పంజాబ్‌ చేతిలో ఓటమి అనంతరం పంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు | IPL 2026: LSG Skipper Rishabh Pant Comments After Losing to Punjab Kings | Sakshi
Sakshi News home page

పంజాబ్‌ చేతిలో ఓటమి అనంతరం పంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Apr 20 2026 8:08 AM | Updated on Apr 20 2026 8:38 AM

IPL 2026: LSG Skipper Rishabh Pant Comments After Losing to Punjab Kings

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 19) రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ 54 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ అతి భారీ స్కోర్‌ (254-7) చేసింది. ప్రియాంశ్‌ ఆర్య (93), కూపర్‌ కన్నోల్లీ (87) ఆకాశమే హద్దుగా చెలరేగారు.

అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్య ఛేదనలో లక్నో చేతులెత్తేసింది. ఒక్కరు కూడా భారీ స్కోర్‌ చేయలేకపోవడంతో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగుల వద్ద ఆగిపోయింది. మార్ష్‌ (40), బదోని (35), పంత్‌ (43), మార్క్రమ్‌ (42) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు.

జన్సెన్‌ (4-0-37-2), విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ (4-0-30-1), చహల్‌ (4-0-36-1) లక్నో బ్యాటర్లను కట్టడి వేశారు. ఈ ఓటమి లక్నోకు వరుసగా మూడవది. 6 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించిన ఈ జట్టు పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి పడిపోయింది. మరోవైపు పంజాబ్‌ ఓటమనేదే ఎరుగక, వరుస విజయాలతో దూసుకుపోతూ పాయింట్ల పట్టికలో అగ్రపీఠంపై తిష్ట వేసింది. ఈ జట్టు ఆరింట ఐదు విజయాలు సాధించింది.

మ్యాచ్‌ అనంతరం లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ జట్టు ప్రదర్శన, తన గాయం, బ్యాటింగ్‌ ప్లాన్స్‌ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  

గాయం గురిం​చి మాట్లాడతూ.. పాత గాయం (Left elbow) మానుతుంది. ఈ లోపే కొత్త గాయం (right hand) జతకలిసింది. అయినా పాజిటివ్‌గా తీసుకుంటాను (నవ్వుతూ).

ఓటమిపై విశ్లేషిస్తూ.. ఒక్కటని చెప్పలేము. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నారు. బ్యాటింగ్‌లో మాత్రం కొన్ని సమస్యలు ఉన్నాయి. నెగిటివ్స్‌ మాత్రమే కాకుండా పాజిటివ్స్‌కు ఉన్నాయి. వాటిని బిల్డ్‌ చేసుకోవాలి. పంజాబ్‌ కింగ్స్‌ చాలా బాగా ఆడింది. వారికి క్రెడిట్‌ ఇవ్వాలి.  

బదోనిని ఓపెనర్‌గా పంపడంపై మాట్లాడుతూ.. ఇది ఈ మ్యాచ్‌కు ముందు తీసుకున్న నిర్ణయం కాదు. చాలా రోజుల క్రితమే అనుకున్నాము. టాపార్డర్‌కు ఫ్రీడం ఇవ్వాలని, మిడిలార్డర్‌ వారికి మద్దతుగా ఉండాలన్నదే మా ప్లాన్‌.

జట్టు ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. మా జట్టుపై నమ్మకం ఉంది. ప్రతి మ్యాచ్‌లో పాజిటివ్‌గా ఆడి, మెరుగుపడాలనుకుంటున్నాము.

పంత్‌ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. వరుస ఓటములు ఎదురైనా పాజిటివ్‌గా ఉండాలని అనుకున్నట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా అతని గాయంపై కూడా అప్‌డేట్‌ ఇచ్చాడు. బౌలింగ్‌ బాగానే ఉందని చెబుతూ, బ్యాటింగ్‌లో లోపాలను ప్రస్తావించాడు. బదోనిని ఓపెనర్‌గా పంపడాన్ని సమర్దించుకున్నాడు. ప్రతి మ్యాచ్‌లో మెరుగుపడాలని ఆకాంక్షిస్తున్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement