CM YS Jagan Slams Chandrababu Naidu At Venkatapalem Public Meeting - Sakshi
Sakshi News home page

మంచి చేసే ఉద్దేశం వాళ్లకు లేదు.. నారా చంద్రబాబును నమ్మొద్దు: సీఎం జగన్‌

Published Fri, May 26 2023 12:48 PM

CM Jagan Slams Chandrababu Naidu At Venkatapalem - Sakshi

సాక్షి, గుంటూరు: పేద లబ్ధిదారులకు అందించబోయే ఇళ్ల పట్టాలు.. మహిళల పేరు మీదే ఉండబోతున్నాయని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. అయితే పేదలకు మంచి జరగకుండా అడ్డుకున్న చంద్రబాబునాయుడు అండ్‌ కోపై వెంకటపాలెం బహిరంగ సభ వేదికపై మండిపడ్డారు సీఎం జగన్‌. 

ఏపీలో అక్కచెల్లెమ్మల చేతుల్లో రూ. 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల సంపద ఉంచాం. ఇళ్ల స్థలాలతో పాటు 5 వేల టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తున్నాం. సీఆర్డీఏ ప్రాంతంలోనే నాలుగు వందల కోట్ల ప్రభుత్వ వ్యయంతో ఐదు వేల ఇళ్లను నిర్మిస్తున్నాం. రూపాయికే అన్ని హక్కులతో టిడ్కో ఇళ్లు అందజేస్తున్నాం. గత ప్రభుత్వ పాలకులు ఎప్పుడైనా ఇలాంటి మంచి ఆలోచన చేశారా? అని సీఎం జగన్‌ సభా వేదిక నుంచి నిలదీశారు. 

నరకాసురుడినైనా నమ్మొచ్చుగానీ.. 
సీఎం చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని.. దొంగల ముఠా  పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కుట్రలు చేసి అడ్డుకునే యత్నం చేసింది.  చంద్రబాబు హయాంలో పేదలకు సెంటు భూమి ఇవ్వలేదు. ఇళ్ల స్థలాల విషయంలోనూ మోసమే చేశారు.  2014 నుంచి 2019 వరకు ఒక్క పట్టా కూడా ఇవ్వలేదు. తన హయాంలో చంద్రబాబు అన్ని వర్గాలనూ మోసం చేశారు. ఎన్నికలు రాగానే మళ్లీ మోసపూరిత హామీలు ఇస్తారు. మళ్లీ మోసపూరిత ప్రేమ చూపడానికి బాబు సిద్ధమవుతున్నారు. గజ దొంగల ముఠా ఏకమవుతోంది. ఐదేళ్ల చంద్రబాబు పాలనంతా దోచుకో.. పంచుకో.. తినుకో మాత్రమే. 

గతంలో చంద్రబాబు 600 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసి, అందర్నీ మోసం చేశాడు. ఎన్నికలకు దగ్గరపడే కొద్దీ.. మళ్లీ ఒక మేనిఫెస్టో అంటాడు. సామాజిక వర్గాలు మీద మోసపూరిత ప్రేమ చూపిస్తాడు. వారికోసమే మేనిఫెస్టో అని చంద్రబాబు అంటాడు. మోసం చేసేవాడ్ని ఎప్పుడూ కూడా నమ్మకండి. నరకాసురుడినైనా నమ్మొచ్చు కాని, నారా చంద్రబాబునాయుడ్ని మాత్రం నమ్మకూడదు అంటూ ప్రజలను  ఉద్దేశించి సీఎం జగన్‌ పిలుపు ఇచ్చారు. 

మంచి చేసే ప్రభుత్వం ఇది
కోవిడ్‌ కష్టకాలంలోనూ ఎక్కడా రాజీపడలేదు. అక్కచెల్లెమ్మల కుటుంబాల కోసం పని చేశా. కోవిడ్‌ సమయంలోనూ 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. నవరత్నాల్లోని ప్రతీ హామీని అమలు చేశాం. మ్యానిఫెస్టోను భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌గా భావించాం.  ఇచ్చిన 98 శాతం హామీలను అమలు చేశాం. ఈ నాలుగేళ్లలో అవినీతి, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించాం. డీబీటీ ద్వారా నేరుగా రూ. 2.11 లక్షల కోట్లు అందజేశాం.  నాన్‌ డీబీటీతో మొత్తం రూ. 3 లక్షల కోట్లు అందించాం. ఇంత మంచి జరుగుతుంటే.. గజ దొంగల ముఠా చూడలేకపోతోంది. చంద్రబాబు, ఈనాడు, ఏబీఎన్‌, టీవీ5.. వీళ్లకు తోడు దత్తపుత్రుడు గజదొంగల ముఠా ఏకమవుతోంది. పేదలకు మంచి చేయాలనే ఆలోచన వీళ్లకు లేదు. ఈ నాలుగేళ్ల మీ బిడ్డ పరిపాలనలో ఒక్క రూపాయి అవినీతి, వివక్ష లేదు. మా అక్క చెల్ల్మెల కుటుంబాల ఖాతాల్లోకి రూ.2.11లక్షల కోట్లు జమచేశాం. అప్పుల వృద్ధిరేటు చూస్తే… గత ప్రభుత్వం కన్నా.. తక్కవే. మరి చంద్రబాబు హయాంలో ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు జరగలేదు?. ఎందుకంటే.. వారికి మంచి చేసే ఉద్దేశం లేదు కాబట్టి. 

ఆ దొంగల ముఠా దృష్టిలో అధికారంలోకి రావడం అంటే.. దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికి మాత్రమే. దారుణాలను వాళ్లు రాయరు, చూపరు, ప్రశ్నిస్తామన్న వాళ్లు ప్రశ్నించరు. ఇదీ చంద్రబాబు హయాంలో మాయ. ఈరోజు కులాల మధ్య యుద్ధం జరగడంలేదు, జరుగుతున్నది క్లాస్‌ వార్‌. ఒకవైపు పేదవాడు ఉంటే.. మరోవైపే పేదవాళ్లకు మంచి జరగకూడదని కోరుకుంటూ పెత్తందార్లు యుద్ధం చేస్తున్నారు. పేదవాడికి ఇళ్లస్థలాలు ఇస్తామంటే కోర్టుల వరకూ వెళ్లి యుద్ధం చేస్తారు. సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని వాదనలు చేశారు. జగన్‌ మాదిరిగా పాలన చేస్తే.. రాష్ట్రం శ్రీలంక పోతుందని ఎల్లోమీడియాలో రాస్తారు.. చూపుతారు. పేదల బ్రతులకు మారాలని పరితపిస్తున్న ప్రభుత్వం మనది అని సీఎం జగన్‌ ఉద్ఘాటించారు.

ఇదీ చదవండి: ఇది పేదల విజయం.. ఇక సామాజిక అమరావతి: సీఎం జగన్‌

Advertisement
 
Advertisement