దీదీ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. ది కేరళ స్టోరీ బ్యాన్‌పై సుప్రీం కోర్టు స్టే

SC Stays Ban order of West Bengal govt On The Kerala Story - Sakshi

ఢిల్లీ: ది కేరళ స్టోరీ చిత్ర విషయంలో పశ్చిమ బెంగాల్‌ సర్కార్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మమతా బెనర్జీ చిత్రప్రదర్శనపై విధించిన నిషేదాజ్ఞాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. మే 8వ తేదీన బెంగాల్‌ ప్రభుత్వం ది కేరళ స్టోరీ సినిమాపై బ్యాన్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ బ్యాన్‌పై ఫిల్మ్‌ మేకర్స్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. బ్యాన్‌ ఎందుకు చేశారో వివరణ కోరుతూ మమతా బెనర్జీ సర్కార్‌కు నోటీసులు జారీ చేసింది సుప్రీం.

వాస్తవాలను తారుమారు చేసి ఈ చిత్రం రూపొందించారని, పైగా  సినిమాలో ద్వేషపూరిత ప్రసంగాలను ఉన్నాయని, ఈ సినిమాను ప్రదర్శిస్తే శాంతి భద్రతలకు భంగం వాటిల్లవచ్చనే ఉద్దేశంతోనే బ్యాన్‌ చేసినట్లు సుప్రీం నోటీసులపై బెంగాల్‌ ప్రభుత్వం బుధవారం వివరణ ఇచ్చుకుంది. ఈ క్రమంలో.. ఇవాళ్టి విచారణ సందర్భంగా బ్యాన్‌ ఆదేశాలపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది దేశ సర్వోన్నత న్యాయస్థానం.

చట్టపరమైన నిబంధనలతో చిత్రప్రదర్శన అడ్డుకోవాలని చూడడం సరికాదని, అలా అనుకుంటే సినిమాలన్నీ కోర్టులకే చేరతాయని చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది.  ఈ చిత్రానికి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌(CBFC) సర్టిఫికెట్‌ జారీ చేసింది. కాబట్టి, శాంతి భద్రతల పరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి. చట్టపరమైన నిబంధనలతో ఆపే యత్నం చేయకూడదు అని బెంచ్‌ వ్యాఖ్యానించింది.  

అలాగే తమిళనాడు ప్రభుత్వం సైతం అప్రకటిత బ్యాన్‌ను విధించిందని ది కేరళ స్టోరీ నిర్మాతలు సుప్రీంలో విడిగా మరో పిటిషన్‌ వేయగా.. స్టాలిన్‌ ప్రభుత్వానికి సైతం గతంలో సుప్రీం నోటీసులు పంపింది. అయితే.. ‘ది కేరళ స్టోరీ’ సినిమాపై ప్రత్యక్షంగానీ,  పరోక్షంగానీ తాము ఎలాంటి నిషేధం విధించలేదని, ప్రేక్షకులు ఆసక్తి చూపించకపోవడంతో ఎగ్జిబిటర్లు, థియేటర్ల యజమానులే స్వచ్చందంగా సినిమా ప్రదర్శన ఆపేశారంటూ తమిళనాడు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. 

ఈ తరుణంలో ఇవాళ్టి విచారణ సందర్భంగా.. తమిళనాడు ప్రభుత్వ అఫిడవిట్‌ను సుప్రీం కోర్టు రికార్డు చేసింది. అంతేకాదు.. కేరళ స్టోరీ ప్రదర్శించబడే హాలు వద్ద తగిన భద్రత కల్పించాలని, ప్రేక్షకుల భద్రతకూ అవసరమైన ఏర్పాట్లు చేయాలని సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని గురువారం ఆదేశించింది. ఇదిలా ఉంటే.. సినిమా విడుదలపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన కేరళ హైకోర్టు ఆదేశాలను జర్నలిస్ట్ ఖుర్బాన్ అలీ  సుప్రీంలో ఓ పిటిషన్‌ వేశారు.

ఇదీ చదవండి: ది రియల్‌ కేరళ స్టోరీ గురించి తెలుసా?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top