ఫిట్‌మెంట్‌ ఎంత.?

Fitment for Govt Employees in Telangana - Sakshi

వేతన సవరణపై కూడికలు తీసివేతలు 

63 శాతం కోరుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు

20 శాతం మించితే కష్టమేనని ప్రభుత్వం అంచనా 

15 శాతం ఇచ్చినా ఖజానాపై రూ.2,700 కోట్ల భారం 

ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకోవాలని పీఆర్సీకి సూచన 

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగుల వేతన సవరణ ఏ మేరకు ఉంటుంది.. ఎంత శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చే అవకాశముంది? ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లలో ఉత్కంఠ రేపుతోంది. జూన్‌ 2న మధ్యంతర భృతి (ఐఆర్‌) ప్రకటిస్తామని, ఆగస్టు 15న పీఆర్సీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చల అనంతరం వెల్లడించారు. తర్వాత రెండ్రోజుల వ్యవధిలోనే పీఆర్సీ వేయటం, మూడు నెలల్లోనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరడం తెలిసిందే. పదో పీఆర్సీ ప్రకారం సర్కారు 2014 నుంచి ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చింది. ప్రస్తుతం కూడా అదే అమల్లో  ఉంది.

ఈసారి అప్పటికంటే ఎక్కువగా(63 శాతం) ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కానీ ఇప్పుడున్న జీతాలపై అంత భారీగా వేతన సవరణ చేసే అవకాశాలున్నాయా.. ఎంత శాతం పెంచితే ఖజానాపై ఎంత ప్రభావం చూపిస్తుందన్నదానిపై ఆర్థిక శాఖ ఇప్పటికే లెక్కలేసుకుంది. దీనిపై ఉద్యోగ సంఘాలతో చర్చలకు ముందే సీఎంకు నివేదికను సమర్పించింది. ఈ నేపథ్యంలోనే ఫిట్‌మెంట్‌ను సిఫారసు చేసే సమయంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోవాలని పీఆర్సీకి ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. 

63 శాతం పెంచితే భారమే 
రాష్ట్రంలో దాదాపు ఆరు లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లున్నారు. గత ఆర్థిక సంవత్సరం వీరికి చెల్లించిన వేతనాల మొత్తం రూ.23,037 కోట్లు. అంటే నెలనెలా ప్రభుత్వం ఇంచుమించుగా ఉద్యోగుల వేతనాలకు రూ.2 వేల కోట్లు  ఖర్చు పెడుతోంది. వీటికి సంబంధించి మార్చి నాటికి ఉన్న ఆదాయ వ్యయాల ఖాతాను ఆర్థిక శాఖ ఇటీవలే కాగ్‌కు నివేదించింది. హెచ్‌ఆర్‌ఏ తదితర అలవెన్స్‌లు మినహాయించినా ఉద్యోగుల మూల వేతనాల మొత్తం రూ.18,450 కోట్లకు చేరుతుంది. ఇప్పుడు ఉద్యోగులు కోరినట్లుగా 63 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలంటే ఒక్కసారిగా జీతాల భారం అదనంగా రూ.11,600 కోట్లు పెరిగిపోతుంది. వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందించే రైతుబంధు పథకానికి ఈ ఏడాది రూ.12 వేల కోట్లను ఖర్చు చేస్తున్న తరుణంలో అంత మొత్తం పెంచడం అసాధ్యమేన్న అభిప్రాయాలున్నాయి. ప్రస్తుత రెవెన్యూ, ఖర్చుల దృష్ట్యా 20 శాతానికి మించి ఫిట్‌మెంట్‌ ఇస్తే ఆర్థిక నిర్వహణపై ప్రభావం చూపుతుందని అధికారులు చెబుతున్నారు. 15 శాతం, 20 శాతం, 25 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే.. ఎంతెంత భారం పడుతుందన్న లెక్కలను కూడా ఆర్థిక శాఖ ఇప్పటికే సిద్ధం చేసింది. 15 శాతం పెంచితే ఏడాదికి రూ.2,767 కోట్లు, 20 శాతం పెంచితే రూ.3,690 కోట్లు, 25 శాతం పెంచితే రూ.4,612 కోట్ల మేర ఖజానాపై భారం పడుతుందని అంచనాలు వేస్తోంది. 

ఐఆర్‌ ఇవ్వటం ఆనవాయితీ 
పీఆర్సీ ఫిట్‌మెంట్‌ అమల్లోకి వచ్చేలోగా ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్‌) చెల్లించటం ఆనవాయితీగా వస్తోంది. పీఆర్సీ అమల్లోకి వచ్చిన తర్వాత ఫిట్‌మెంట్‌ శాతం నుంచి అప్పటికే చెల్లించిన ఐఆర్‌ను మినహాయించుకుంటారు. సాధారణంగా ఫిట్‌మెంట్‌ కంటే ఐఆర్‌ తక్కువగా ఉంటుంది. గతంలో 9వ పీఆర్సీ అమల్లోకి వచ్చే ముందు 22 శాతం ఐఆర్‌ ఇవ్వగా.. 38 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించారు. పదో పీఆర్సీకి ముందు 27 శాతం ఐఆర్‌ ఇవ్వగా.. 43 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించారు. జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రకటించే ఐఆర్‌ కీలకమని, దాని ఆధారంగా ఫిట్‌మెంట్‌ను అంచనా వేసే వీలుంటుందని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. 

పీఆర్సీ అమలు తేదీ మారనుందా? 
నాలుగేళ్లకోసారి ఉద్యోగులకు పీఆర్సీ అమలవుతుంది. పదో పీఆర్సీ గడువు జూన్‌ 30తో ముగియనుంది.  జూలై ఒకటో తేదీ నుంచి కొత్త పీఆర్సీ అమల్లోకి వస్తుంది. తెలంగాణ తొలి పీఆర్సీని గత సంప్రదాయానికి  భిన్నంగా జూన్‌ 2 నుంచే అమల్లోకి తేవాలని సీఎం కేసీఆర్‌ యోచిస్తున్నారు. ఇటీవల ఉద్యోగులతో జరిగిన చర్చల సందర్భంగా ఇదే విషయాన్ని వెల్లడించారు. దీంతో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఐఆర్‌ ప్రకటనతోపాటు కొత్త పీఆర్సీ అమలు తేదీల మార్పును వెల్లడించే అవకాశాలున్నాయి. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. ప్రతి నాలుగేళ్లకేసారి జూన్‌ 2న పాత పీఆర్సీ గడువు ముగిసి కొత్త పీఆర్సీ వ్యవధి మొదలుకానుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top