
రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా (Game Changer Movie) వచ్చి ఆరు నెలలు దాటిపోయింది. అయినా ఈ సినిమా పేరు సోషల్ మీడియాలో, ఫిల్మీదునియాలో మార్మోగిపోతోంది. కారణం.. దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ మొట్టమొదటిసారి మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం.. అందులో శిరీష్ ఏమన్నారంటే..? 'గేమ్ ఛేంజర్‌తో మా పని అయిపోయిందనుకున్నాం.. అంత నష్టం వచ్చినా హీరో, దర్శకుడు కనీసం ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదు. అలా అని వారిని తప్పుపట్టడం లేదు. రామ్‌చరణ్‌తో ఎలాంటి విభేదాలు లేవు. గేమ్ ఛేంజర్ నష్టాన్ని దాదాపు 70% సంక్రాంతికి వస్తున్నాం కవర్ చేసేసింది' అని పేర్కొన్నారు.
చంపుకుతింటున్నారు
ఈ కామెంట్స్ మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పించడంతో శిరీష్‌ను ఏకిపారేశారు. దీంతో శిరీష్.. మెగా ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్తూ లేఖ విడుదల చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై దిల్ రాజు (Dil Raju) అసహనం వ్యక్తం చేశారు. తమ్ముడు మూవీ ప్రమోషన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎప్పుడో జనవరిలో రిలీజైన గేమ్ ఛేంజర్ గురించి పదేపదే అడిగి చంపుకు తింటున్నారు. సినిమా రిలీజై ఆరు నెలలు అయిపోయింది. ప్రతిదాంట్లో గేమ్ ఛేంజర్ టాపిక్ తప్ప మరొకటి లేనే లేదు.
తొలిసారి ఇంటర్వ్యూ ఇస్తే..
ఎందుకసలు? బాగా ఆడిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి అడగొచ్చు కదా! ఇండస్ట్రీలో ఎన్నో ఫ్లాపులు వచ్చాయి. అలాంటప్పుడు గేమ్ ఛేంజర్‌ను మాత్రమే పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారు? ఇండస్ట్రీలో ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ అయినవి ఉన్నాయి. ఏ సినిమాను ఇంతగా పట్టించుకోలేదు. నా సోదరుడు శిరీష్ తొలిసారి ఇంటర్వ్యూ ఇస్తే ఆయన్ని కూడా వివాదంలోకి లాగి ట్రోల్ చేస్తున్నారు. ఇదంతా అవసరం లేదు కదా!
22 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా..
మేము తమ్ముడు సినిమా కోసం ప్రమోషన్స్ చేస్తున్నాం. దాన్ని వదిలేసి ఆరు నెలల కిందట రిలీజైన సినిమా గురించే మాట్లాడుతున్నారు. రామ్‌చరణ్‌కు, మాకు మధ్య సత్సంబంధాలున్నాయి. చరణ్‌కు ఈ ఏడాది హిట్ ఇవ్వలేకపోయాం. మంచి స్క్రిప్టు సెలక్ట్ చేసుకుని చరణ్‌తో సూపర్ హిట్ మూవీ చేస్తామని ఇదివరకే ప్రకటించాను. 22 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ అందరు స్టార్ హీరోలతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ అందరితోనూ సినిమాలు తీసిన సంస్థ ఇది.
చీల్చి చెండాడుతున్నారు
ఎక్కడా ఏ వివాదం లేకుండా పని చేసుకుంటూ వచ్చాను. కానీ ఆరు నెలల కిందట ఫ్లాప్ అయిన ఒక్క సినిమాను పట్టుకుని మమ్మల్ని చీల్చి చెండాడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ఇదే టాపిక్. జరిగిన సంభాషణంతా వదిలేసి కావాల్సిన చిన్న క్లిప్ తీసుకుని సంచలన హెడ్డింగ్స్ పెట్టి కాంట్రవర్సీ చేస్తున్నారు. ఇంత నెగిటివిటీ ఎందుకు? అయిపోయిన సినిమాను వదిలేయండి. జనవరి తర్వాత ఇండస్ట్రీలో ఎన్నో ఫ్లాపులున్నాయి. వాటిలో ఒక్క సినిమా గురించైనా మాట్లాడుతున్నారా? అని అసహనం వ్యక్తం చేశాడు.