
నెలకు రెంట్‌ల రూపంలో రూ. 15 నుంచి 17 లక్షల వరకూ ఆదాయం. ఒక లగ్జరీ ఫామ్ హౌస్. ఇంకా పలు రకాలైన ఆస్తులు. విలాసవంతమైన జీవితం. ఆ ఊరిలో శ్రీమంతుడు అనే హోదా. పెద్ద మనిషి అని ఊరి వాళ్లు తగిలించిన బిరుదు. చేతికి ఒక లైసెన్స్‌డ్ రివాల్వర్. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది మనిషి అంటే కాసింతైనా ఇలా బ్రతకాలనిపిస్తుంది కదూ.
ఇక్కడ ఆ వ్యక్తికి అన్నీ ఉన్నాయి.. సిరి సంపదలతో విలాసవంతమైన జీవితాన్ని కూడా బాగానే ఎంజాయ్ చేశాడు. దాంతో పాటు కాస్త అహంకారం, మూర్ఖత్వం కూడా ఉన్నట్లు ఉంది. అదే ఇప్పుడు అతని జీవితాన్ని తలకిందులు చేసింది. అహంకారానికి పోయి కూతురి ప్రాణాల్ని తీసి జైలు పాలయ్యాడు. కారణాలు ఏమైనా మూర్ఖత్వానికి పోయి ఎంతో గారాబంగా చూసుకున్న కూతుర్ని చంపడం ఒకటైతే, ప్యాలెస్ లాంటి భవనంలో బ్రతికిన ఆ వ్యక్తి ఇప్పుడు కఠిన శిక్షకు సిద్ధంగా ఉన్నాడు. 49 ఏళ్ల దీపక్ యాదవ్ అనే వ్యక్తి ఇప్పుడు కన్న కూతురి హత్య కేసులో ఒక్కసారిగా ‘విలన్’ అయిపోయాడు.
ఇన్ స్టా రీల్స్ చేసిందని కూతుర్ని చంపేశాడు..!
హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ సుశాంక్‌లో ఫేజ్-2లో నివాసముంటున్న దీపక్ యాదవ్.. టెన్నిస్ ప్లేయర్ అయిన కూతురు రాధికా యాదవ్‌ను హత్య చేశాడు. తన లైసెన్స్‌డ్ రివాల్సర్‌తో ఐదు రౌండ్ల కాల్పులు జరిపి కూతురి ప్రాణాలు తీశాడు. కూతురు భవిష్యత్ మరింత ఎదుగుతున్న తరుణంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. కూతురు తనకు నచ్చని సోషల్ మీడియా వీడియో ఒకటి చేసిందని, అందుకే చంపేశానని దీపక్ యాదవ్ అంటున్నాడు.
తనకు వద్దని చెప్పినా వినలేదని, ఈ క్రమంలోనే తమ మధ్య గొడవ జరిగి హత్య చేసే వరకూ వెళ్లిందని దీపక్ పోలీసులకు చెప్పుకొచ్చాడు. దీనిపై ప్రస్తుతం పోలీస్ దర్యాప్తు జరుగుతుండగా, అసలు ఏం జరిగిందనే దానిపై మీడియా ఆరా తీసింది. ఈ క్రమంలోనే జాతీయ మీడియా చానెల్ ఎన్డీటీవీ రిపోర్ట్ ఆధారంగా అసలు హత్యకు ఈ కారణాలు కాకపోవచ్చనేది ఆ కుటుంబంతో పరిచయమున్న వ్యక్తి ఒకరు వెల్లడించారు.
కూతురంటే అత్యంత గారం..
ఈ ఘటనపై దీపక్ సొంత గ్రామం వాజిరాబాద్‌లో అతనితో పరిచయమున్న ఓ వ్యక్తి చెప్పిన దాని ప్రకారం.. అసలు కూతుర్ని చంపాల్సిన అవసరం దీపక్ ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. అతనికి ఆస్తు-పాస్తులు అన్నీ ఉన్నాయి. విలాసవంతమైన జీవితం అతనిది. కూతురంటే అత్యంత గారం. కూతురు టెన్నిస్ ప్లేయర్ అవ్వడం కోసం రూ. 2 లక్షల పెట్టి రాకెట్ తీసుకొచ్చాడు. కూతురు ఈ హోదాకు రావడానికి దీపకే కారణం. కూతురు రాధికా యాదవ్ టెన్నిస్ అకాడమీ పెట్టినందుకో, ఇన్ స్టా రీల్స్ చేసినందుకో ఆమెను దీపక్ హత్య చేశాడనేది నమ్మశక్యంగా లేదు. ఇంకేదో కారణం ఉండి ఉండొచ్చు’ అని సదురు గ్రామస్తుడు తెలిపాడు.
25 ఏళ్లకే టెన్నిస్ అకాడమీ..
టెన్నిస్‌లో అంచెలంచెలుగా ఎదిగిన రాధికా యాదవ్.. ప్రస్తుతం అంతర్జాతీయ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 113వ స్థానంలో ఉంది. ఎన్నో పోటీలు ట్రోఫీలు గెలిచి తనకంటూ ఏర్పరుచుకున్న రాధిక.. 25 ఏళ్ల వయసులోనే టెన్నిస్ అకాడమీ కూడా ప్రారంభించింది. ఇందులో ఎంతోమందికి ట్రైనింగ్ ఇస్తుంది రాధికా. గురుగ్రామ్ సెక్టార్ 57లో ఒక టెన్నిస్ ఇన్‌స్టిట్యూట్‌ను రాధికా యాదవ్ రన్ చేస్తూ ఎంతోమంది విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది.