సాగర తీరంలో సమరానికి సైరా...

Rain Threat Looms Large Over First Test Complete Weather Forecast - Sakshi

నేటి నుంచి భారత్ దక్షిణాఫ్రికా తొలి టెస్ట్

సిద్దమైన విశాఖ మైదానం

తుది జట్టును ప్రకటించిన టీమిండియా

వర్షం దోబుచులాట

ఒకవైపు వరుస విజయాలతో సిరీస్‌ల మీద సిరీస్‌లు కొడుతూ దూసుకుపోతున్న జట్టు... మరోవైపు సీనియర్లు తప్పుకోవడం నుంచి జట్టు ఎంపికలో రాజకీయాలు చేరడం వరకు గందరగోళ స్థితిలో మరో జట్టు... అసాధారణ నాయకత్వంతో, రికార్డులతో, ఆత్మవిశ్వాసంతో  జట్టును నడిపిస్తున్న కోహ్లి ఒకవైపు, వరల్డ్‌ కప్‌ తర్వాతే వేటు తప్పదనుకున్నా మరో దిక్కు లేక కొనసాగుతున్న సారథి డు ప్లెసిస్‌ మరోవైపు... వరల్డ్‌ నంబర్‌వన్‌ బౌలర్‌ బుమ్రా లేకపోయినా అసలు అలాంటి విషయం గుర్తుకే రాని స్థితిలో అతి బలంగా కనిపిస్తున్న టీమిండియా సొంతగడ్డపై మరో సిరీస్‌పై గురి పెట్టగా... గతంలో ఐదుసార్లు ఇక్కడ పర్యటించిన సఫారీలతో పోలిస్తే అతి బలహీనంగా ఉన్న బృందం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య నేడు ప్రారంభం కానున్న తొలి టెస్టు మ్యాచ్‌కు సాగర నగరం విశాఖపట్నం వేదికైంది.   

విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తలపడిన గత టెస్టు సిరీస్‌లో భారత్‌ 3–0తో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత సొంతగడ్డపై డు ప్లెసిస్‌ ఇదే తరహాలో తాము దెబ్బ తీస్తామంటూ వ్యాఖ్యలు చేసినా చివరకు సఫారీలకు చచ్చీ చెడి 2–1తో సిరీస్‌ విజయం దక్కింది. భారత బౌలింగ్‌ బలాన్ని తక్కువగా అంచనా వేసి పేస్‌ పిచ్‌లను సిద్ధం చేయడం, దానిని మన బౌలర్లు వాడుకోవడం జరిగిపోయాయి. ఇప్పుడు మళ్లీ రెండు జట్లు టెస్టుల్లో ముఖాముఖీ తలపడేందుకు సన్నద్ధమయ్యాయి. ప్రస్తుత స్థితిలో భారత్‌ను నిలువరించడం దక్షిణాఫ్రికాకు దాదాపు అసాధ్యమే.  

రోహిత్‌ రాణించేనా...
సెహా్వగ్, రవిశాస్త్రి, జయసూర్య, దిల్షాన్‌... మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌లుగా ఆడి ఆ తర్వాత ఓపెనర్లుగా మారి అంతకంటే మెరుగైన ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లలో కొందరు. ఇప్పుడు రోహిత్‌ శర్మ నుంచి కూడా భారత్‌ ఇదే ఆశిస్తోంది. తన కెరీర్‌ 28వ టెస్టులో తొలిసారి ఓపెనర్‌గా ఆడబోతున్న రోహిత్‌.... రబడ, ఫిలాండర్‌ వేసే మెరుపు ఎరుపు బంతులను ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరం. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో డకౌటైనా దానిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సెహా్వగ్‌ శైలిలో తొలి బంతి నుంచే విరుచుకుపడే ఆటనూ చూపిస్తాడా లేక రెగ్యులర్‌ ఓపెనర్ల తరహాలో ఓపిగ్గా సుదీర్ఘ సమయం క్రీజ్‌లో గడిపేందుకు రోహిత్‌ ప్రయతి్నస్తాడా అనేది చూడాలి. ఈ స్థానంలో ఎక్కువ అవకాశాలు ఇస్తామంటూ కెపె్టన్‌ ధైర్యం చెప్పడం రోహిత్‌ ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. మరో ఓపెనర్‌గా మయాంక్‌ అగర్వాల్‌ ఖాయం కాబట్టి శుబ్‌మన్‌ గిల్‌ తొలి అవకాశం కోసం మరికొంత కాలం వేచి ఉండాల్సిందే.

