సాక్షి, ఢిల్లీ: విపక్షాల ఐక్యతతో కేంద్రం ఓడిపోయిందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిన్న సవరణతో మహిళా రిజర్వేషన్లు పెంచవచ్చు. సీట్లు పెంచడానికి మహిళా రిజర్వేషన్లు ముసుగు వేశారని మండిపడ్డారు. బీజేపీ విధానాలకి ఓటమి ఇది అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘దక్షిణ భారతానికి జరిగే అన్యాయాన్ని అడ్డుకున్నాం. మహిళా బిల్లు చాటున డీలిమిటేషన్ బిల్లును తెచ్చారు. ఎన్డీయే నిజాయితీగా బిల్లును తీసుకురాలేదు. బిల్లు వీగిపోవడం అంటే బీజేపీ ఓడిపోవడమే. బీజేపీ సర్కార్ రాజ్యాంగాన్ని కాలరాయాలని చూసింది. ప్రధాని మోదీ కుట్రలను కాంగ్రెస్ సమర్థవంతంగా అడ్డుకుంది. దేశవ్యాప్తంగా బీజేపీ విధానాలను కాంగ్రెస్ ఎండగట్టింది. ఇది రాజకీయ విధానాల ఓటమి కాదు.. బీజేపీ విధానాల ఓటమి.
రాజ్యాంగం మార్చడానికి, రిజర్వేషన్లు రద్దు చేసేందుకు అబ్ కీబార్ చార్ సౌ అన్నారు బీజేపీకి 400 సీట్లు ఇచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చేవారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువస్తే రేపే మద్దతు ఇస్తాం. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ కోటా పెట్టాలి. హైబ్రిడ్ మోడల్‌లో డీలిమిటేషన్ జరగాలి అని వ్యాఖ్యలు చేశారు. 2023 మహిళా బిల్లును యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఎంతో మంది మహిళా నేతలను కాంగ్రెస్ తయారుచేసింది’ అని చెప్పుకొచ్చారు.


