ఉగ్రవాదానికి భారత్‌ తలవంచదు | President Murmu and PM Modi paid tribute to Pahalgam terror victims | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదానికి భారత్‌ తలవంచదు

Apr 23 2026 5:11 AM | Updated on Apr 23 2026 6:15 AM

President Murmu and PM Modi paid tribute to Pahalgam terror victims

ముష్కరుల దుశ్చర్యలను సహించే ప్రసక్తే లేదు 

తేల్చిచెప్పిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు  

పహల్గాం దాడి బాధితులకు ప్రముఖుల నివాళులు

న్యూఢిల్లీ: సరిగ్గా ఏడాది క్రితం జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల అత్యంత కిరాతకానికి 26 మంది అమాయకులు బలయ్యారు. ఈ అమానుష దాడిలో ప్రాణాలుకోల్పోయిన∙వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నాయకులు బుధవారం నివాళులర్పించారు. భారతదేశం ఏనాటికీ ఉగ్రవాదానికి తలొగ్గదని తేల్చిచెప్పారు. ఈ మేరకు బుధవారం తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్టులుపెట్టారు. 

ప్రజలకు హాని కలిగించే, ఐక్యతకు భంగం కలిగించే కుతంత్రాలను ఉమ్మడి బలంతో ఎదుర్కొంటామని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఉగ్రవాదం పట్ల, దానికి ఆశ్రయం ఇచ్చేవారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించడం తథ్యమని ప్రభుత్వం పేర్కొంది. ముష్కర మూకల దుశ్చర్య పట్ల సహనం వహించే ప్రసక్తే లేదని కేంద్రం వెల్లడించారు. ఉగ్రవాదం ఎక్కడ, ఏ రూపంలో ఉన్నాసరే కచ్చితంగా ఓడించాలన్నదే దేశ సంకల్పమని, ఈ విషయంలో దృఢనిశ్చయంతో ముందుకు సాగుతోందని రాష్ట్రపతి ముర్ము ఉద్ఘాటించారు.

 పహల్గాం దాడిలో అమాయకులు విషాదకర రీతిలో ప్రాణాలు కోల్పోవడం ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిందన్నారు. బాధిత కుటుంబాలకు యావత్‌ దేశం వారికి అండగా నిలుస్తుందని ప్రకటించారు. ఉగ్రవాద చర్యలు శాంతి, ఐక్యతల పట్ల మనకున్న అచంచలమైన నిబద్ధతను అడ్డుకోలేవని స్పష్టంచేశారు. శాంతి, ఐక్యత, మానవత్వపు శాశ్వత విలువలను కాపాడాలనే దేశ సంకల్పాన్ని ఉగ్రవాద చర్యలు ఎన్నటికీ ఏమీ చేయలేవని ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్‌ తేల్చిచెప్పారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించే విషయంలో మన అంకితభావానికి తిరుగులేదన్నారు. 

బాధితులను మర్చిపోలేం: మోదీ 
భారతదేశం ఉగ్రవాదానికి ఎట్టిపరిస్థితుల్లోనూ తలవంచబోదని, ఉగ్రవాదుల హేయమైన కుట్రలు ఎన్నటికీ సఫలం కాబోవని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పహల్గాం ఘాతుకంలో మరణించిన వారిని ఎప్పటికీ మర్చిపోలేమని తెలిపారు. ఒక దేశంగా మనం దుఃఖంలోనూ, సంకల్పంలోనూ ఐక్యంగా నిలిచామని చెప్పారు. ఉగ్రవాదులు, వారి పోషకుల పట్ల ‘సున్నా– సహన విధానాన్ని’ కొనసాగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పష్టంచేశారు. 

మానవాళికి అతిపెద్ద శత్రువైన ఉగ్రవాదాన్ని ఓడించడానికి మనమంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, నితిన్‌ గడ్కరీ, ఎస్‌.జైశంకర్, ధర్మేంద్ర ప్రధాన్, వీరేంద్ర కుమార్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్, కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ, జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తదితరులు పహల్గాం మృతులకు నివాళులర్పించారు. బాధితుల త్యాగాన్ని, వారి కుటుంబాల వేదనను దేశం ఎన్నటికీ మర్చిపోదని, ఈ పిరికిపంద చర్యకు పాల్పడిన వారిని ఎన్నటికీ క్షమించదని రాహుల్‌ గాంధీ తేల్చిచెప్పారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement