మహాశివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివ భక్తుల, ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఆర్‌ఎం సామ్రాజ్యం తెలిపారు. గుంటూరు జిల్లాపరిధిలోని ఐదు డిపోల నుంచి ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్లు వివరించారు. కోటప్పకొండ తిరునాళ్లకు గుంటూరు డిపో –1 నుంచి 35, డిపో–2 నుంచి 30, మంగళగిరి నుంచి 15, పొన్నూరు నుంచి 10, తెనాలి నుంచి ఐదు, మొత్తం 95 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గోవాడలోని బాలకోటేశ్వరస్వామి ఆలయానికి పొన్నూరు నుంచి 10 బస్సులు, తెనాలి నుంచి 26 బస్సులు, క్వారీ తిరునాళ్లకు తెనాలి నుంచి 26 బస్సు లు,గుంటూరు డిపో–2 నుంచి 12 బస్సులు తిప్పుతున్నట్లు తెలిపారు. ఆయా రూట్‌లలో తిరిగే బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయన్నారు.


