
దుబాయ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టి20 సిరీస్‌లో నిలకడగా రాణిస్తున్న భారత స్పిన్నర్ దీప్తి శర్మ... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల టి20 ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానానికి చేరువైంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో దీప్తి శర్మ ఒక స్థానం పురోగతి సాధించి రెండో ర్యాంక్‌కు చేరుకుంది. గత ఆరేళ్లగా టాప్–10లో కొనసాగుతున్న దీప్తి తన కెరీర్‌లో తొలిసారి టాప్ ర్యాంక్ అందుకునేందుకు దగ్గరగా వచ్చింది.
ప్రస్తుతం దీప్తి ఖాతాలో 738 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. 746 పాయింట్లతో పాకిస్తాన్ బౌలర్ సాదియా ఇక్బాల్ నంబర్‌వన్ స్థానంలో ఉంది. ఇంగ్లండ్‌తో మరో రెండు టి20లు జరగాల్సి ఉన్న నేపథ్యంలో దీప్తి శర్మ విశేషంగా రాణిస్తే తదుపరి ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌ను అందుకునే అవకాశముంది.
‘హండ్రెడ్’ టోర్నీకి దూరం
వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో జరిగే ‘హండ్రెడ్’ టోర్నీ నుంచి దీప్తి శర్మ వైదొలిగింది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్, టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. దీప్తి వైదొలిగిన నేపథ్యంలో ఈసారి ‘హండ్రెడ్’ టోర్నీలో భారత ప్రాతినిధ్యం ఉండటంలేదు. గత సీజన్ ఫైనల్లో దీప్తి శర్మ చివరి ఓవర్‌లో కొట్టిన సిక్స్‌తో లండన్ స్పిరిట్స్ జట్టు తొలిసారి ‘హండ్రెడ్’ ట్రోఫీని సొంతం చేసుకోవడం విశేషం. గత సీజన్‌లో లండన్ స్పిరిట్స్ జట్టు దీప్తి శర్మకు 36 వేల పౌండ్లు చెల్లించింది.