డిసెంబర్ 9 కల్లా రెండు రాష్ట్రాలు! | Sakshi
Sakshi News home page

డిసెంబర్ 9 కల్లా రెండు రాష్ట్రాలు!

Published Wed, Aug 7 2013 1:38 AM

డిసెంబర్ 9 కల్లా రెండు రాష్ట్రాలు! - Sakshi

 సోనియాగాంధీ పుట్టినరోజు నాటికి విభజన బిల్లు ఆమోదం  
  కేంద్రం పరిశీలనలో రాయల తెలంగాణ, భద్రాచలం అంశాలు  
 తెలంగాణలోని సీమాంధ్రులు సెటి లర్లు కాదు
  సర్వీస్ నిబంధనల మేరకే ఉద్యోగుల విషయంలో నిర్ణయం  
 రాష్ట్రపతి అసెంబ్లీ తీర్మానం కోరే అవకాశం లేదు
  విభజన ప్రక్రియలో సీఎం భాగస్వామి కాలేనంటే హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది
  పీసీసీ మాజీ చీఫ్ డీఎస్ వెల్లడి

 
 సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పుట్టిన రోజైన డిసెంబర్ 9 నాటికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పడతాయని పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తంచేశారు. ఇప్పటికే విభజన నిర్ణయం జరిగిపోయినందున ఇంకా కలిసి ఉండాలనడంలో అర్థంలేద న్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం జరిగినప్పటికీ రాయల తెలంగాణ, సీమాంధ్రలో భద్రాచలం కలపడం వంటి అంశాలు కూడా కేంద్రం పరిశీలనలో ఉన్నాయని ఆయన తెలిపారు. తెలంగాణలో నివసిస్తున్న సీమాంధ్రులంతా తెలంగాణలో అంతర్భాగమేనని, ఇక్కడ పనిచేస్తున్న ఆ ప్రాంత ఉద్యోగుల విషయంలో కేంద్రం.. సర్వీస్ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న సమైక్య ఉద్యమాలను ఎదుర్కొనడమే కాంగ్రెస్ పార్టీ ముందున్న కర్తవ్యమని చెప్పారు.
 
 తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడారు. టీజేఎఫ్ కన్వీనర్ అల్లం నారాయణ, నాయకులు శైలేష్‌రెడ్డి, పల్లె రవికుమార్, పీవీ శ్రీనివాస్, క్రాంతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన, తెలంగాణ పునర్నిర్మాణం తదితర అంశాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు డీఎస్ బదులిచ్చారు. ‘గత నాలుగేళ్లుగా కాంగ్రెస్ హైకమాండ్ విస్తృత సంప్రదింపులు, చర్చలు, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నియామకం, ఆ కమిటీ నివేదిక ఇవ్వడం, కేంద్రం పలుమార్లు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించడం, ప్రతి ఒక్క పార్టీతో.. ప్రజాప్రతినిధులతో అభిప్రాయ సేకరణ... ఇలా అనేక రకాలుగా కసరత్తు చేసిన తర్వాతే తెలంగాణపై నిర్ణయం జరిగింది. ఇప్పుడు తొందరపాటు నిర్ణయమని సీమాంధ్ర నేతలు చెప్పడం సరికాద’న్నారు.
 
 విభజన నిర్ణయం అమలు బాధ్యత సీఎందే..
 ‘రాష్ట్ర విభజన నిర్ణయం అమలుచేయాల్సిన బాధ్యత సీఎంతోపాటు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై ఉంది. వారు ఆ పని చేస్తారనే భావిస్తున్నా. ఒకవేళ విభజన ప్రక్రియలో భాగస్వామిని కాలేనని సీఎం చెబితే పార్టీ తగిన నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలం టూ వారు సంతకాలు చేశారని విన్నాను. అది వారి విచక్షణకే వదిలేస్తున్నా. నేను సమాధానం చెప్పలేను. తెలంగాణలో నివసిస్తున్న సీమాంధ్రులు సెటిలర్లు కాదు. కాంగ్రెస్ డిక్షనరీలో సెటిలర్లు అనే పదానికే తావు లేదు. వారంతా తెలంగాణలో అంతర్భాగమే. సీమాంధ్ర ఉద్యోగుల రక్షణకు ఢోకా లేదు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ఏర్పాటుకు రెండు మార్గాలున్నాయి. ఒకటి.. అసెంబ్లీలు తీర్మానం చేస్తే కేంద్రం తగిన చర్య తీసుకోవడం. రెండోది వివిధ రూపాల్లో వస్తున్న ఆందోళనలు, ఉద్యమాల కారణంగా కేంద్రం తనంతట తాను విభజన ప్రక్రియ చేపట్టడం కోసం అసెంబ్లీ అభిప్రాయాన్ని కోరడం. తెలంగాణ విషయంలో కేంద్రం రెండో ప్రక్రియను చేపట్టింది. ఈనెల 8న కేంద్ర కేబినెట్ తెలంగాణ అంశంపై చర్చించి రాష్ట్రపతికి పంపుతుంది. ఆ తర్వాత రాష్ట్రపతి అసెంబ్లీ అభిప్రాయాన్ని మాత్రమే కోరతారు. తీర్మానం చేయమని కోరే అవకాశంలేదు. 4,5 నెలల్లోనే విభజన ప్రక్రియ ముగుస్తుందని కేంద్ర హోంమంత్రి కూడా చెప్పినందున సోనియా పుట్టినరోజు నాటికి రెండు రాష్ట్రాలు ఏర్పడతాయనే నమ్మకం నాకుంది.’
 
