గజ్వేల్, కామారెడ్డిలో బీజేపీదే గెలుపు 

BJP wins in Gajvel and Kamareddy - Sakshi

కేసీఆర్, కేటీఆర్‌ ఈ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం

ముఖ్యమంత్రిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది

అన్ని వర్గాలకు సీట్లిచ్చి గౌరవించింది బీజేపీ మాత్రమే

తెలంగాణలో బీజేపీకి అధికారం ఖాయం... మీడియా సమావేశంలో జి.కిషన్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డిలో ఆయన ఓడిపోతారని, ఆ రెండు స్థానాల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈసారి ఎన్నికల్లో తండ్రీకొడుకులిద్దరూ ఓడిపోవడం ఖాయమని తెలిపారు.

బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గజ్వేల్‌లో ఓటమి భయంతోనే కేసీఆర్‌ రెండుచోట్ల పోటీ చేస్తున్నారని చెప్పారు. ఈటల బరిలో ఉంటున్నాడని తెలిసినప్పటి నుంచి కేసీఆర్‌కు నిద్ర పట్టడం లేదని, కామారెడ్డిలోనూ వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోతారన్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో పోటీలో ఉందని తెలిపారు. బీజేపీ తరపున నామినేషన్‌ వేసిన రెబల్స్‌ దాదాపు ఉపసంహరించుకున్నారని చెప్పారు.

బీజేపీ నుంచి 36 మంది, జనసేన నుంచి ముగ్గురు బీసీ అభ్యర్థులు పోటీలో ఉన్నారని, కాంగ్రెస్‌ 22 మంది బీసీలకు మాత్రమే టికెట్లు ఇచ్చిందని, బీఆర్‌ఎస్‌ 23 మంది బీసీలకు టికెట్‌ ఇచ్చిందని చెప్పారు. రెండు జనరల్‌ స్థానాలను కూడా దళితులకే ఇచ్చామన్నారు. బీజేపీ 14 మంది మహిళలకు టికెట్లు ఇవ్వగా, బీఆర్‌ఎస్‌ 8 మంది మహిళలకే టికెట్‌ కేటాయించిందన్నారు. 

17న రాష్ట్రానికి అమిత్‌షా... 
ఈ అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్‌కు సంబంధించిన ఎన్నికలని, బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలకు ఓటేస్తే నష్టమే తప్ప ఎలాంటి మార్పూ రాదని, కుటుంబ, అవినీతి పాలనలో ఈ రెండు పార్టీలూ మునిగిపోయాయన్నారు. రాష్ట్రంలో బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని, కొందరు దొంగ కంపెనీల పేరిట తప్పుడు సర్వేలు చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 17న రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలంగాణకు వస్తున్నారని, 18న నాలుగు జిల్లాల్లో సభలు ఉంటాయని, వరంగల్, నల్లగొండ, రాజేంద్రనగర్‌ అసెంబ్లీల వారీగా బీసీ సంఘాలతో సదస్సు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

కేసీఆర్‌ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలకు బానిస బతుకు మాత్రమే మిగిలిందని, అందుకే గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా చాలామంది నామినేషన్లు వేశారన్నారు. నెలరోజుల్లో పదవి దిగిపోయే కేసీఆర్‌ ఇప్పుడు మెడికల్‌ కాలేజీల గురించి మాట్లాడుతున్నారని, సరైన సమయంలో భూములు చూపకుంటే అందుకు బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత టెక్స్‌టైల్‌ పార్క్, సైన్స్‌ సిటీ, కల్చరల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామన్నారు.

పాతబస్తీలో నిరుపేద ముస్లింల భూములు లాక్కుని షాదీఖానాలు ఏర్పాటు చేస్తున్నారని, బీజేపీ వారికి రక్షణగా ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్‌ అఖిలేశ్‌ యాదవ్, శరద్‌ పవార్, నితీశ్‌ కుమార్, కేజ్రీవాల్, కుమారస్వామి తదితర ప్రాంతీయ పార్టీల నేతలను కలిశారని, వారికి ప్రత్యేక విమానాలు పంపించి మరీ దావత్‌ ఇచ్చారని, వారిలో ఒక్కరైనా ఇప్పుడు మద్దతిచ్చారా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి రాగానే మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నారు. ఈ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ కూడా ప్రచారం చేస్తారని చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top