
ఆస్టిన్ (అమెరికా): నాలుగోసారి ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకునే దిశగా మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరో అడుగు ముందుకేశాడు. ఫార్ములావన్ సీజన్‌లో భాగంగా జరిగిన అమెరికా గ్రాండ్‌ప్రి రేసులో ఈ బ్రిటన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ రేసులో హామిల్టన్ నిర్ణీత 56 ల్యాప్‌లను గంటా 33 నిమిషాల 50.991 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో హామిల్టన్‌కిది తొమ్మిదో విజయం కావడం విశేషం.
వెటెల్ (ఫెరారీ), రైకోనెన్ (ఫెరారీ), వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్), బొటాస్ (మెర్సిడెస్) వరుసగా రెండు నుంచి నాలుగు స్థానాల్లో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా ఆరు, ఎనిమిది స్థానాలను సంపాదించారు. సీజన్‌లోని 20 రేసులకుగాను ప్రస్తుతం 17 రేసులు పూర్తయ్యాయి. హామిల్టన్ 331 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా... సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ–265 పాయింట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. ఈనెల 28న జరిగే మెక్సికో గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ టాప్–5లో నిలిస్తే అతనికి ప్రపంచ టైటిల్ ఖాయమవుతుంది.