మెడికల్–ఫార్మా మాఫియాపై ఆందోళన
లక్ష్మీపురం: మెడికల్, ఫార్మా రంగాల్లో పెరుగుతున్న అవినీతి, దోపిడీకి వ్యతిరేకంగా రాష్ట్ర సమితి పిలుపుతో గుంటూరు జిల్లా సీపీఐ సమితి ఆధ్వర్యంలో శనివారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత, రాజ్యాంగ హక్కు అని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు. నాణ్యమైన ఆరోగ్యసేవలు అందించకపోతే జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ప్రైవేట్ కళాశాలల్లో స్టైఫండ్ ఎగవేతపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి అధ్యక్షత వహించారు. కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య, మేడా హనుమంతరావులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మంగళగిరి టౌన్ : నాస్తిక సమాజం ఆధ్వర్యంలో మంగళగిరి మండలం నిడమర్రులోని చార్వాక ఆశ్రమంలో రెండు రోజుల పాటు జరుగనున్న 34వ నాస్తిక మేళ శనివారం ప్రారంభమైంది. పలువురు వక్తలు నాస్తిక సమాజం జెండా ఎగురవేసి, సమాజం హితం కోసం కృషి చేసిన శాస్త్రవేత్తలకు నివాళులర్పించారు. అనంతరం నాస్తిక మేళాలో వైజ్ఞానికతకు, మతభావాలకు పొసగని మైత్రి అనే అంశంపై డాక్టర్ జయకుమార్ మాట్లాడుతూ వియాత్నం వంటి చిన్నదేశం మతరహిత దేశంలో అభివృద్ధిలో ఎంతో ముందుకు వెళ్లిందని తెలిపారు. శాస్త్రవేత్తలు సత్యం కోసం శ్రమిస్తారని, మతవాదుల్లాగా దాడులు చేయరని అన్నారు. ప్రాచీన భారతంలో చార్వాకం అనే అంశంపై ఎం.వి.ఎస్. శర్మ మాట్లాడుతూ చార్వాక సిద్ధాంతం ప్రజల్లో ఒకరి నుంచి ఒకరికి తరతరాలుగా చేరుతోందని తెలిపారు. అనంతరం చార్వాక రామకృష్ణ అనే పుస్తకాన్ని డాక్టర్ భానుప్రసాద్, డాక్టర్ స్వరూపరాణి, శివారెడ్డిలు ఆవిష్కరించారు. రెండు రోజులు జరిగే ఈ నాస్తిక మేళాలో పలు అంశాలపై సదస్సులు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు, హేతువాదులు, నాస్తికులు పాల్గొన్నారు.
పెదగొట్టిపాడు (ప్రత్తిపాడు): కోటప్పకొండలో కొలువుదీరిన కై లాసనాథుని సన్నిధికి గొట్టిపాడు గ్రామస్తులు దశాబ్దాలుగా అందాల ప్రభ ఆనవాయితీని కొనసాగించారు. పూర్వం సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం ఆ గ్రామ పూర్వీకులు శివరాత్రికి భారీ ప్రభను కట్టుకుని ఎడ్ల జతలతో గ్రామం నుంచి భారీ ప్రదర్శనగా కోటప్పకొండకు తరలివెళ్లేవారు. ఈ ఏడాదీ అదే పద్ధతిని కొనసాగిస్తూ ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామ ప్రజలు ప్రభను కట్టుకుని తిరునాళ్లకు తరలివెళ్లారు. శుక్రవారం రాత్రి దేదీప్యమానంగా కాంతులీనుతున్న ప్రభ శోభాయాత్ర గ్రామంలో నేత్రపర్వంగా జరిగింది. అప్పట్లో ఎనభై అడుగుల భారీ ప్రభను నిర్మించారు. ఇప్పుడు ఊరేగింపులో పరిమితుల దృష్ట్యా ఎత్తు తగ్గించారు. తూర్పు వీధి వారు ఈ ఏడాది ప్రభను తయారు చేశారు. శనివారం ఎడ్ల బండిపై ప్రభను తిరునాళ్లకు తరలించారు.
మెడికల్–ఫార్మా మాఫియాపై ఆందోళన
మెడికల్–ఫార్మా మాఫియాపై ఆందోళన


