
మెక్సికో సిటీ:ఈ ఏడాది ఫార్మాలావన్ డ్రైవర్స్ చాంపియన్ షిప్ లో మెర్సిడెస్ జట్టుకు చెందిన బ్రిటీష్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విశ్వవిజేతగా నిలిచాడు. దాంతో ప్రపంచ ఫార్ములావన్ టైటిల్ ను హామిల్టన్ నాల్గోసారి సాధించాడు. భారతకాల మాన ప్రకారం ఆదివారం రాత్రి జరిగిన మెక్సికో ఫార్ములావన్ రేసులో హామిల్టన్ తొమ్మిదోస్థానంతో సరిపెట్టుకున్నాడు. దాంతో ఓవరాల్ గా హామిల్టన్ ఖాతాలో 333 పాయింట్లు చేరాయి. తద్వారా వరల్డ్ చాంపియన్ గా మరోసారి అవతరించాడు. 2008లో మెక్ లారెన్ తరపున బరిలోకి దిగిన హామిల్టన్ డ్రైవర్స్ చాంపియన్ షిప్ లో విజేతగా నిలవగా, 2014,15ల్లో మెర్సిడెస్ జట్టు తరపున విశ్వవిజేతగా నిలిచాడు. గతేడాది నికో రోస్ బర్గ్ విజేతగా నిలవగా, హామిల్టన్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
తాజాగా జరిగిన మెక్సికో రేసులో ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటల్ నాల్గో స్థానంలో నిలవడంతో హామిల్టన్ చాంపియన్ గా నిలవడానికి దోహదం చేసింది. మెక్సిక్ గ్రాండ్ ప్రి అనంతరం హామిల్టన్ పోటీగా ఉన్న వెటల్ 277 పాయింట్లతో కొనసాగుతున్నాడు. ఇంకా మిగిలి ఉన్న బ్రెజిలియన్ గ్రాండ్ ప్రి, అబుదాబి గ్రాండి ప్రిల్లో వెటల్ విజయం సాధించినప్పటికీ అతని ఖాతాలో 50 పాయింట్లు మాత్రమే చేరతాయి. అంటే 327 పాయింట్లను మాత్రమే వెటల్ సాధించే అవకాశం మాత్రమే ఉంది. దాంతో వెటల్ కు చాంపియన్ గా నిలిచే అవకాశం లేదు. ఆ క్రమంలోనే హామిల్టన్ కు ప్రపంచ టైటిల్ ఖాయమైంది.
నిన్న జరిగిన మెక్సికో గ్రాండ్ ప్రిలో రెడ్ బుల్ కు చెందిన మ్యాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు.71 ల్యాప్ ల రేసును గంటా 36 నిమిషాల 26.552 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానం సాధించాడు. ఈ సీజన్ లో వెర్స్టాపెన్ కు ఇది రెండో ఎఫ్ 1 టైటిల్. అంతకుముందు మలేషియన్ గ్రాండ్ ప్రి టైటిల్ ను వెర్స్టాపెన్ సాధించాడు.
23 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి..
డిఫెండింగ్ చాంపియన్ లేకుండా ఒక ఫార్ములావన్ సీజన్ జరగడం 1994 తరువాత ఇదే తొలిసారి. గతేడాది విశ్వవిజేతగా నిలిచిన నికో రోస్ బర్గ్ ఈసారి బరిలోకి దిగలేదు. ఆ చాంపియన్ షిప్ లో విజేతగా నిలిచిన వెంటనే తన కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దాంతో 23 ఏళ్ల తరువాత డిఫెండింగ్ చాంపియన్ లేకుండా ఫార్ములావన్ సీజన్ జరగడం విశేషం.