
సాక్షి, ముంబై: తండ్రి నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ టీవీ నటి పోలీసులను ఆశ్రయించిన ఘటన కలకలం రేపింది. ఈ మేరకు బరేలీకి చెందిన టీవీ, సినీ నటి తృప్తి శంఖధార్ (19) ఆమె ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తల్లితో కలిసి ఇనస్టా లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
వివరాలను పరిశీలిస్తే..తన ఇష్టానికి వ్యతిరేకంగా వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని తన తండ్రి రామ్ రతన్ శంఖధార్ నిశ్చయించారనీ, అందుకు తాను నిరాకరించడంతో తనపై హత్యాయత్నం చేశారంటూ ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో వాపోయారు. తనపై దాడి చేసిన కొట్టాడని, తండ్రినుంచి తమ ప్రాణాలకు ముప్పుందని రక్షణ కల్పించాలని బరేలీ పోలీసులను వేడుకున్నారు. అంతేకాదు తనకిచ్చిన నగదును కూడా తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనలో తమకు ఎటువంటి లిఖితపూర్వక ఫిర్యాదు రాలేదని, సోషల్ మీడియాలో నటి పోస్ట్ గురించి తెలుసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నామని బరేలీ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. మరోవైపు తృప్తి తండ్రి, రియల్ ఎస్టేట్ వ్యాపారి రామ్ రతన్ ఈ ఆరోపణలను ఖండించారు. కాగా టిక్ టాక్ స్టార్ కిరణ్ హీరోగా తెరకెక్కుతున్న "ఓయ్ ఇడియట్'' సినిమాలో హీరోయిన్ గా తృప్తి నటిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా దీనికి సంబంధించిన పోస్టర్ ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.