
మోంటెకార్లో: భారత ఆటగాడు రోహన్ బోపన్న 44 ఏళ్ల వయసులో టెన్నిస్ వరల్డ్ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఇటీవలే నంబర్‌వన్‌కు చేరాడు. సింగిల్స్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ కూడా తాజా ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచిన అతి పెద్ద వయస్కుడిగా (36 ఏళ్లు) గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య తమ వయసుకు సంబంధించిన ఆసక్తికర సంభాషణ జరిగింది. ‘టెన్నిస్ మనకు ఎంతో నేర్పించింది. అనుభవం మంచి విజయాలు అందిస్తుంది.
ఇప్పుడు మనకు కావాల్సినంత ఉంది‘ అని బోపన్న వ్యాఖ్యానించగా... ‘అనుభవం మాత్రమే కాదు. ప్రతీ రోజు ఆట పట్ల అంకితభావం చూపడమే మనల్ని ఈ స్థానంలో నిలిపింది’ అని జొకోవిచ్ బదులిచ్చాడు. ఇద్దరు నంబర్‌వన్ ఆటగాళ్లు కలిసిన అరుదైన ఘట్టం సెర్బియా, భారత టెన్నిస్‌కు సంబంధించి ప్రత్యేకమైందన్న జొకోవిచ్...త్వరలోనే భారత గడ్డపై ఆడాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ తమ సంభాషణను నమస్తేతో జొకోవిచ్ ముగించాడు.