సేవాజ్యోతి

Inspirational Story of  Head Nurse Arogya Jyoti - Sakshi

అనారోగ్యాలను దూరం చేసే చల్లని చిరునవ్వు .. విధి నిర్వహణలో అంకితభావం .. రోగులపాలిట ఆమె అపర నైటింగేల్‌ ... సమాజ క్షేమం కోరేవారికి తర తమ భేదాలుండవు అని  తన చేతల్లో చూపుతోంది కామారెడ్డి జిల్లా బాన్సువాడ  ఏరియా ఆస్పత్రిలో హెడ్‌నర్స్‌గా పనిచేస్తున్న ఆరోగ్యజ్యోతి.

పాతికేళ్లుగా విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ఎంతోమంది మన్ననలు అందుకున్నారు ఆరోగ్యజ్యోతి. ఆమె సేవలను గుర్తించి ది నేషనల్‌ ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, ది న్యూస్‌ పేపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ కర్నాటక వారు ‘నేషనల్‌ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌–2023’ అవార్డుకు ఆమెను ఎంపిక చేశారు. మంగళవారం బెంగళూరులోని రవీంద్ర కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకుని సేవాజ్యోతిగా గుర్తింపు పొందింది అరోగ్యజ్యోతి. 

బోధన్‌ పట్టణానికి చెందిన ఆరోగ్యజ్యోతి బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో హెడ్‌నర్స్‌గా విధులు నిర్వహిస్తోంది. 1998లో స్టాఫ్‌ నర్స్‌ ఉద్యోగంలో చేరి నిజామాబాద్‌ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రెండేళ్లు పనిచేసిన ఆమె 2000 సంవత్సరంలో బోధన్‌ ఏరియా ఆస్పత్రికి బదిలీ అయి అక్కడే ఇరవై ఏళ్లుగా విధులు నిర్వర్తించింది. 2019 లో హెడ్‌ నర్స్‌గా పదోన్నతి పొందిన ఆరోగ్యజ్యోతి బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి బదిలీ అయి, అక్కడే విధుల్లో కొనసాగుతోంది.

కరోనా కాలంలో వైద్యులతో కలిసి రోగులకు ఎన్నో సేవలందించిన ఈ నైటింగేల్‌ పాతికేళ్ల కాలంలో ఎక్కడ ఉద్యోగం చేసినా విధి నిర్వహణకు అంకితమై పనిచేస్తూ వచ్చింది. దీంతో ఆమె అందరికీ తలలో నాలుకలా మారింది. ఆపరేషన్‌ థియేటర్‌తోపాటు ప్రసూతి వార్డుల్లోనే ఆమె ఎక్కువగా విధులు నిర్వర్తించింది. అధికారుల నుంచి ఎన్నో మన్ననలు, సామాజిక సేవలకు గాను అవార్డులనూ పొంది సేవాగుణంలో ముందువరసలో నిలిచింది.  

కూతురి మరణంతో.. 
ఆరోగ్య జ్యోతి కూతురు అనుకోని పరిస్థితుల్లో విద్యుత్‌షాక్‌కు గురై మరణించింది. కూతురి మరణంతో ఆవేదనకు గురైన ఆరోగ్యలక్ష్మి తన సేవలను మరింత విస్తృతం చేయాలని సంకల్పించింది. ఆరోగ్యజ్యోతి చారిటబుల్‌ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి సేవాకార్యక్రమాలు చేపట్టింది.

వైద్యరంగంలో తనకున్న పరిచయాలతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ పేదలకు ఉచితంగా మందులు పంపిణీ చేసే కార్యక్రమాలు చేపడుతుంటుంది. బీపీ, షుగర్, గుండె సంబంధ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేపట్టి రోగులకు అండగా నిలుస్తోంది. అలాగే క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు కూడా చేపట్టి, గర్భిణీలు, బాలింతలకు అత్యవసర పరిస్థితుల్లో రక్తం కోసం శిబిరాలు ఏర్పాటు చేసి ఆదుకుంటుంది.   – ఎస్‌.వేణుగోపాల్‌ చారి, సాక్షి, కామారెడ్డి 

మాకెంతో గర్వకారణం 
సేవతో అందరి మన్ననలు పొందే ఆరోగ్యజ్యోతి నేషనల్‌ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌–2023 అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మేమంతా గర్వించదగ్గ విషయం. ఈ అవార్డు స్ఫూర్తి మిగతా అందరిలో కలగాలని కోరుకుంటున్నాను.   – డాక్టర్‌ శ్రీనివాసప్రసాద్, సూపరింటెండెంట్,  బాన్సువాడ ఏరియా ఆస్పత్రి 

అందరి  సహకారంతో... 
సేవా కార్యక్రమాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉంది. ఉద్యోగ నిర్వహణలో తోటి ఉద్యోగులు, వైద్యుల సహకారం,ప్రోత్సాహంతోనే ముందుకు సాగుతున్నాను. నా చిన్నప్పుడు మా అమ్మానాన్నలు ఎంతోమందికి సాయం అందించేవారు. వాళ్లను చూసి నాకూ అలవాటైంది. నా ప్రయత్నాల్లో మా వారు అండగా నిలిచారు. అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. మరింత బాధ్యత పెరిగిందని భావిస్తున్నాను.   – ఆరోగ్యజ్యోతి,  హెడ్‌నర్స్, బాన్సువాడ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top