ప్రాణహితను సందర్శించిన పార్టీ అగ్రనాయకులు

Congress Party Leaders Visited Tummadi Hatti - Sakshi

నది ప్రవాహాన్ని పరిశీలించిన నేతలు 

సాక్షి, కాగజ్‌నగర్‌: కుమురంభీం జిల్లా కౌటాల మండలంలోని ప్రాణహిత నదిపై ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు రంగంలోకి దిగారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చొరవతో కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని తూర్పు ప్రాంతంలో దాదాపుగా 16.5 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు రూ.38వేల కోట్లతో ప్రాజెక్టు నిర్మాణానికి భూమిపూజ సైతం చేశారు. కెనాల్‌ పనులు సైతం జరిగాయి. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడంతో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణాన్ని పక్కనపెట్టి కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకుంది. రీడిజైన్‌ పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేస్తూ ప్రాజెక్టు పనులు చేపడుతున్నారని మొదటి నుంచి ప్రతిపక్షం      
వాదిస్తూనే ఉంది.  

రంగంలోకి రాష్ట్ర నాయకత్వం 
ఈ నేపథ్యంలో సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు పోన్నాల లక్ష్మయ్య, హన్మంతరావు, షేబ్బీర్‌అలీ, జానరెడ్డి, సురేష్‌ సెట్కార్, కొండ విశ్వేశ్వర్, మల్లు రవి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఉదయం 11గంటలకు కాగజ్‌నగర్‌ చేరుకోగా వారికి కాగజ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌లో కుమురంభీం జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్, సిర్పూర్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు మంచిర్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఉదయం 11గంటలకు తెలంగాణ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో కాగజ్‌నగర్‌ చేరుకుని ఇక్కడి నుంచి కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి ప్రాణహిత నదిని పరిశీలించడానికి వెళ్లారు. ప్రాణహిత నదిలో నీటి లభ్యత గురించి తెలుసుకుని పరిశీలించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top