ఇజ్రాయెల్‌కు హిజ్బుల్లా ముప్పు.. అధునాతన ఆయుధాలతో దాడులు | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌కు హిజ్బుల్లా ముప్పు.. అధునాతన ఆయుధాలతో దాడులు

Published Sat, May 18 2024 8:35 AM

Hezbollah Become Big Threat To Israel Than Hamas

యుద్ధ వాతావరణం మధ్య ఇజ్రాయెల్‌ అట్టుడికిపోతోంది. తాజాగా లెబనీస్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా ఉత్తర ఇజ్రాయెల్‌లోని మిలిటరీ పోస్ట్‌పై డ్రోన్, క్షిపణి దాడులను చేసింది. హిజ్బుల్లా దాడుల్లో ముగ్గురు ఇజ్రాయెల్ సైనికులు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ మీడియాకు తెలిపింది. హిజ్బుల్లా గత ఏడు నెలలుగా ఇజ్రాయెల్‌పై నిరంతరం దాడులకు తెగబడుతోంది. ఇజ్రాయెల్ గగనతలం నుండి హిజ్బుల్లా ఈ దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ దాడులలో హిజ్బుల్లా అధునాతన ఆయుధాలను ఉపయోగించిందని సమాచారం.

ఇటీవలి  కాలంలో హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై దాడులను తీవ్రతరం చేయడం గమనార్హం. గాజా స్ట్రిప్‌లోని దక్షిణ నగరమైన రఫాలో ఇజ్రాయెల్ చొరబాటు అనంతరం హిజ్బుల్లా ఇజ్రాయెల్ అంతర్గత ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతూ వస్తోంది. గత ఏడాది అక్టోబర్ ప్రారంభం నుంచి సరిహద్దు వెంబడి హిజ్బుల్లా కాల్పులు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ మధ్యలో ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడుల తర్వాత, హిజ్బుల్లా దాడులు తీవ్రమయ్యాయి.

రఫాలో ఇజ్రాయెల్ సైనిక చర్య  అనంతరం హిజ్బుల్లా  ఈ విధమైన దాడులకు పాల్పడుతోంది. గాజాలో ఇజ్రాయెల్ దూకుడు వైఖరిని అవలంబిస్తూ దాడులు కొనసాగిస్తే ఉత్తర ఇజ్రాయెల్ నివాసితులు తమ స్వదేశానికి తిరిగి వెళ్లలేరని హిజ్బుల్లా హెచ్చరించింది. గాజాపై ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తున్నంత కాలం తమ బృందం పోరాడుతూనే ఉంటుందని హిజ్బుల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లా పేర్కొన్నారు. లెబనీస్ ఫ్రంట్, గాజా మధ్య సంబంధాలు స్థిరమైనవని, వాటిని ఎవరూ డీ లింక్ చేయలేరని హసన్ నస్రల్లా స్పష్టం చేశారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement