కౌన్సిలర్‌గా పీహెచ్‌డీ అభ్యర్థి
కౌన్సిలర్లలోనే ఉన్నత విద్యావంతురాలు
నారాయణఖేడ్: ఖేడ్ మున్సిపాలిటీలో ఎన్నికై న కౌన్సిలర్లలోకెల్లా ఉన్నత విద్యావంతురాలు సురేఖ. ఈమె రెండవ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 244 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ పూర్తి చేసి పీహెచ్‌డీకి సిద్ధమవుతుండగా ఎన్నికలు వచ్చాయి. అయితే రెండో వార్డు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు రిజర్వు కావడంతో మన్సుపూర్‌కు చెందిన సురేఖ పోటీ చేశారు.
ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి
న్యాల్‌కల్(జహీరాబాద్): మండల పరిధిలోని న్యాల్‌కల్, రుక్మాపూర్, గుంజోటి, ముంగి తదితర తండాల్లో ఆదివారం గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని గిరిజనులు ఘనంగా నిర్వహించారు. న్యాల్‌కల్ తండాలో సేవాలాల్ మహారాజ్ ఆలయం ఆవరణలో గిరిజనులు యజ్ఞాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముంగి ఆదిలక్ష్మి ఆశ్రమ పీఠాధిపతి దేవగిరి మహరాజ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఆశ్రమం నుంచి ప్రారంభమైన ర్యాలీ ముంగి మీదుగా న్యాల్‌కల్‌కు చేరుకుంది. న్యాల్‌కల్‌లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. గిరిజన మహిళలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ సిద్దిలింగయ్యస్వామి, రుక్మాపూర్ సర్పంచ్ సురేశ్, నాయకులు ప్రవీణ్‌కుమార్, సక్కులాల్, బస్వరాజ్, యూనూస్ ఖాన్, కాశప్ప, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.
అలరించిన సంగీత విభావరి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి గంజి మైదానంలో ఆదివారం ఘనంగా మహాశివరాత్రి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా రాత్రి నిర్వహించిన సంగీత విభావరి ఆహుతుల్ని ఎంతగానో అలరించింది. ప్రముఖ సినీ నేపథ్య గాయకులు పాడిన భక్తి గీతాలు ఆధ్యాత్మిక శోభను నింపాయి. వీణా విద్వాంసురాలు వీణావాణి ప్రత్యేక కార్యక్రమం జరిగింది. నేపథ్య గాయకులు వందేమాతరం శ్రీనివాస్, మనో, శ్రీ కృష్ణ, గాయనీమణులు కల్పన, సురేఖదివాకర్ల, మాళవిక తదితరులు పాటలు పాడి అలరించారు.
కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి జోన్: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం చైర్మన్, వైస్‌చైర్మన్‌ల ఎంపిక కార్యక్రమంలో అధికారులు పాల్గొననున్న సందర్భంగా ప్రజావాణి నిలిపివేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని గమనించి ప్రజలు ఎవరూ ప్రజావాణి దృష్ట్యా ఎవరూ కలెక్టరేట్‌కు రావొద్దని తెలిపారు.
వచ్చే శివరాత్రికి
గౌరవెల్లికి గోదారి జలాలు
మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్ రూరల్: మెట్ట ప్రాంతానికి ‘గంగ’ను విడిచి కరువును పారద్రోలాలని పరమశివుడిని ప్రార్థించానని, వచ్చే శివరాత్రి వరకు గౌరవెల్లి ప్రాజెక్టులోకి గోదారి జలాలు తెస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆదివారం మహాశివరాత్రి ఉత్సవాల్లో పొట్లపల్లి స్వయంభు రాజేశ్వరస్వామికి మంత్రి పట్టు వస్త్రాలు సమర్పించి శివుడికి పాలాభిషేకం చేశారు. ప్రజలు సంతోషంగా ఉండాలని, వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నట్లు చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి తన కృషికి తోడు హరహర మహాదేవుడి అనుగ్రహం ఉంటే గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వలకు గోదావరి నీళ్లు పరుగులు తీస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, స్వామివారి దర్శనం కోసం భక్తులు వేల సంఖ్యలో తరలిరావడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఆలయ ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది.
కౌన్సిలర్‌గా పీహెచ్‌డీ అభ్యర్థి


