జహీరాబాద్‌ పీఠం ఎవరికో? | - | Sakshi
Sakshi News home page

జహీరాబాద్‌ పీఠం ఎవరికో?

Feb 15 2026 12:36 PM | Updated on Feb 15 2026 12:36 PM

జహీరాబాద్‌ పీఠం ఎవరికో?

జహీరాబాద్‌ పీఠం ఎవరికో?

ఏ పార్టీకి దక్కని మ్యాజిక్‌ ఫిగర్‌ రేపు చైర్మన్‌ పదవికి ఎన్నిక పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలు

జహీరాబాద్‌: జహీరాబాద్‌ మున్సిపల్‌ 11వ కౌన్సిల్‌ చైర్మన్‌ పదవి ఎవరిని వరించనుందో వేచి చూడాలి. ఇప్పటి వరకు 8 మంది వ్యక్తులు చైర్మన్‌ పదవులు చేపట్టారు. వీరిలో బండమీది చంద్రయ్య, మంకాల్‌ సుభాష్‌ రెండేసి పర్యాయాలు చైర్మన్‌గా కొనసాగారు. ప్రస్తుతం చైర్మన్‌ పదవి బీసీ జనరల్‌ కేటగిరి కింద రిజర్వు అయింది. ఎన్నికల్లో గెలిచి వచ్చిన అనంతరమే చైర్మన్‌ పదవి ఎవరికి ఇవ్వాలనే విషయమై నిర్ణయిస్తారని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అధిష్టానవర్గాలు ఎన్నికల ముందు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఎన్నికలు ముగియగా హంగ్‌ ఏర్పడింది. ఇరు పార్టీలకు చెందిన నేతలు చైర్మన్‌ పదవిపై ఆశలు పెట్టుకున్నారు.

హంగ్‌తో ఉత్కంఠ

మున్సిపల్‌ పరిధిలో 37 వార్డులు ఉండగా చైర్మన్‌ పదవిని దక్కించుకోవాలంటే.. 19 వార్డు కౌన్సిలర్ల మద్దతును కూడగట్టుకోవాల్సి ఉంది. చైర్మన్‌ పదవికి ఈనెల 16న ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకటించింది. 37 స్థానాలున్న కౌన్సిల్‌లో బీఆర్‌ఎస్‌ 15 స్థానాల్లో, కాంగ్రెస్‌ 14 స్థానాల్లో, బీజేపీ 3 స్థానాల్లో, ఎంఐఎం రెండు స్థానాల్లో, స్వతంత్రులు మూడు స్థానాల్లో గెలుపొందారు. దీంతో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాక హంగ్‌ ఏర్పడింది.

2014లో చైర్మన్‌ పీఠం

దక్కించుకున్న బీఆర్‌ఎస్‌

2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి చైర్మన్‌ పదవికి అవసరమైన మెజారిటీ ఉన్నా అనూహ్యంగా బీఆర్‌ఎస్‌ దక్కించుకుంది. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండటంతో చైర్మన్‌ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో.. తెలుగుదేశం, మజ్లిస్‌ పార్టీలతో పాటు కాంగ్రెస్‌ కౌన్సిలర్ల మద్దతు కూడగట్టి చైర్మన్‌ పదవి తన ఖాతాలో వేసుకుంది. చైర్మన్‌ పదవికి బీఆర్‌ఎస్‌కు చెందిన ముత్యాల లావణ్య, తెలుగుదేశం పార్టీకి చెందిన షబానాబేగం తీవ్రంగా పోటీపడ్డారు. దీంతో ఇద్దరి మధ్య ఒప్పందం కుదిర్చి చెరి సగం కాలం పాటు చైర్మన్‌ పదవిలో కొనసాగేందుకు నిర్ణయించారు. దీంతో ఇద్దరు రెండున్నర సంవత్సరాల పాటు పదవిని చేపట్టారు. అనంతరం కోర్టులో కేసు ఉన్న కారణంగా అప్పటి నుంచి జహీరాబాద్‌ మున్సిపాలిటీకి ఎన్నికలు జరగలేదు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ హంగ్‌ ఏర్పడి చైర్మన్‌ పదవి ఎంపిక విషయం ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

కొత్త చైర్మన్‌పై ఉత్కంఠ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement