T20 WC 2022: వరల్డ్‌కప్‌ గెలవడం కంటే టీమిండియాను ఓడించడమే ముఖ్యం: పాక్‌ ఆల్‌రౌండర్‌

Whether We Win World Cup Or Not, We Have To Beat Against India Says Shadab Khan - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022 చివరి అంకానికి చేరుకుంది. మెల్‌బోర్న్‌లో ఇవాళ (నవంబర్‌ 13) ఇంగ్లండ్‌-పాకిస్తాన్‌ జట్లు టైటిల్‌ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌ వైస్‌ కెప్టెన్‌, ఆ జట్టు కీలక ఆల్‌రౌండర్‌ షాదాబ్‌ ఖాన్‌ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమకు వరల్డ్‌కప్‌ గెలవడం కంటే టీమిండియాను ఓడించామా లేదా అన్నదే ముఖ్యమంటూ బిల్డప్‌ మాటలు మాట్లాడాడు.

వరల్డ్‌కప్‌ గెలిచామా లేదా అన్నది పాక్‌లో ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరని, తమ దేశీయులు ఇండియాపై గెలిస్తే చాలనుకుంటారని స్కై స్పోర్ట్స్‌ ఛానల్‌లో నాస్సర్‌ హుసేన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా వ్యాఖ్యానించాడు. పాక్‌ ప్రజల ఈ ఆకాంక్ష తమపై సహజంగానే ఒత్తిడి పెంచుతుందని, ఈ క్రమంలోనే పలు సందర్భాల్లో టీమిండియా చేతిలో ఓడామని అన్నాడు.

ప్రస్తుత వరల్డ్‌కప్‌ సూపర్‌-12 దశలో టీమిండియా చేతిలో ఓటమిపై షాదాబ్‌ స్పందిస్తూ.. మాకు తెలుసు టీమిండియా కంటే తమదే ఉత్తమమమైన జట్టు అని, అయితే ఆఖర్లో తడబడటం వల్లే ఓటమిపాలయ్యామని తెలిపాడు. భారత్‌తో సమరం అంటే, మాపై ఎంత ఒత్తిడి ఉంటుందో, వారిపై కూడా అదే స్థాయిలో ఒత్తిడి ఉంటుందని అన్నాడు. ప్రస్తుతానికి ఇంగ్లండ్‌తో జరుగబోయే ఫైనల్‌ పైనే తమ దృష్టి అంతా ఉందని, టీమిండియాతో మ్యాచ్‌కు ముందు ఎలాంటి ప్రెజర్‌ ఉంటుందో, ఈ మ్యాచ్‌కు ముందు కూడా అలాంటి ఫీలింగే కలుగుతుందని పేర్కొన్నాడు.

ఏదిఏమైనప్పటికీ ఏమాత్రం ఆశలు లేని స్థాయి నుంచి ఫైనల్‌ దాకా వచ్చిన మేము తప్పకుండా వరల్డ్‌కప్‌తోనే ఇంటికి వెళ్తామంటూ ధీమా వ్యక్తం చేశాడు. కాగా, పాక్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ భారత కాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే.  
చదవండి: T20 World Cup 2022: ఆఖరి పోరాటం

 

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top