ఇతర జట్టు కూర్పు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. పుజారా, కోహ్లి, రహానే తమ స్థాయికి తగినట్లుగా ఆడితే భారత్‌ భారీ స్కోరు సాధించడం, సఫారీ అవకాశాలకు దెబ్బ పడటం ఖాయంగా జరిగిపోతాయి. విండీస్‌లో సెంచరీ తర్వాత జోష్‌ మీదున్న తెలుగబ్బాయి హనుమ విహారి కూడా స్వదేశంలో సత్తా చాటేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడు. పైగా బౌలింగ్‌లో కూడా ఒక చేయి వేయగలడు. షమీ, ఇషాంత్‌ శర్మల రూపంలో ఇద్దరు పేసర్లున్నారు కాబట్టి ఉమేశ్‌ యాదవ్‌ పెవిలియన్‌కే పరిమితం. చాలా కాలం తర్వాత అశి్వన్, జడేజా ద్వయం సంయుక్తంగా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ పని పట్టేందుకు సిద్ధమైంది. వీరిద్దరిని ఎదుర్కోవడం దక్షిణాఫ్రికాకు కత్తి మీద సామే. కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా కూడా విలువైన ఆటగాడైన సాహా రాక జట్టును మరింత పటిష్టపరచింది. 

మార్క్‌రమ్‌పై దృష్టి...
భారత గడ్డపై 2015లో జరిగిన సిరీస్‌లో స్టార్లు ఆమ్లా, డివిలియర్స్‌లాంటి వాళ్లు స్పిన్‌ను సమర్థంగా ఆడటంలో ఇబ్బంది పడ్డారు. ఫలితంగా జట్టు ఓటమి పాలైంది. ఇప్పుడు కనీస మాత్రం అనుభవం కూడా లేని బ్రూయిన్, బవుమా ఆ జట్టును ఏమాత్రం నిలబెడతారో చూడాలి. డు ప్లెసిస్‌ స్పిన్‌ను సమర్థంగా ఆడగలడు, పోరాడగలడు కానీ అతని ఇటీవలి ఫామ్‌ అంతంత మాత్రంగానే ఉంది. ‘ఎ’ జట్టు తరఫున, ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో కూడా బాగా ఆడి భారత్‌లో పిచ్‌లకు కొంత అలవాటు పడిన మార్క్‌రమ్‌ ఈ సిరీస్‌లో కీలకం కావచ్చు. అతను గట్టిగా నిలబడితే జట్టుకు మేలు జరుగుతుంది.  టెస్టుల్లో డి కాక్‌ చెప్పుకోదగ్గ బ్యాట్స్‌మన్‌ ఏమీ కాదు. ఆ జట్టు ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగడం ఖాయమైంది. ఫిలాండర్‌ బ్యాటింగ్‌ కూడా చేయగలడు కాబట్టి ఏడో స్థానంలో ఆడతాడు. జట్టులోని ఒకే ఒక స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌పై సఫారీలు ఆశలు పెట్టుకుంటున్నారు కానీ అభేద్యమైన టీమిండియా లైనప్‌ను ఛేదించడం అతని వల్ల అవుతుందా సందేహమే.

వాతావరణం, పిచ్‌
తొలి టెస్టును వర్షం ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. నిజానికి సోమవారం వరకు ఇక్కడ వర్షాలు కురిసినా... మ్యాచ్‌ ముందు రోజు తెరిపినిచ్చింది. ఒక్క చినుకు కూడా లేకపోగా, మంచి ఎండకాసింది. అయితే మళ్లీ మళ్లీ వాతావరణం మారుతూ వచ్చి ఒక్కసారిగా చల్లబడింది కూడా. టెస్టు జరిగే రోజుల్లో వాన పడవచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే పూర్తిగా కాకపోయినా అప్పుడప్పుడు అంతరాయం కలగడం ఖాయం. వికెట్‌ ఆరంభంలో బ్యాటింగ్‌కు అనుకూలం. ఆ తర్వాత స్పిన్‌ ప్రభావం చూపించే సాధారణ భారతీయ పిచ్‌.  

జట్ల వివరాలు
భారత్‌ తుది జట్టు: కోహ్లి (కెపె్టన్‌), రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్, పుజారా, రహానే, విహారి, సాహా, అశి్వన్, జడేజా, ఇషాంత్, షమీ.  

దక్షిణాఫ్రికా (అంచనా): డు ప్లెసిస్‌ (కెపె్టన్‌), మార్క్‌రమ్, ఎల్గర్, బ్రూయిన్, బవుమా, డి కాక్, ఫిలాండర్, కేశవ్, రబడ, ఇన్‌గిడి, పీట్‌.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top