5 రాష్ట్రాల్లో కరోనా విజృంభణ

Coronavirus cases increase for 6th day to 13,993 in 24 Hours - Sakshi

పెరుగుతున్న కరోనా మహమ్మారి కేసులు 

24 గంటల్లో 13,993 కొత్త కేసులు 

కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో అలర్ట్‌ జారీ

సాక్షి, న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో  కరోనా మహమ్మారి కేసుల్లో అకస్మాత్తుగా పెరుగుదల నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం హెచ్చరించింది. గత ఏడు రోజులలో ఛత్తీస్‌గఢ్‌లో యాక్టివ్‌ కరోనా కేసుల సంఖ్య పెరిగిందని, గత 24 గంటల్లో 259 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,03,637కు చేరుకుంది. కేరళలో రోజూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోందని తెలిపింది. నేడు కేరళలో 4,854 కొత్త కేసులు బయటపడగా, మొత్తం కేసులు 9,61,789కు చేరుకున్నాయి.

మహారాష్ట్రలో సైతం కొత్త కరోనా కేసుల సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 6,112 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19,89,963కు చేరుకుంది. మహారాష్ట్ర మాదిరిగానే పంజాబ్‌లోనూ గత ఏడు రోజుల్లో కొత్త కరోనా కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో పంజాబ్‌లో 383 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,69,216కు చేరుకుంది. మధ్యప్రదేశ్‌లోనూ ఫిబ్రవరి 13 నుంచి రోజూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. 

గత 24 గంటల్లో ఇక్కడ 297 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,53,071కు చేరుకుంది. ఈ నేపథ్యంలో కరోనా సంక్రమణకు అడ్డుకట్ట వేసేందుకు, వ్యాధి వ్యాప్తిని నివారించడానికి ప్రతీ ఒక్కరూ కోవిడ్‌–19 ప్రోటోకాల్స్‌ కచ్చితంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మొత్తం యాక్టివ్‌ కోవిడ్‌–19 కేసులలో మహారాష్ట్ర, కేరళ రెండు రాష్ట్రాల్లోనే 75.87 శాతం కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఒక్క మరణం కూడా లేదు..
కరోనాను కట్టడి చేయడంలో కొన్ని రాష్ట్రాలు చూపిస్తున్న చొరవ కారణంగా 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా కారణంగా గత 24 గంటల్లో ఒక్క మరణం కూడా సంభవించలేదు. తెలంగాణ,హరియాణా, జమ్మూ అండ్‌ కశ్మీర్‌ (యూటీ), జార్ఖండ్, హిమాచల్‌ ప్రదేశ్, త్రిపుర, అస్సాం, చండీగఢ్, లక్షద్వీప్, మణిపూర్, మేఘాలయ, లడఖ్‌ (యూటీ), మిజోరం, సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్‌ ప్రదేశ్, అండమాన్‌ నికోబార్, దాదర్‌నగర్‌ హవేలి, డామన్‌–డయ్యూల్లో కరోనా కారణంగా గత 24 గంటల్లో ఒక్కరి ప్రాణాలు కూడా పోలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశంలో మరోసారి పలు రాష్ట్రాల్లో కరోనా సంక్రమణ కేసులు పెరుగుతుండడంపై కేంద్రప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది. ప్రజలు అజాగ్రత్తగా ఉన్న కారణంగానే పెరుగుదల నమోదవుతోందనే అభిప్రాయాన్ని నిపుణులు వెల్లడిస్తున్నారు.

22 రోజుల్లో అత్యధిక కేసులు..
దేశంలో గత 24 గంటల్లో 13,993 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. గత 22 రోజుల్లో ఇదే అత్యధిక కేసుల సంఖ్య కావడం ఆందోళన కలిగిస్తుంది. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,09,77,387కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 101 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,56,212కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,06,78,048కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 97.27 శాతానికి చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,43,127గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.27  శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.42 గా ఉంది. మరణిస్తున్న వారిలో 70 శాతం మంది ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారేనని చెప్పింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top