
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యూహాత్మక పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఆమ్నీచానల్ ఫార్మసీ, డిజిటల్ హెల్త్ వ్యాపారాలను విడదీసి, లిస్ట్ చేసే ప్రతిపాదనకు అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ (ఏహెచ్‌ఈఎల్) బోర్డు ఆమోదముద్ర వేసింది. దీనికి సంబంధించిన స్కీము ప్రకారం లిస్టింగ్‌కు 18–21 నెలల వ్యవధి పట్టనుంది. ఇందులో భాగంగా తొలి దశలో ఆమ్నీచానల్ ఫార్మా, డిజిటల్ హెల్త్ వ్యాపారాన్ని కొత్త సంస్థగా విడగొడతారు. తర్వాత హెల్త్‌కేర్ విభాగం అపోలో హెల్త్‌కో (ఏహెచ్‌ఎల్), హోల్‌సేల్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్ కీమెడ్‌ను కొత్త సంస్థలో విలీనం చేస్తారు.
ఈ ప్రక్రియతో దేశీయంగా దిగ్గజ ఆమ్నీచానల్ ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్, డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫాం ఏర్పడుతుందని అపోలో హాస్పిటల్స్ తెలిపింది. ఇది 2027 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 25,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగలదని పేర్కొంది. స్కీము ప్రకారం కొత్త సంస్థ, స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టింగ్‌కు దరఖాస్తు చేసుకుంటుంది. ఏహెచ్‌ఈల్ షేర్‌హోల్డర్ల వద్ద ఉన్న ప్రతి 100 షేర్లకు గాను కొత్త కంపెనీకి చెందిన 195.2 షేర్లు లభిస్తాయి. అత్యంత నాణ్యమైన హెల్త్‌కేర్ సేవలను కోట్ల మందికి అందుబాటులోకి తెచ్చేందుకు ఈ మోడల్ ఉపయోగపడుతుందని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు.