ఐపీఓలకు సెబీ లైన్‌ క్లియర్‌ | SEBI approved IPOs for several companies | Sakshi
Sakshi News home page

ఐపీఓలకు సెబీ లైన్‌ క్లియర్‌

Jun 18 2025 8:50 AM | Updated on Jun 18 2025 8:50 AM

SEBI approved IPOs for several companies

కొత్త ఏడాదిలో తిరిగి జోరందుకున్న ప్రైమరీ మార్కెట్లు పలు అన్‌లిస్టెడ్‌ కంపెనీలకు జోష్‌నిస్తున్నాయి. ఈ ప్రభావంతో తాజాగా మూడు కంపెనీలు లిస్టింగ్‌ బాట పట్టాయి. క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు అనుమతిపొందాయి. జాబితాలో సన్‌షైన్‌ పిక్చర్స్, లూమినో ఇండస్ట్రీస్, ఎంఅండ్‌బీ ఇంజినీరింగ్‌ చేరాయి. ఈ మూడు కంపెనీలు ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరి మధ్య సెబీకి ప్రాస్పెక్టస్‌ దాఖలు చేశాయి. వివరాలు చూద్దాం..

విపుల్‌ షా సంస్థ

టీవీ, సినిమాల నిర్మాత, దర్శకుడు విపుల్‌ షా కంపెనీ సన్‌షైన్‌ పిక్చర్స్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. దీనిలో భాగంగా 50 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 33.75 లక్షల షేర్లను ప్రమోటర్లు ఆఫర్‌ చేయనున్నారు. వెరసి ఐపీవోలో 83.75 లక్షల షేర్లను విక్రయించనుంది. కంపెనీ ప్రమోటర్లలో ప్రధానంగా విపుల్‌ అమృత్‌లాల్‌ షా 23.69 లక్షల షేర్లు, షెఫాలీ విపుల్‌ షా 10 లక్షల షేర్లు చొప్పున విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను దీర్ఘకాలిక వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు వినియోగించనుంది. వీటితోపాటు రూ. 94 కోట్లు భవిష్యత్‌ వృద్ధి, కార్యకలాపాల నిర్వహణకు వెచ్చించనుంది.

ఈపీసీ కంపెనీ

ప్రధానంగా ఈపీసీ కార్యకలాపాలు నిర్వహించే కోల్‌కతా కంపెనీ లూమినో ఇండస్ట్రీస్‌ ఐపీవో బాటలో సాగుతోంది. ఇందుకు వీలుగా రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 1,000 కోట్ల సమీకరణపై కన్నేసింది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 420 కోట్లు రుణ చెల్లింపులకు వెచి్చంచనుంది. రూ. 15 కోట్లు పెట్టుబడి వ్యయాలకు వినియోగించనుంది. మిగిలిన నిధులు సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కేటాయించనుంది.

పీఈబీ సేవలు  

ప్రీఇంజినీర్డ్‌ బిల్డింగ్స్‌(పీఈబీ)తోపాటు సెల్ఫ్‌సపోర్టెడ్‌ రూఫింగ్‌ సర్వీసులందించే ఎంఅండ్‌బీ ఇంజినీరింగ్‌ ఐపీవోకు సిద్ధపడుతోంది. ఇందుకు అనుగుణంగా గుజరాత్‌ కంపెనీ రూ. 325 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 328 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్‌ చేయనున్నారు. దీంతో ఐపీవో ద్వారా రూ. 653 కోట్లు సమీకరించనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 64 కోట్లు పరికరాలు, మెషీనరీ కొనుగోలుకి వెచి్చంచనుంది. రూ. 60 కోట్లు రుణ చెల్లింపులకు, మరో రూ. 110 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు కేటాయించయనుంది. మిగిలిన నిధులు సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది.

గ్లోబ్‌ ప్రాజెక్ట్స్‌  @ రూ. 67–71

మౌలిక సదుపాయాల అభివృద్ధి కంపెనీ గ్లోబ్‌ సివిల్‌ ప్రాజెక్ట్స్‌ పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 24న ప్రారంభంకానుంది. 26న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 67–71 చొప్పున ప్రకటించింది. దీనిలో భాగంగా రూ. 10 ముఖ విలువగల 1,67,60,560 ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 119 కోట్లు సమకూర్చుకోవాలని ఆశిస్తోంది. వీటిలో రూ. 75 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు, రూ. 14 కోట్లు పరికరాలు, మెషీనరీ కొనుగోలుకి వెచ్చించనుంది. మిగిలిన నిధులు సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. 2024 డిసెంబర్‌ 31తో ముగిసిన 9 నెలల కాలానికి దాదాపు రూ. 255 కోట్ల ఆదాయం, రూ. 18 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2025 మార్చి31కల్లా కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ. 669 కోట్ల విలువైన ఆర్డర్‌బుక్‌ను కలిగి ఉంది.  

ఇదీ చదవండి: హోండా ‘ఎక్స్‌ఎల్‌...’ ధర రూ.10,99,990

స్టార్‌బిగ్‌బ్లాక్‌ ఐపీవో బాట

స్టార్‌బిగ్‌బ్లాక్‌ బిల్డింగ్‌ మెటీరియల్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. తాజాగా నిర్వహించిన అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎం)లో ఇందుకు వాటాదారులు అనుమతించినట్లు కంపెనీ వెల్లడించింది. బీఎస్‌ఈ లిస్టెడ్‌ బిగ్‌బ్లాక్‌ కన్‌స్ట్రక్షన్‌కు పూర్తి అనుబంధ సంస్థఇది. ఐపీవో ద్వారా సంస్థకు సరైన విలువను వెలికితీయడం, విస్తరణకు అవసరమైన పెట్టుబడుల సమీకరణ తదితరాలకు వీలుంటుందని మాతృ సంస్థ బిగ్‌బ్లాక్‌ కన్‌స్ట్రక్షన్‌ పేర్కొంది. అయితే నియంత్రణ సంస్థల అనుమతులు, క్యాపిటల్‌ మార్కెట్‌ పరిస్థితులు, ఇతర క్లియరెన్స్‌లపై ఆధారపడి ఐపీవో చేపట్టనున్నట్లు వివరించింది. 2015లో ఏర్పాటైన బిగ్‌బ్లాక్‌ కన్‌స్ట్రక్షన్‌ దేశీయంగా ఏఏసీ బ్లాకు తయారీలో ఏకైక లిస్టెడ్‌ కంపెనీగా నిలుస్తోంది. గుజరాత్, మహారాష్ట్రలలోగల ప్లాంట్ల ద్వారా వార్షికంగా 1.3 మిలియన్‌ ఘనపు మీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. గతేడాది(2024–25) రూ. 225 కోట్ల ఆదాయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement