కేతకీ.. శివోహం
● కేతకీలో అంబరాన్నంటినశివరాత్రి వేడుకలు
ఝరాసంగం(జహీరాబాద్): శ్రీ కేతకీ సంగమేశ్వరాలయం భక్తుల శివనామస్మరణతో మార్మోగింది. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అర్ధరాత్రి 12 దాటగానే ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు ప్రాతఃకాల పూజ అనంతరం దర్శనాలు ప్రారంభించారు. క్యూలలో గంటల తరబడి వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. గత 41 రోజులుగా శివమాల ధరించిన భక్తులు ఇరుముడి సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ ఆవరణలోని అమృతగుండంలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించి సన్మానించారు.
పూజలు నిర్వహించిన మంత్రి దామోదర
కేతకీలో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ సునీతాపాటిల్, మాజీ ఎంపీపీ హన్మంత్‌రావుపాటిల్, పాలక మండలి చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.


