దక్షిణ కోట ఎవరికి దక్కేను?  | Trinamool-BJP Battle Royale In Bengal With 152 Seats | Sakshi
Sakshi News home page

దక్షిణ కోట ఎవరికి దక్కేను? 

Apr 28 2026 5:23 AM | Updated on Apr 28 2026 6:23 AM

Trinamool-BJP Battle Royale In Bengal With 152 Seats

పశ్చిమబెంగాల్‌ దక్షిణ ప్రాంతంలో కీలకంగా మారిన 91 సీట్లు 

24 పరగణాలు, కోల్‌కతా, హౌరాలపై కన్నేసిన కీలక పార్టీలు 

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ ఎన్నికల చదరంగంలో గెలుపు పావులను ఉత్తరబెంగాల్‌ కొండ ప్రాంతాలు, జంగల్‌మహల్‌ అటవీప్రాంతాల్లో కాకుండా దక్షిణబెంగాల్‌ మైదానప్రాంతాల్లోనే కీలక పార్టీలు మొహరిస్తుంటాయి. ఈసారి కూడా అదే ఆట మొదలైంది. జంట జిల్లాలైన ఉత్తర, దక్షిణ 24 పరగణాల్లో, కోల్‌కతా, హౌరా ప్రాంతాల్లో గెలుపు అనేది అధికారపీఠానికి రాచబాటగా చెబుతుంటారు. 

గత ఎన్నికల్లో ఈ ప్రాంతాలపై తృణమూల్‌కాంగ్రెస్‌ గెలుపు జెండా ఎగరేయగా ఈసారి జెండా కిందకు దింపి కాషాయజెండా రెపరెపలాడేలా చేస్తామని కమలదళ నాయకులు కంకణం కట్టుకున్నారు. ఉత్తర 21 పరగణాల జిల్లాలో 33 సీట్లు, దక్షిణ 24 పరగణాల జిల్లాలో 31 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. రాష్ట్ర ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో అత్యధిక స్థానాల్లో గెలుపు అనేది అత్యంత కీలకం. 

కోల్‌కతా నగర పరిధిలోని 11 సీట్లు, హౌరా నగర పరిధిలోని 16 సీట్లు కూడా కలుపుకుంటే కీలక నియోజకవర్గాల సంఖ్య 91కి పెరుగుతోంది. 294 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో ఇవి మూడింట ఒకవంతు స్థానాలతో సమానం. అలా ఇవి ఈసారి ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నాయి. ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాలను యావత్‌ రాష్ట్రంలోని కీలక జిల్లాలుగా చెబుతుంటారు. పెద్ద ప్రెసిడెన్సీ డివిజన్‌గా కొనసాగుతున్న కోల్‌కతా, హౌరా, నదియా, నార్త్, సౌత్‌ 24 పరగణాల్లో మొత్తంగా 111 సీట్లున్నాయి. 

వీటిని గెలిస్తే రాష్ట్ర సచివాలయం ‘నబన్నా’లో అధికారం చక్రం తిప్పొచ్చని అటు టీఎంసీ, ఇటు బీజేపీ గట్టిగా నమ్ముతున్నాయి. ఈ 111 స్థానాలకుగాను 2021 ఎన్నికల్లో టీఎంసీ ఏకంగా 96 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక్కడ బీజేపీ 14 స్థానాలతో సరిపెట్టుకుంది. ది ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌(ఐఎస్‌ఎఫ్‌) ఒకే ఒక్క చోట గెలిచింది. ఇంతటి కీలక దక్షిణబెంగాల్‌ను గుప్పిటపట్టకుండా అధికారాన్ని కైవసం చేసుకోవడం అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు సైతం వ్యాఖ్యానించారు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికలు వచ్చేనాటికి బీజేపీ బలం పుంజుకుంది. 

ఇక్కడి 21 సెగ్మెంట్లలో బీజేపీ హవా కొనసాగింది. నదియా, ఉత్తర 24 జిల్లాల్లో బీజేపీ, దక్షిణ 24, హౌరా, కోల్‌కతాల్లో టీఎంసీ సత్తాచాటాయి. ఇక్కడి మెజార్టీ స్థానాల్లో గెలిచి నాలుగోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని టీఎంసీ ఉవ్విళ్లూరుతోంది. ‘‘ఇక్కడి స్థానాలను పదిలపర్చుకుంటే అధికారం మనదే. ఇవి కేవలం సీట్లు కాదు. మమతా బెనర్జీ రాజకీయ ఎత్తులకు సామాజిక వేదికలు’’అని టీఎంసీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ‘‘మాకూ ఈ స్థానాలు చాలా ముఖ్యం. నార్త్‌ 24 పరగణాల జిల్లాలో మతువాలు, శరణార్థుల ఓట్లను కొల్లగొడితే మాకు పని సులువు అవుతుంది’’అని బీజేపీ సీనియర్‌ నేత చెప్పారు. 

