
చెస్ గురించి పెద్దగా ఆసక్తి లేని వారికి కూడా ఇప్పుడు సుపరిచిత పేరు... దివ్యా దేశ్‌ముఖ్. ప్రపంచం మెచ్చిన అపూర్వ విజయం తరువాత తన తల్లిని కౌగిలించుకొని భావోద్వేగానికి గురువుతున్న దివ్య వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘తల్లి అంటే ఎంతోమంది స్టార్‌ల వెనుక ఉన్న అన్‌సంగ్ హీరో’ అని దివ్య తల్లి గురించి ప్రశంసిస్తూ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర.
‘ఎంత గ్రాండ్‌మాస్టర్ అయినా తల్లి చాటు బిడ్డే’ అన్నారు నెటిజనులు. తల్లులు పిల్లల గురించి ఎన్నో కలలు కంటారు. వారి కలలను తమ కలలుగా భావిస్తారు. వారి కష్టాలను తమ కష్టాలుగా భావిస్తారు. పిల్లల కంటే ఎక్కువగా వారి విజయాలకు సంతోషంతో ఉప్పొంగిపోతారు. అందుకే...అమ్మలు అన్‌సంగ్ హీరోలు. ఉమెన్స్ చెస్ వరల్డ్ కప్ గెలుచుకున్న తరువాత ‘ఎవరీ దివ్య దేశ్‌ముఖ్?’ అనే ఆసక్తి చాలామందిలో మొదలైంది. చాలా చిన్న వయసు నుంచే చెస్ ఆడడం మొదలుపెట్టిన దివ్య చెస్‌లోనే కాదు చదువులోనూ ‘శభాష్’ అనిపించుకునేది.
‘అయిదేళ్ల వయసు నుంచే చెస్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తూ వస్తోంది దివ్య. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు గెలుచుకున్న దివ్యకు కామ్‌గర్ల్‌గా పేరు. జయాపజయాలలో ఒకేరకంగా ఉండడం కొందరికి మాత్రమే సాధ్యపడుతుంది. అలాంటి వారిలో దివ్య ఒకరు. ఓడిపోయిన సందర్భంలోనూ ఆమె కళ్లలో బాధ కనిపించేది కాదు. టోర్నమెంట్ గెలచినప్పుడు ట్రోఫీతో నా దగ్గరకు వచ్చేది.
తాను సాధించిన విజయం గురించి ఎంతోమాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ చాలా తక్కువగా మాట్లాడేది. తనకు ఇష్టమైన ఆట, చదువును రెండిటినీ విజయవంతంగా సమన్వయం చేసుకునేది. నాగ్‌పూర్ కాకుండా వేరే చోట చెస్ పోటీలు జరిగినప్పుడు పాఠ్యపుస్తకాలను తీసుకువెళ్లేది. చదువును ఎప్పుడూ అశ్రద్ధ చేయలేదు’ అంటూ గత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంది నాగ్‌పూర్‌లోని భారతీయ విద్యాభవన్ స్కూల్ మాజీ ప్రిన్సిపాల్ అంజు భూటాని.
Divya’s hug to her mom says everything ❤️#FIDEWorldCup @DivyaDeshmukh05 pic.twitter.com/jeOa6CjNc1
— International Chess Federation (@FIDE_chess) July 28, 2025
(చదవండి: రికార్డు బ్రేకింగ్ నాట్య ప్రదర్శన..! ఏకంగా 170 గంటల పాటు..)