
సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు
రూ.2,035 కోట్ల సమీకరణపై కన్ను
డెయిరీ ప్రొడక్టుల కంపెనీ మిల్కీ మిస్ట్ డెయిరీ ఫుడ్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. అనుమతుల కోసం క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ.1,785 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 250 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఐపీవో ద్వారా రూ. 2,035 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది.
ఇదీ చదవండి: ఐఎంఎఫ్‌కు గీతా గోపీనాథ్ గుడ్‌బై
ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 750 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 414 కోట్లు పెరుందురై ప్లాంట్ విస్తరణ, ఆధునీకరణకు వినియోగించనుంది. విస్తరణలో భాగంగా వే ప్రొటీన్ కాన్సన్‌ట్రేట్, యోగర్ట్, క్రీమ్ చీజ్ తయారీ యూనిట్లను నెలకొల్పనుంది. ఈ బాటలో మరో రూ. 129 కోట్లు విసీ కూలర్స్, ఐస్‌క్రీమ్ ఫ్రీజర్స్, చాకొలెట్ కూలర్స్ తదితరాల ఏర్పాటుకు వెచ్చించనుంది. తమిళనాడులోని ఈరోడ్‌లో ప్రారంభమైన కంపెనీ పనీర్, చీజ్, యోగర్ట్, బటర్, నెయ్యి తదితర వివిధ డెయిరీ ప్రొడక్టులను రూపొందించి విక్రయిస్తోంది. గతేడాది(2024–25) రూ. 2,349 కోట్ల ఆదాయం, రూ. 310 కోట్ల నిర్వహణ లాభం (ఇబిటా) సాధించింది.