సదా పట్టపురాణులే!!
● 2005 నుంచి చైర్‌పర్సన్లుగామహిళలు ● ఇప్పుడూ మహిళకే రిజర్వు
సదాశివపేట(సంగారెడ్డి): సదాశివపేట మున్సిపాలిటీలో 2005 నుంచి మహళ కౌన్సిలర్లే చైర్ పర్సన్ పీఠాన్ని అధిరోహిస్తున్నారు. 2005లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన కౌన్సిలర్ కొత్తగొల్ల అనురాధ అనూహ్యంగా చైర్‌పర్సన్ పదవిని చేజిక్కించుకున్నారు. అప్పట్లో టీడీపీ అత్యధికంగా తొమ్మిది స్థానాలు కై వసం చేసుకుంది. చైర్‌పర్సన్ పదవి బీసీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. ప్రస్తుత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ 2005లో టీడీపీ కౌన్సిలర్‌గా గెలిచినప్పటికీ ఆయన చైర్మన్ కాకూడదని అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్, బీజేపీ, కొందరు టీడీపీ కౌన్సిలర్ల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి కొత్తగొల్ల అనురాధను ఏకగ్రీవంగా చైర్‌పర్సన్ చేశారు.
కాంగ్రెస్ అధిక స్థానాల్లో గెలుపొందినా..
2014లో జరిగిన ఎన్నికల్లో నాటి టీఆర్‌ఎస్
పార్టీ చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంది. ఎన్నికల్లో కాంగ్రెస్ 13 స్థానాల్లో గెలుపొందినా చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వు కావడంతో ఆ పీఠాన్ని ఆశించే వారు అధికంగా ఉండటంతో పట్నం విజయలక్ష్మి తన మద్దతుదారులతో కలసి టీఆర్‌ఎస్ పార్టీలో చేరి చైర్‌పర్సన్ పదవిని చేజిక్కించుకున్నారు.
2020లో జరిగిన ఎన్నికల్లోనూ చైర్‌పర్సన్ పీఠం బీసీ మహిళకే రిజర్వు అయ్యింది. టీఆర్‌ఎస్ 13, కాంగ్రెస్ 9, ఎంఐఎం 2, స్వతంత్ర 1 అభ్యర్థులు గెలుపొందారు. ఎంఐఎం, స్వతంత్ర కౌన్సిలర్ల సహకారంతో టీఆర్‌ఎస్ కౌన్సిలర్ పిల్లోడి జయమ్మ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. నాలుగేళ్ల తర్వాత బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు చైర్‌పర్సన్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో 26వ వార్డు కౌన్సిలర్ అపర్ణపాటిల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికై ఏడాదిపాటు చైర్‌పర్సన్ పదవి చేపట్టారు. ప్రస్తుతం చైర్‌పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వుకావడంతో 20వ వార్డు నుంచి గెలుపొందిన మునిపల్లి అంజమ్మ పుర పీఠాన్ని చేజిక్కించుకోనున్నారు.


