కేసీఆర్‌ రైతుల ఆదాయం పెంచుతున్నారు

BRS Atmiya Sammelan at Siddipet - Sakshi

బీజేపీ అంబానీ, అదానీ ఆదాయం పెంచుతోంది 

మనకు అల్లావుద్దీన్‌ దీపం లేదు..కేసీఆర్‌ అనే దీపం ఉన్నాడు 

పేటీఎం, గూగుల్‌ పే వినియోగించే వారికి కేంద్రం త్వరలో 1.1% పన్ను 

సిద్దిపేటలో బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం 

హాజరైన రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు 

సాక్షి, సిద్దిపేట: కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్‌ అంబానీ, అదానీల ఆదాయం మాత్రమే పెంచుతుంటే, సీఎం కేసీఆర్‌ మాత్రం రైతుల ఆదాయాన్ని పెంచుతున్నారని మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. సంపద పెంచి రైతుబంధు, కేసీఆర్‌ కిట్, రైతుభీమా, కల్యాణలక్ష్మీ, ఆసరా పింఛన్‌తో పేదలకు పంచుతుంటే, బీజేపీ వారు పేదలదగ్గర పన్నుల పేరుతో గుంజుకుని అంబానీ, అదానీలకు దోచిపెడుతున్నారని విమర్శించారు.

నగదు రహిత సేవలు అని ప్రారంభించి ఇప్పుడు గూగుల్‌ పే, పేటీఎంలు వినియోగించిన వారికి త్వరలో 1.1% పన్ను విధించనున్నారని తెలిపారు. సిద్దిపేట జిల్లా నంగనూరులో బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ..పంటలకు అవసరమైన విద్యుత్, టైమ్‌కు ఎరువులు, పంట పెట్టుబడికి రూ.10వేలు, కాళేశ్వరం నీరు సీఎం కేసీఆర్‌ తెచ్చినందునే నేడు రాష్ట్రంలో రైతులు బాగున్నారని తెలిపారు.

మన­కు అల్లావుద్దీన్‌ దీపం లేదు, కేసీఆర్‌ అనే దీపం ఉందని ఆ దీపం అండతోనే రాష్ట్రంలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతూ బీజేపీ సమాధులు తవ్వే పనిలో ఉంటే సమైక్యతతో బలమైన పునాదులు తవ్వే పనిలో సీఎం కేసీఆర్‌ ఉన్నారని వివరించారు. 

బీఆర్‌ఎస్‌ను కాపాడుకునే బాధ్యత మనదే 
బీఆర్‌ఎస్‌ కన్నతల్లిలాంటిది, కాపాడుకునే బాధ్య­త మనందరిపై ఉందని పార్టీ శ్రేణులకు మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కార్యకర్తల మధ్య చిన్నచిన్న విభేదాలు ఉంటే మాట్లాడుకోవాలని, కేసీఆర్‌ నాయకత్వాన్ని దేశ వ్యాప్తంగా బలపరచడానికి పార్టీ శ్రేణులందరూ సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

త్వరలోనే గృహ లక్ష్మి కార్యక్రమం ప్రారంభం అవుతుందని ప్రతి పేదవారికి తప్పకుండా ఇళ్లు ఇస్తామని హామినిచ్చారు. దేశవ్యాప్తం­గా యాసంగిలో 97లక్షలు వరి సాగైతే తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో 56లక్షల ఎకరాల్లో వరిసాగు అవుతుందన్నారు.సగం దేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా తెలంగాణ మారిందన్నారు.  

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top