జహీరా‘బాద్‌షా’పై సస్పెన్స్‌ | - | Sakshi
Sakshi News home page

జహీరా‘బాద్‌షా’పై సస్పెన్స్‌

Feb 16 2026 8:22 AM | Updated on Feb 16 2026 8:22 AM

జహీరా‘బాద్‌షా’పై సస్పెన్స్‌

జహీరా‘బాద్‌షా’పై సస్పెన్స్‌

● కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లో చైర్మన్‌ పదవికి నెలకొన్న పోటీ ● పూర్తి మెజార్టీ లేకున్నా చాంతాడంత ఆశావహులు

● కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లో చైర్మన్‌ పదవికి నెలకొన్న పోటీ ● పూర్తి మెజార్టీ లేకున్నా చాంతాడంత ఆశావహులు

జహీరాబాద్‌: జహీరాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి ఎంపిక విషయంలో ఇప్పటికీ పీటముడి వీడలేదని సమాచారం. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు పూర్తి మెజార్టీ లేకున్నా చైర్మన్‌ పదవి విషయంలో ఆశావాహుల సంఖ్య మాత్రం ఈ రెండు పార్టీల నుంచి చాంతాడంతా ఉంది. కౌన్సిల్‌లో 37 స్థానాలకుగాను బీఆర్‌ఎస్‌ 15, కాంగ్రెస్‌ 14, బీజేపీ 3 స్థానాల్లో విజయం సాధించాయి. రెండు స్థానాల్లో ఎంఐఎం, మూడు స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు. చైర్మన్‌ పదవిని దక్కించుకునేందుకు 19 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది. కాంగ్రెస్‌ తనకు ఉన్న అవకాశాలన్నింటిని ఉపయోగించుకునే పనిలో ఉంది. స్వతంత్ర అభ్యర్థులతోపాటు ఎంఐఎం అభ్యర్థులు ఇప్పటికే కాంగ్రెస్‌కు సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం సాగుతోంది. అయినా చైర్మన్‌ పదవి ఎంపిక అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఐదుగురు అభ్యర్థులు చైర్మన్‌ పదవిని గట్టిగా ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కౌన్సిలర్‌లతోపాటు పార్టీ ముఖ్య నాయకులతో అభిప్రాయ సేకరణ చేపట్టిన అనంతరమే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు తగినంత కోరమ్‌ సమకూర్చుకున్నట్లయితే చైర్మన్‌ అభ్యర్థి ఎంపిక ఒక రోజు ముందుకు జరిగే అవకాశమూ లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీఆర్‌ఎస్‌లో సైతం చైర్మన్‌ పదవి కోసం పోటీ తీవ్రంగా ఉంది. ముగ్గురు వ్యక్తులు చైర్మన్‌ పదవిని బలంగా ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి మెజార్టీ లేకపోవడంతో బీజేపీ సభ్యులతోపాటు ఎక్స్‌అఫీషియో సభ్యుల మద్దతు కూడగట్టి చైర్మన్‌ పదవిని దక్కించుకునే ప్రయత్నంలో ఉంది. అందులోభాగంగానే ఒక రాజ్యసభ, ఒక ఎమ్మెల్సీ సభ్యులతో ఎక్స్‌అఫీషియో సభ్యత్వం కోసం మున్సిపాలిటీలో దరఖాస్తు చేయించింది. వీరి దరఖాస్తులు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఒకవైపు చైర్మన్‌ అభ్యర్థుల ఎంపిక ఆయా పార్టీల అధిష్టానవర్గాలకు తలనొప్పిగా మారగా, మరోపక్క పదవిని దక్కించుకునేందుకు అవసరమైన బలాన్ని సమకూర్చుకోవడం తలకు మించిన భారంగా పరిణమించింది. దీంతో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. చైర్మన్‌ పదవిని దక్కించుకునే విషయంలో ఎవరిది పైచేయి అవుతుందో వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement