ఖేడ్‌లో అగ్నిప్రమాదం
రూ.2 లక్షల ఆస్తి నష్టం
నారాయణఖేడ్: ఖేడ్ పట్టణంలోని శ్రీ సృష్టి ట్రేడర్స్ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగింది. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు.
బాల సాహితీవేత్తల
సేవలు భేష్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): సాహిత్య అభివృద్ధిలో విశేష సేవలు అందిస్తున్న సిద్దిపేట బాల సాహితీవేత్తల కృషి గొప్పదని, తెలంగాణ సారస్వత పరిషత్ శాశ్వత సభ్యులు గరిపల్లి అశోక్ అన్నారు. శనివారం సిద్దిపేటలో నిర్వహించిన బాలసాహితీవేత్తల సమావేశంలో అశోక్ మాట్లాడుతూ... సిద్ధిపేట బాలసాహిత్యానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించిన బాలల ప్రపంచం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాలసాహితీవేత్తలు ఉండ్రాళ్ల రాజేశం, పెందోట వెంకటేశ్వర్లు, బైతి దుర్గయ్య, వరుకోలు లక్ష్మయ్య, అనిశెట్టి సతీశ్, లింగేశ్వరశర్మ, శ్రీనివాస్ రెడ్డి, నిర్మల, సత్యలక్ష్మి పాల్గొన్నారు.
వానరానికి అంత్యక్రియలు
న్యాల్‌కల్(జహీరాబాద్): మండల కేంద్రంలో మృతి చెందిన వానరానికి అంత్యక్రియలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి హనుమాన్ ఆలయం వద్ద కోతి పిల్ల ఇళ్లపై ఇటు అటూ దూకుతుండగా విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురై మృతి చెందింది. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామ యువకులు మృతి చెందిన కోతికి హిందూ సంప్రదాయం ప్రకారం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో దిలీప్‌కుమార్, ఈరన్న, తదితరులు పాల్గొన్నారు.
ట్రాలీ ఆటో బోల్తా..
తప్పిన ప్రమాదం
చిన్నశంకరంపేట(మెదక్): ట్రాలీ ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ సంఘటన మండల కేంద్రంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా... మండల కేంద్రంలో ఓ ఇంటి నిర్మాణానికి చేగుంట నుంచి స్టీల్ తీసుకువస్తుండగా సూరారం చౌరస్తాలో ఆటో బోల్తాపడింది. స్పీడ్ బ్రేకర్ వద్ద రోడ్డు అంచునకు వచ్చిన ఆటో అదుపుతప్పి బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. డ్రైవర్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆటో ముందు భాగం అద్దాలు పగిలాయి. స్థానికుల సహాయంతో స్టీల్‌ను ఆటోలో నుంచి బయటకు తీసి ఆటోను లేపారు.
గంజాయి పట్టివేత
రాయికోడ్(అందోల్): ఎండు గంజాయిని ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి వివరాల ప్రకారం... విశ్వసనీయ సమాచారం మేరకు మండలంలోని నల్లంపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు సాగు చేస్తున్న పంట పొలం, అతని ఇంటిపై దాడులు నిర్వహించారు. నిందితుడి వద్దనుంచి 850 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో ఎకై ్సజ్ ఎస్‌ఐలు రమేశ్, మురళి, శాంతి, హెచ్‌సీ యాదయ్య, శంశోద్దీన్, సిబ్బంది ఉన్నారు.
సెల్‌టవర్ ఎక్కి
యువకుడి హల్‌చల్
జోగిపేట(అందోల్): తన డబ్బులు దొంగిలించారని తీవ్ర మనస్తాపం చెందిన వ్యక్తి సెల్‌టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. వివరాలు.. జోగిపేటకు చెందిన మార్కల అశోక్ శుక్రవారం రాత్రి బాగా మద్యం తాగి పడుకున్నాడు. తెల్లవారే సరికి అతడి జేబులో ఉన్న రూ.4,500 కనిపించకపోవడంతో ఆందోళన చెందాడు. ఈ క్రమంలో అతడు దగ్గరలోని సెల్‌టవర్ ఎక్కాడు. ఆ పరిసర ప్రాంతంలోనే పనిచేస్తున్న అశోక్ చిన్నమ్మ, విషయం తెలుసుకున్న అతడి సోదరుడు, స్థానికులు, వచ్చి నీ డబ్బులు మేం ఇస్తామని నచ్చజెప్పగా గంట తరువాత కిందకు దిగాడు. ఎవరిపై అనుమానం ఉందో చెబితే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అతడిని శాంతింపజేశారు.