 వాళ్లు తెలంగాణలో కలుస్తానంటే సంతోషమే
 ‘రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల నేతలు ఆంధ్రలో ఉండలేమని చెబుతున్నారు. తెలంగాణలో కలుస్తామంటున్నారు. ఇది సంతోషమే. రాయల తెలంగాణ అంశం కేంద్రం పరిశీలనలో ఉంది. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారనేది ఊహాజనితమే. దీనిని ఎవరూ ఒప్పుకునే ప్రసక్తిలేదు. హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా చేసే ప్రతిపాదన కేంద్రం వద్ద లేదు. ఇక తెలంగాణ విడిపోతే అభివృద్ధి కాలేదని అంటున్న వాళ్లు సైతం ఆశ్చర్యపోయేలా ఊహించని అభివృద్ధి సాధించడమే లక్ష్యం. తెలంగాణలో పుష్కలంగా వనరులున్నాయి. 70, 80 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయి. విద్యుత్ ఉత్పత్తిని మరింత పెంచుకోవాలి. విద్య, వైద్య రంగాలను విస్తృతం చేయాలి. దేవుడిచ్చిన శరీరాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఆత్మహత్య చేసుకుంటాననడం ఎంత తప్పో... సాగుకు యోగ్యమైన భూమిని సాగులోకి తేకుండా ఉంచడం కూడా అంతే తప్పు.’
 
 కేసీఆర్ హైకమాండ్‌కు చాలా దగ్గరి మనిషి
 ‘టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు కాంగ్రెస్ హైకమాండ్‌కు చాలా దగ్గర మనిషి. మంచి సంబంధాలున్నాయి. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్ చాలాసార్లు చెప్పారు. మొన్న కూడా తెలంగాణ బిల్లు పాసయ్యాక విలీనంపై చర్చిస్తానన్నారు. అవసరమైతే నా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాను.’
 
 నేను వినాయకుడిని.. కేసీఆర్ కుమారస్వామి!
 ‘తెలంగాణ సాధన విషయంలో మీరెందుకు స్పీడ్‌గా వెళ్లడంలేదని కొందరు మీడియా మిత్రులు గతంలో నన్ను అడిగారు. అప్పుడు నేనొక కథ చెప్పాను. ఆనాడు వినాయకుడు, కుమారస్వామిల్లో ఎవరిని గణనాథుడిగా ఎంపిక చేయాలా? అని శివపార్వతులు ఆలోచించి ముల్లోకాలను చుట్టొచ్చిన వారినే ఎంపిక చేస్తామని చెబితే ఏమైందో మీకు తెలుసు. తెలంగాణ విషయంలో కూడా అంతే. కేసీఆర్ తెలంగాణ ఇవ్వాలని ఊరూవాడా స్పీడ్‌గా తిరుగుతుంటే.. నేను మాత్రం తెలంగాణ ఇచ్చే శివపార్వతులు సోనియాగాంధీయే కాబట్టి ఆమె చుట్టే ప్రదక్షిణలు చేశాను. తెలంగాణ సాధిం చాను. ఇందులో కేసీఆర్ కృషి కూడా తక్కువేమీ కాదు. సమైక్యరాష్ట్రంలో సీఎం కాలేదనే బాధ నాకు లేదు. నేనిప్పుడు సీఎం కావాలా? పీసీసీ అధ్యక్షుడు కావాలా? అనేది నా చేతుల్లో లేదు. గతంలో సోనియాగాంధీ నన్ను రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. ఇప్పుడు కూడా ఆమె చేతుల్లోనే నా భవిష్యత్తు ఉంది. నేను సీఎం రేసులో ఉన్నానని చెప్పడానికి ఇదేమీ గుర్రాల పందెం కాదు..’

Advertisement

తప్పక చదవండి

Advertisement