టెస్టుల్లో నా ముద్ర చూపించాలనుకున్నా! | Jaspreet Bumra Became a key Indian Bowler in ODI As Well | Sakshi
Sakshi News home page

టెస్టుల్లో నా ముద్ర చూపించాలనుకున్నా!

Sep 14 2019 2:14 AM | Updated on Sep 14 2019 2:14 AM

Jaspreet Bumra  Became a key Indian Bowler in ODI As Well - Sakshi

ముంబై: టి20 స్పెషలిస్ట్‌గా కెరీర్‌ మొదలు పెట్టి ఆ తర్వాత వన్డేల్లోనూ జస్‌ప్రీత్‌ బుమ్రా భారత కీలక బౌలర్‌గా ఎదిగాడు. అయితే టెస్టుల్లో అతను రాణించడంపై అందరికీ సందేహాలు ఉండేవి. దక్షిణాఫ్రికా సిరీస్‌ కోసం తొలిసారి ఎంపిక చేసినప్పుడు కూడా వెంటనే తుది జట్టులో అవకాశం దక్కకపోవచ్చని చాలా మంది భావించారు. కానీ కేప్‌టౌన్‌ టెస్టుతో అరంగేట్రం చేసిన అతను ఆ తర్వాత దూసుకుపోయాడు. అద్భుతమైన బౌలింగ్‌తో నాలుగు దేశాల్లో కూడా ఐదు వికెట్ల  ఘనతను సాధించాడు. ఇదే విషయాన్ని గుర్తు చేసుకున్న బుమ్రా తన కెరీర్‌ ఆరంభంలో టెస్టులే తొలి ప్రాధాన్యతగా భావించేవాడినని చెప్పాడు. ‘కేవలం టి20లు, వన్డేలు మాత్రమే ఆడిన క్రికెటర్‌గా నేను మిగిలిపోదల్చుకోలేదు. నా దృష్టిలో టెస్టులకు ఎంతో ప్రాధాన్యత ఉంది.

టెస్టులు ఆడటం మాత్రమే కాదు, నాదైన ముద్ర చూపించాలని బలంగా భావించేవాడిని. నా ఫస్ట్‌క్లాస్‌ స్థాయి ప్రదర్శనను టెస్టుల్లో కూడా చూపగలనని నాపై నాకు నమ్మకముండేది. రెండేళ్ల అంతర్జాతీయ కెరీర్‌ తర్వాత సఫారీ గడ్డపై తొలి టెస్టు ఆడినప్పుడు నా కల నిజమైనట్లు అనిపించింది’ అని బుమ్రా చెప్పాడు. ఇప్పటి వరకు 12 టెస్టులే ఆడిన బుమ్రా 62 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికాతో అక్టోబర్‌ 2 నుంచి జరిగే టెస్టు సిరీస్‌తో బుమ్రా తొలిసారి సొంతగడ్డపై బరిలోకి దిగబోతున్నాడు. ‘భారత్‌లో టెస్టులు ఆడటం ఒక కొత్త సవాల్‌వంటిది. దీనికి నేను సిద్ధంగా ఉన్నాను. సుదీర్ఘ కాలం రంజీ ట్రోఫీతో పాటు ఇతర టోరీ్నల్లో ఎర్రబంతితో క్రికెట్‌ ఆడాను కాబట్టి నాకు పిచ్‌లు, పరిస్థితులు కొత్త కాదు’ అని బుమ్రా విశ్లేషించాడు. ప్రముఖ మద్యం ఉత్పత్తి సంస్థ ‘రాయల్‌ స్టాగ్‌’కు బుమ్రా బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement