సమాధి తవ్వి.. భుజంపై అక్క అస్థిపంజరంతో..! | Shocking Video Viral, Odisha Man Brings Sister Skeleton To Bank After Being Denied ₹20,000 Withdrawal | Sakshi
Sakshi News home page

సమాధి తవ్వి.. భుజంపై అక్క అస్థిపంజరంతో..!

Apr 28 2026 11:35 AM | Updated on Apr 28 2026 11:53 AM

Shocking Video Viral: Odisha Tribal Man Went Bank With Viral

న్యాయం కోసం హీరోలు సినిమాల్లో పోరాడడం చూస్తుంటాం. భావోద్వేగంతో విజిల్స్‌ వేస్తుంటాం.. కన్నీళ్లు పెట్టుకుంటాం. ఇప్పుడు నిజ జీవితంలోనూ అలాంటి ఓ ఘటనే జరిగింది. అయితే ఈ కథలో బాధితుడే ఓ హీరో. ఆ వ్యక్తి సహనానికి అధికారులు పరీక్ష పెట్టారు. ఓపిక నశించిన ఆ పెద్దాయన చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.

50 ఏళ్ల జీతు ముండాది ఒడిషా కియోంజర్‌ జిల్లా డియానాలి గ్రామం. అతని అక్క కల్రా ముండా(56) ఈ జనవరిలో అనారోగ్యంతో చనిపోయింది. మరణించే ముందు ఆమె తన పశువుల్ని అమ్మింది. అలా వచ్చిన సొమ్ము రూ.20 వేలను ఒడిశా గ్రామీణ బ్యాంక్‌లో జమ చేసింది. అయితే ఆ సొమ్ము కోసం జీతు ఒజీవీ బ్యాంక్‌ మలిపోసి బ్రాంచ్‌కు వెళ్లాడు.

కల్రా తన సోదరి అని, ఆమె మరణించిందని.. ఎవరూ లేకపోవడంతో ఆ సొమ్ము తనకు ఇవ్వమంటూ బ్యాంక్‌ అధికారుల్ని కోరాడు. అయితే సిబ్బంది అది వినిపించుకోలేదు. అకౌంట్‌ హోల్డర్‌ను తీసుకురావాల్సిందేనని పట్టుబట్టారు. అలా పదులసార్లు బ్యాంకుకు తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు మేనేజర్‌ కూడా చేతులెత్తయడంతో జీతూకి మండిపోయింది.

సరాసరి అక్క సమాధి దగ్గరికి వెళ్లి.. ఆ అస్తిపంజరాన్ని ఓ సంచిలో మూటగట్టకున్నాడు. ఎర్రటి ఎండలో కాళ్లకు చెప్పులు లేకుండా ఆ సంచి మోసుకుంటూ ‍బ్యాంకుకు వచ్చాడు. దారిన స్థానికులు కొందరు ఆ చర్యను చూసి షాక్‌కు గురయ్యారు. తమ మొబైల్స్‌లో ఆ దృశ్యాన్ని రికార్డు చేశారు. అస్థిపంజరాన్ని చూపించి.. తన సోదరి చనిపోయిందని ఆధారాలు చూపించాడు. జీతూ చేసిన పనితో బ్యాంకు అధికారులు హడలి పోయారు. పోలీసులకు సమాచారం అందించారు.

అనుమతి లేకుండా పాతిన శవాన్ని బయటకు తీయడం నేరమని.. జీతూ మీద కేసు పెట్టమని బ్యాంకు అధికారులు పోలీసుల మీద ఒత్తిడి చేశారు. కానీ, పోలీసులు మాత్రం  ఆ పెద్దాయనకే సపోర్ట్‌గా నిలిచారు. వాళ్ల జోక్యంతో బ్యాంకు అధికారులు దిగి వచ్చారు. జీతు ముండాకి ఇవ్వాల్సిన సొమ్మును ఇచ్చే ఏర్పాటు చేశారు. 

‘‘జీతు ముండా, కల్రా ముండాలు నిరక్షరాస్యులు. నామినీ, లీగల్ హెయిర్ అనే విషయాల గురించి తెలియదు. అకౌంట్‌లు ఇచ్చే సమయంలో అత్యుత్సాహం చూపించే సిబ్బంది కూడా సరైన విధంగా వివరించలేదు’’ అని స్థానిక పోలీస్‌ అధికారి తెలిపారు. తనకు తెలియకుండానే చేసిన ఈ నిరసన ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. భలే పని చేశాడని.. బ్యాంకు వాళ్లకు తగిన బుద్ధి చెప్పాడని ప్రశంసలు గుప్పిస్తున్నారు.   

మన దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలు, ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల బ్యాంకుల్లో కోట్లాది డబ్బులు మూలుగుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం, బ్యాంకుల్లో క్లైమ్ చేయని డిపాజిట్లు, టీడీఎస్‌ రీఫండ్‌లు కలిపి సుమారు లక్ష కోట్ల రూపాయలు ప్రజలకు చెందిన డబ్బు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి.

బ్యాంకుల్లో క్లయిమ్ చేయని డిపాజిట్లు

జనవరి 2026 నాటికి మొత్తం రూ.72,454 కోట్లు

పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో: రూ.60,571 కోట్లు

ప్రైవేట్ బ్యాంకుల్లో: రూ.9,608 కోట్లు

విదేశీ బ్యాంకుల్లో: రూ.2,275 కోట్లు.. ఈ మొత్తాన్ని RBI నిర్వహించే Depositor Education and Awareness (DEA) Fundకి బదిలీ చేశారు.

టీడీఎస్‌ రీఫండ్‌లు
క్లైమ్ చేయని TDS రీఫండ్‌లు: సుమారు రూ3,000 కోట్లు. ఇవి ప్రభుత్వ ఖజానాలో ఉంటాయి, కానీ పన్ను చెల్లించిన వ్యక్తులు ITR ఫైలింగ్ ద్వారా తిరిగి పొందవచ్చు.

ఎందుకు క్లయిమ్ చేయబడటం లేదు?

  • అకౌంట్ హోల్డర్ మరణం, నామినీ లేకపోవడం
  • ప్రజల్లో అవగాహన లోపం
  • క్లిష్టమైన పేపర్‌వర్క్, ప్రక్రియలు

Advertisement
 
Advertisement
Advertisement