నటి కుటుంబం దారుణ హత్య.. తీర్పు వెలువరించిన కోర్టు! | Sakshi
Sakshi News home page

Laila Khan: బాలీవుడ్ నటి ఫ్యామిలీ దారుణ హత్య.. తీర్పు వెలువరించిన కోర్టు!

Published Fri, May 24 2024 6:15 PM

Bollywood Actress Laila Khan Case Verdict Declared By Mumbai Court

బాలీవుడ్‌ నటి లైలా ఖాన్‌ ఫ్యామిలీ దారుణ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆమె సవతి తండ్రికి ముంబయి సెషన్స్‌ కోర్టు మరణశిక్ష విధించింది. దాదాపు 13 ఏళ్ల క్రితం జరిగిన ఈ దారుణ ఘటనపై విచారణ చేపట్టిన ముంబయి సెషన్స్ కోర్టు తుది తీర్పు వెలువరించింది.

అసలేం జరిగిందంటే?

బాలీవుడ్ నటి లైలా ఖాన్‌ ఫ్యామిలీ దారుణ హత్యకు గురికావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆమె సవతి తండ్రి అయిన పర్వేజ్‌ తక్‌ వారి ఫ్యామిలీ మొత్తాన్ని హతమార్చాడు. ఈ ఘటన 2011లో మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని ఇగత్‌పురిలో జరిగింది. ఈ ఘటనలో లైలా ఖాన్‌తో పాటు ఆమె తల్లి షెలీనా, తోబుట్టువులైన అజ్మీనా, జారా, ఇమ్రాన్, కజిన్‌ రేష్మాను అతను కాల్చిచంపాడు. వారి మృతదేహాలను వారి బంగ్లాలోనే పాతిపెట్టి పరారయ్యాడు.

‍అయితే ఈ ఘటన జరిగిన దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఈ దారుణం బయటకొచ్చింది. ఆ తర్వాత కేసు నమోదు చేసుకున్న పోలీసులు పర్వేజ్ తక్‌ను జమ్మూకశ్మీర్‌లో అరెస్ట్‌ చేశారు. కాగా.. పర్వేజ్‌ తక్ లైలా తల్లి షెలీనాకి మూడవ భర్తగా పోలీసులు నిర్ధారించారు. ఆస్తి వివాదం కారణంగానే ఆరుగురిని అత్యంత కిరాతకంగా కాల్చి చంపినట్లు విచారణలో వెల్లడైంది.

అసలు లైలా ఖాన్ ఎవరు?

బాలీవుడ్‌ నటి లైలా ఖాన్ 2008లో విడుదలైన వాఫా: ఎ డెడ్లీ లవ్ స్టోరీలో నటించింది. ఈ చిత్రానికి  రాకేశ్ సావంత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాజేష్ ఖన్నా సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత 2008లో కూల్ నహీ హాట్ హై హమ్‌ చిత్రంలో కనిపించింది. కాగా.. అంతకుముందే లైలా ఖాన్ 2002లో కన్నడ చిత్రం మేకప్‌తో సినిమాల్లోకి అడుగుపెట్టింది.

Advertisement
 
Advertisement
 
Advertisement