60 దాటిన వారిలో ఆందోళన!

Covid 19 Impact More On 60 Years Age People - Sakshi

కోవిడ్‌ ఉధృతితో పెద్దవారిలో ఆదుర్దా, మానసిక ఒత్తిళ్లు

కొన్ని అలవాట్లు, మరికొన్నిజాగ్రత్తలు అవసరమంటున్న వైద్యులు

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ ఉధృతి పెరుగుతున్న కొద్దీ 60 ఏళ్లు పైబడిన వారిలో భయాలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల వృద్ధితో తామెక్కడ ఆ వైరస్‌ బారిన పడతామోనన్న ఆదుర్దాతో మానసిక ఒత్తిళ్లకు గురవుతున్న వారూ ఉన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలైన నాటి నుంచి 60 ఏళ్లు పైబడిన వాళ్లు, పదేళ్ల లోపు పిల్లలు దీని బారిన ప్రమాదం ఎక్కువగా ఉన్నం దున, బయటకు రావొద్దంటూ ప్రభుత్వాలు, డాక్టర్ల నుంచి వెలువడిన హెచ్చరికలు కూడా వీరిలో భయాలు మరింత పెరిగాయి.

మొదట సుదీర్ఘ లాక్‌డౌన్‌ విధింపు, ఆ తర్వాతా కోవిడ్‌ తీవ్రత పెరుగుతున్న సందర్భంలోనూ పెద్దలు, అందులోనూ బీపీ, షుగర్, ఇతర అనారోగ్య సమస్యలున్న వారు 4 నెలలకు పైగా ఇళ్లకే పరిమితం కావడంతో ఆందోళన మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎదురయ్యే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇతర విషయాలపై సైకియాట్రిస్ట్‌లు ఎమ్మెస్‌రెడ్డి, నిశాంత్‌ వేమన, సైకాలజిస్ట్‌ సి.వీరేందర్‌ సాక్షి ఇంటర్వూ్యలో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ముఖ్యాం శాలు.. వారి మాటల్లోనే.. 

ఆందోళనలొద్దు.. ప్రశాంతంగా ఉండండి: సైకియాట్రిస్ట్‌ ఎమ్మెస్‌ రెడ్డి
మరో 6 నెలలు పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇప్పుడున్నట్టుగానే పెద్ద వయసు వారంతా మరికొంత కాలం గడపాల్సి ఉంటుంది. ఒకవేళ భార్యాభర్తలిద్దరే ఉంటుంటే అన్యోన్యం గా, ఉల్లాసంగా కాలం గడపండి. జాయింట్‌ ఫ్యామిలీలో ఉంటే కొడుకులు, కోడళ్లతో సఖ్యతగా ఉంటూ మనవలు, మనవరాళ్లతో ఎక్కువ సమయం గడపండి. పెద్దవాళ్లంతా ఇళ్లలోనే ఉంటున్నా రు కాబట్టి వారికి కరోనా దాదాపు సోకదు.

బాల్కనీలో లేదా ఇళ్లలోనే కనీసం అరగంట పాటు నడక తప్పని సరి. దీనివల్ల రక్తప్రసారం పెరిగి ఆరోగ్యానికి మంచి చేయడంతో పాటు, మనసును ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచుతుంది. ప్రాణాయామం, ఇతర బ్రీథింగ్‌ ఎక్సర్‌సైజులతో లంగ్‌ కెపాసిటీ పెరుగుతుంది. షుగర్, బీపీ వంటి వాటిని కంట్రోల్‌లో ఉంచుకోండి. పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, ఆప్తులతో ఫోన్‌లో ముచ్చట్లు వంటి వాటితో గడపండి. టీవీల్లో కోవిడ్‌ సంబంధ వార్తలు ఎక్కువసేపు చూడొద్దు. 

యువతరం అవగాహన కల్పించాలి: సైకాలజిస్ట్‌ సి.వీరేందర్‌
ఆందోళన కలిగించే వార్తలు, బయటి పరిస్థితులు 60 ఏళ్లు పైబడిన వారిపై ప్రభావం చూపుతున్నాయి. కోవిడ్‌ గురించి అవగాహన ఉన్న కొంత వయసు పైబడిన వారి లో తమకు ఈ వ్యాధి సోకుతుందేమోనన్న భయాలు పెరుగుతున్నాయి. ఇక దీని గురిం చి తెలియని వారు, నిరక్షరాస్యులు తమకేమీ కాదని మా స్కులు, శానిటైజర్లు ఉపయోగించేందుకూ విముఖత చూపుతున్నారు.

అందువల్ల ఇళ్లలోని యువతరం.. ఈ రెండు వర్గాల వారికి అవగాహన కల్పించాలి. ఇప్పుడు ఏర్పడిన క్లిష్ట పరిస్థితులను అంగీకరించి వాటిని ఎదుర్కొనేందుకు అంతా సిద్ధం కావాలి. శారీరకంగా, మానసికంగా శక్తి సామర్థ్యాలను పెంచుకోవడం, ఏదైనా వస్తే వైద్యపరంగా చికిత్స తీసుకోవడం, కుటుంబ, సామాజికపరంగా చేదోడువాదోడుగా నిలవడం వంటి చర్యల ద్వారా ప్రస్తుతం ఎదురయ్యే సమస్యలను సులభంగా అధిగమించొచ్చునని అందరూ గ్రహించాలి.

పెద్దల్లో ఆ లక్షణాలుంటే లేట్‌ చేయొద్దు: సైకియాట్రిస్ట్‌ నిశాంత్‌ వేమన
పెద్ద వయసు వారిలో ముఖ్యంగా వివిధ అనారోగ్య సమస్యలున్న వారు దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న లక్షణాలు స్వల్పంగా కనిపించినా ఆందోళన చెందుతున్నారు. ఈ ఆరోగ్య సమస్యలపై ఆసుపత్రులకు వెళ్లేందుకూ భయపడుతున్నారు. ఆస్పత్రికి వెళితే ఎక్కడ తమకు కరోనా వైరస్‌ అంటుకుంటుందో నని తమ డాక్టర్లను కూడా సంప్రదించేందుకు కొంద రు వెనుకాడుతున్నారు.

అంతకుముందు జబ్బులు న్నా, పెద్ద వయసు వారైనా కోవిడ్‌ నుంచి అధిక శాతం కోలుకుంటున్నందున అనవసర ఆందోళనలకు గురికావొద్దు. ఆశావహ దృక్పథంతో ఉంటూ, బ్రీథింగ్, రెస్పిరేటరీ ఎక్సర్‌సైజులు చేస్తూ, ఆప్తులు, ఇష్టమైన వారితో తరచుగా ఫోన్లో మాట్లాడుతూ అహ్లాదంగా ఉంటే ఏ సమస్యలూ రావు. ఏమాత్రం లక్షణాలు బయటపడినా వెంటనే ఇంట్లో వాళ్లకు చెప్పాలి. తగిన చికిత్స తీసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేతప్ప కరోనా గురించి భయపడి, ఆలస్యం చేయొద్దు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top