వివాహేతర సంబంధం: నీవు ఏమన్నా నాకు తాళికట్టిన మొగుడివా..? | - | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం: నీవు ఏమన్నా నాకు తాళికట్టిన మొగుడివా..?

Dec 24 2023 1:20 AM | Updated on Dec 24 2023 1:16 PM

- - Sakshi

మదనపల్లె : మండలంలోని తట్టివారిపల్లె చెరువు మొరవలో అనుమానాస్పద స్థితిలో లభ్యమైన మహిళ మృతదేహానికి సంబంధించి జరిపిన దర్యాప్తులో హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈమేరకు నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు తాలూకా సీఐ ఎన్‌.శేఖర్‌ తెలిపారు. శనివారం తాలూకా పోలీస్‌ స్టేషన్‌లో మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈనెల 13న తట్టివారిపల్లె చెరువు మొరవలో మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో పడి ఉందన్న సమాచారం మేరకు సిబ్బందితో వెళ్లి పరిశీలించామన్నారు. మృతదేహం కుళ్లిపోయి, తరలించేందుకు వీలులేని స్థితిలో ఉండటంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. మృతదేహం లభించిన ప్రదేశంలో దొరికిన వస్తువుల ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించామన్నారు.

మృతురాలు నిమ్మనపల్లె మండలం తవళం పంచాయతీ ముతకనబండకు చెందిన సుబ్రహ్మణ్యం భార్య కత్తి భూదేవి(44)గా గుర్తించామన్నారు. భర్త చనిపోవడంతో జీవనోపాధి కోసం గ్రామాన్ని వదలి పట్టణంలో చిత్తుకాగితాలు, వాటర్‌బాటిల్స్‌ ఏరుకుని అమ్మి జీవనం సాగించేందన్నారు. ఈ క్రమంలో గుజిరీ వృత్తిగా జీవిస్తున్న కురబలకోట మండలం తెట్టుపంచాయతీ దొమ్మన్నబావికి చెందిన శ్రీనివాసులు(36)కు పరిచయం కావడంతో ఇద్దరూ సహజీవనం చేసేవారన్నారు. రోజంతా గుజిరీ సామానులు ఏరుకోవడం, వచ్చిన ఆదాయంతో భోజనం తినడం, మద్యం సేవించడం చేసేవారన్నారు. ఈ నేపథ్యంలో భూదేవి మరొకరితో చనువుగా ఉండటాన్ని శ్రీనివాసులు గమనించాడు.

ఘటనకు 15 రోజుల ముందు భూదేవి, శ్రీనివాసులు తట్టివారిపల్లె చెరువు కట్ట వద్దకు మధ్యాహ్నసమయంలో వెళ్లి భోజనం చేసి మద్యం సేవించారు. మత్తులో శ్రీనివాసులు, భూదేవి అక్రమ సంబంధంపై నిలదీశాడు. తాను ఉండగా, మరొక వ్యక్తితో అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించాడు. దీనికి భూదేవి నీవు ఏమన్నా నాకు తాళికట్టిన మొగుడివా..? నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను. అడగడానికి నీవెవరివి అని ఎదురుతిరగడంతో ఆగ్రహించిన శ్రీనివాసులు భూదేవిని కొట్టాడు. దీంతో భూదేవి తిరగబడి కర్రతో శ్రీనివాసులుపై దాడిచేసింది. దాడిలో అతని చెవికి గాయం కావడంతో, పట్టరాని కోపంలో పక్కనే ఉన్న బండరాయిని తీసుకుని భూదేవి తలపై మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోగా, నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.

మృతదేహం కుళ్లిన స్థితిలో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి విచారణలో భాగంగా హత్యకేసుగా మార్చినట్లు సీఐ తెలిపారు. మృతురాలు దళిత మహిళ కావడంతో హత్యకేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుచేసి, ఎస్సీ,ఎస్టీ సెల్‌ డీఎస్పీకి అప్పగించామన్నారు. నిందితుడిని శనివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపామన్నారు. కేసు దర్యాప్తులో ఎస్‌ఐ సుధాకర్‌, రవికుమార్‌, ఏఎస్‌ఐ సుబ్రహ్మణ్యం, హెడ్‌కానిస్టేబుల్‌ జయచంద్ర, కానిస్టేబుల్‌ ప్రభాకర్‌లు బృందంగా ఏర్పడి సమర్ధవంతంగా పనిచేసి హంతకుడి అరెస్ట్‌లో కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement