అర్ధగంట ఆలస్యంగా వచ్చాయన్నారు. అధికారుల వద్ద ప్రత్యేక, ఆధునిక అగ్నిమాపక ఉపకరణాలు లేవని మండిపడ్డారు. దీనివల్లే రెస్క్యూ ఆపరేషన్‌ ఆలస్యమై ప్రాణ నష్టం పెరిగిందని అన్నారు. ఈ ఆరోపణల్ని అగ్నిమాపక శాఖ డీజీ ఖండించారు. తమకు ఉదయం 6.16 గంటలకు కాల్‌ వచి్చందని, మొఘల్‌పుర నుంచి 6.17కు బయలుదేరిన మొదటి ఫైరింజన్‌ 6.20 గంటలకు ప్రమాద స్థలికి చేరిందని స్పష్టం చేశారు. వెంటనే తీవ్రతను అంచనా వేసి మరో పది ఫైరింజన్లు, 70 మంది సిబ్బందిని మోహరించామని వివరించారు. ఆ భవనానికి ఒకే ఒక స్టెయిర్‌ కేస్‌ ఉండటం, అదీ ఇరుకైనది కావడంతో పాటు ఇతర కారణాలు ప్రమాద తీవ్రతను పెంచాయని అన్నారు. కాగా అగ్ని ప్రమాదంపై చార్మీనార్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. 

మృతులు వీరే: 
ప్రహ్లాద్‌ మోడీ (70), మున్ని (70), రాజేందర్‌ మోడీ (25), సుమిత్ర (60) హామీ (7), అభిషేక్‌ (31), శీతల్‌ (35), ప్రియాంచ్‌ (4), ఇరాజ్‌ (2), అరుషి (3), రిషబ్‌ (4), ప్రథం (ఒకటిన్నర ఏళ్లు), అనియాన్‌ (3), వర్ష (35), పంకజ్‌ (36), రజిని (32) ఇద్దూ (4).  

మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి చూపించాడు.. 
ప్రతిరోజూ తెల్లవారుజామున ప్రార్థనల కోసం మక్కా మసీదుకు వస్తుంటాం. ఆదివారం ఉదయం ప్రార్థనలు ముగించుకుని బయటకు వచ్చా. ఆ సమయంలో మసీదు గేటు వద్ద నిలుచుని ఉన్న మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తి డబ్బు అడగటంతో రూ.10 ఇచ్చా. అతడే గుల్జార్‌హౌస్‌ వద్ద పొగలు వస్తున్న భవనాన్ని చూపించాడు. నేను వెంటనే మరో నలుగురితో కలిసి అక్కడకు పరిగెత్తుకుంటూ వెళ్లా. గోడలకు రంధ్రాలు చేసి అగ్నిమాపక సిబ్బందితో కలిసి లోపలకు వెళ్లాం. అయినా 17 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధ కలిస్తోంది.  – మీర్‌ జాహెద్, గుల్జార్‌ హౌస్‌ వద్ద గాజుల వ్యాపారి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement