
మహనీయులు లాల్ బహదూర్ శాస్త్రి
పిల్లలూ! మీరెప్పుడూ అందరూ మెచ్చుకునే స్థితిలోనే ఉండాలి తప్ప ఎవరూ మీ మీద జాలి పడే స్థితిలో ఉండకూడదు. ఈ విషయం మీకు అర్థమవ్వాలంటే ఈ సంఘటన తెలుసుకోండి.
అనగనగా ఓ పిల్లవాడు తన తోటివారితో కలిసి గంగానది అవతలి ఒడ్డున జరిగే జాతర చూసేందుకు వెళ్లాడు. అతనిది పేద కుటుంబం. తండ్రి మరణించడంతో బంధువుల వద్ద ఉంటూ తల్లి అతణ్ని పెంచుతోంది. పడవ ఖర్చుల కోసం ఆమె అతనికి కొంత డబ్బు ఇచ్చింది. దాన్ని అతను జాతరలో ఖర్చుపెట్టాడు. తిరిగి వచ్చేటప్పుడు పడవ ఎక్కేందుకు అతని వద్ద డబ్బు లేదు. మేమిస్తామని స్నేహితులు అతనికి చెప్పారు.
కానీ ఆత్మగౌరవం కలిగిన అతను ఆ డబ్బు తీసుకోలేదు. స్నేహితులను పడవలో వెళ్లమని చెప్పి, తనొక్కడే నదిలో ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. చూశారా! ఎవరి వద్దా ఊరికే డబ్బు తీసుకోకూడదని అతనికెంత పట్టుదలో! ఆ పిల్లాడెవరో కాదు, మన దేశానికి రెండో ప్రధానిగా పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి. ‘జై జవాన్.. జై కిసాన్’ అన్న నినాదం ఆయన ఇచ్చిందే. అయితే మీరు ఇలాంటి సాహసాలు చేయొద్దు. బాగా ఈత వచ్చిన వారే ఇలాంటివి చేయాలి. స్ఫూర్తిని గ్రహిస్తే చాలు.
ఇదీ చదవండి : మెగా మ్యూజియం గురించి తెలుసా?