వృద్ధురాలి హత్య.. పట్టించిన "కింగ్‌ కోహ్లి"..! 

King Kohli Written On Auto Rickshaw Helps Police Track Women Killers In Bengaluru - Sakshi

"కింగ్‌ కోహ్లి" ఓ హత్య కేసును ఛేదించడంలో పోలీసులకు పరోక్షంగా తోడ్పడ్డాడు. వివరాల్లో వెళితే..బెంగళూరులోని మహాలక్ష్మీపురంలో నివసించే కమలమ్మ (82) అనే వృద్ద మహిళను కొందరు దుండగులు నగలు, డబ్బు కోసం హత్య చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభించకపోగా.. కింగ్‌ కోహ్లి పేరు వారికి ఈ కేసును ఛేదించడంలో తోడ్పడింది.

మే 27న కమలమ్మ​ ఇంట్లో ఒంటిరిగా ఉండటాన్ని గమనించిన సిద్దరాజు, అశోక్‌, అంజనా మూర్తి అనే మగ్గురు వ్యక్తులు ఓ నంబర్‌ ప్లేట్‌ లేని ఆటోలో వచ్చి హత్యకు పాల్పడ్డారు. ఆ తర్వాత వారు మహిళ ఒంటిపై ఉన్న నగలు, ఇంట్లో ఉన్న కొంత నగదును దోచుకుని పరారయ్యారు. కేసు దర్యాప్తు చేసే క్రమంలో తొలుత పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.

అయితే హత్య జరిగిన రోజు ఉదయం కమలమ్మ​ ఇంటి పరిసరాల్లో "కింగ్‌ కోహ్లి" పేరు టాప్‌ వెనక భాగంపై రాసి ఉన్న ఓ నంబర్‌ ప్లేట్‌ లేని ఆటో అనుమానాస్పదంగా సంచరించడాన్ని పోలీసులు గుర్తించారు. దీని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు సీసీ టీవీ ఫుటేజ్‌లు పరిశీలించే క్రమంలో ఓ కీలక ఆధారం దొరికింది. హత్య జరిగిన రోజు కమలమ్మ ఇంటి సమీపంలో అంజనా మూర్తి అనే వ్యక్తి కింగ్‌ కోహ్లి అనే పేరు రాసి ఉన్న ఆటోకు నంబర్‌ ప్లేట్‌ తొలగిస్తూ కనిపించాడు.

నంబర్‌ ప్లేట్‌పై రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకుని, కటకటాల వెనక్కు పంపారు. ఈ రకంగా కింగ్‌ కోహ్లి ఓ హత్య కేసును ఛేదించడంలో పోలీసులకు తోడ్పడ్డాడు. ఐపీఎల్‌ బెట్టింగ్‌ల కారణంగా నిందితులు అప్పులపాలై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. 

కాగా, ప్రస్తుతం విరాట్‌ కోహ్లి డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్నాడు. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జూన్‌ 7 నుంచి 11 వరకు ఈ మ్యాచ్‌ జరుగుతుంది. ప్రతిష్టాత్మకమైన ఈ మ్యాచ్‌ కోసం​ కోహ్లి కఠోరంగా శ్రమిస్తున్నాడు. ఐపీఎల్‌ ఫామ్‌ను ఇక్కడ కూడా కొనసాగించి, తన జట్టుకు ఎలాగైనా ఐసీసీ ట్రోఫీ అందించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top