ఒకప్పుడు ఈ ప్రాంతం వామపక్ష పార్టీలకు కంచుకోటగా ఉండేది. 2006లో సీపీఐ(ఎం) లెఫ్ట్‌ కూటమి ఏకంగా 72 చోట్ల గెలిచింది. కానీ సచార్‌ కమిటీ నివేదిక తర్వాత ముస్లింలు లెఫ్ట్‌పార్టీలకు ముఖంచాటేశారు. సింగూర్‌–నందిగ్రామ్‌ ఉద్యమం తర్వాత మమతబెనర్జీ హవా కొనసాగి ఈ ప్రాంతంపై టీఎంసీ పట్టుసాధించింది. ఇప్పుడీ ప్రాంతం మమత ప్రభుత్వానికి రాజకీయ ఇంజిన్‌గా మారింది. 2008లో దక్షిణ 24 పరగణాలు, పూర్బా మేదినీపూర్‌ జిల్లా పరిషత్‌లను గెల్చుకుని టీఎంసీ ఇక్కడ పాగావేసింది. 

నార్త్‌ 24 పరగణాల్లో బంగ్లాదేశ్‌ సరిహద్దు ఉండటంతో అక్కడి నుంచి వచ్చిన శరణార్థులు ఎక్కువ. ఇక్కడి మతువాలు 14 సీట్లలో నిర్ణయాత్మక ఓటు బ్యాంక్‌గా ఉన్నారు. వీళ్లందరికీ పౌరసత్వం ఇస్తామని, సీఏఏ అమలుచేస్తామని బీజేపీ చేసిన వాగ్దానాలు పనిచేశాయి. దీంతో 2021లో ఇక్కడి ప్రెసిడెన్సీ డివిజన్‌లో బీజేపీ గెల్చింది. 2024 లోక్‌సభ ఎన్నికలవేళ నదియాలోని 11 అసెంబ్లీ, నార్త్‌ 24 పరగణాల్లో ఎనిమిది సెగ్మెంట్లలో బీజేపీ ఓట్ల శాతం మెరుగుపడింది. అయితే ఈసారి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) సర్వే అమలుతో సమీకరణాలు మారిపోయే అవకాశముంది.

ముగిసిన రెండో దశ ఎన్నికల ప్రచారం 
ఏప్రిల్‌ 29న జరగబోయే రెండో దశ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం సోమవారంతో ముగిసింది. 142 స్థానాలకుగాను ఈసారి 41,001 పోలింగ్‌ స్టేషన్లలో 3,21,73,837 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్లలో 1,64,35,627 మంది పురుషులుకాగా, 1,57,37,418 మంది స్త్రీలు, 792 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. మొదటిదశ మాదిరే రెండో దశ పోలింగ్‌నుప్రశాంతంగా చేపట్టేలా హింసకు తావులేకుండా 2,321 కంపెనీల కేంద్రబలగాలను ఎన్నికలసంఘం పోలింగ్‌ స్థానాల్లో మొహరించింది. పోలీసులకు తోడు కెమెరాలు బిగించిన డ్రోన్లు సైతం ఆయా ప్రాంతాల్లో పహారాకాస్తున్నాయి. 

భంగర్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 19 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. కంచుకోట భవానీపూర్‌ నుంచి సీఎం మమతాబెనర్జీ మరోసారి పోటీకి నిలబడ్డారు. మైనార్టీలు అత్యధికంగా ఉండే కోల్‌కతా పోర్ట్‌ నియోజకవర్గంలో టీఎంసీ తరఫున ఫిర్హాద్‌ హకీం, బీజేపీ తరఫున రాకేశ్‌ సింగ్‌ నిలబడి పోటీకి రసవత్తరంగా మార్చారు. భాత్‌పారా, జగత్‌దల్, బరాక్‌పూర్, బంగావ్, డమ్‌డమ్, సందేశ్‌ఖాలీ, హింగల్‌గంజ్, రాణాఘాట్‌ ఉత్తర్, దక్షిణ్, రాశ్‌బెహారీ, జాదవ్‌పూŠ, బలేగంజ్‌ స్థానాల్లో బలమైన నేతలు పోటీపడుతున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement