
భవానీపురం (విజయవాడ పశ్చిమ): విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ దర్శనానికి ఘాట్ రోడ్ మీదుగా వెళ్లే భక్తుల రాకపోకలను నిలుపుదల చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండపై ఉన్న రాళ్లు మెత్తబడటంతో మంగళవారం రాత్రి కొండపై నుంచి చిన్నపాటి రాళ్లు ఘాట్ రోడ్‌పై జారి పడ్డాయి.
కొండ చరియలు విరిగి కింద పడకుండా ఘాట్ రోడ్‌లో కొండ చుట్టూ మెష్ ఏర్పాటు చేసినప్పటికీ భక్తుల రక్షణను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్త చర్యలుగా వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు ఘాట్ రోడ్‌లో వాహనాల రాకపోకలను బంద్ చేశారు. ఈ మేరకు ఆలయ ఈవో దర్భముళ్ల భ్రమరాంబ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.