పన్నెండో ప్రపంచ యుద్ధం

ICC Cricket World Cup 2019 Opening Ceremony - Sakshi

నేటి నుంచి వన్డే వరల్డ్‌ కప్‌

బరిలో 10 జట్లు టోర్నీలో మొత్తం మ్యాచ్‌లు 48

తొలి మ్యాచ్‌లో  ఇంగ్లండ్‌తో దక్షిణాఫ్రికా ఢీ

జూన్‌ 5న భారత్‌ తొలి పోరు

జూలై 14న లార్డ్స్‌లో ఫైనల్‌  

విశ్వ వేదికపై వన్డే క్రికెట్‌ మళ్లీ వన్నెలీనే సమయం వచ్చింది. ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు ప్రభ కోల్పోతున్న సమయంలో ప్రపంచ కప్‌ సమరమే వన్డే క్రికెట్‌ను పునరుజ్జీవింపజేస్తున్న వేళ... ఆట పుట్టిన గడ్డపై జరగబోయే ప్రపంచ సమరం సర్వత్రా అమితాసక్తిని పెంచుతోంది... ‘క్రౌన్‌ క్రికెట్‌కా’ అంటూ స్టార్‌ స్పోర్ట్స్‌ హడావిడి, ‘స్టాండ్‌ బై’ అంటూ ఐసీసీ సందడి అంతా కప్‌ గొప్పతనం గురించే... 1975లో నడక నేర్చిన నాటినుంచి 2015 వరకు ఆటలో, ప్రపంచ కప్‌ బాటలో వచ్చిన మలుపులెన్నో... విజేతలుగా ఎవరు నిలిచినా మరపురాని మధుర స్మృతులెన్నో... ఇప్పుడు మరోసారి మరింత ఆనందం పంచేందుకు, మరికొన్ని నిద్ర లేని రాత్రులు అందించేందుకు క్రికెట్‌ పెద్ద పండగ మళ్లీ వచ్చేసింది.

వరల్డ్‌ కప్‌ అంటే ఆటగాళ్ల కల... అభిమానుల ఆనందానికి కేరాఫ్‌ అడ్రస్‌. నాలుగేళ్ల పాటు ఎంతటి క్రికెట్‌ వినోదం లభించినా ఈ కప్‌ ఇచ్చే కిక్కే వేరు. టి20ల ధనాధన్‌ ఆటకు అలవాటు పడినా సరే, పరిమిత ఓవర్ల రుచి చూపించిన వన్డేలపై ప్రేమ తగ్గేది కాదు... ఒక రోజు ఆటలో ఒక్కసారి విశ్వ వేదికపై బరిలో దిగితే చాలనుకునే క్షణం నుంచి విజేతగా నిలిచి ట్రోఫీని మనసారా ముద్దాడాలనుకునే ఘడియ వరకు క్రికెటర్లకు ఇదో పరమపద సోపానం... విధ్వంసక బ్యాట్స్‌మన్‌ అయినా వీర విక్రమ బౌలర్‌ అయినా  తమ సత్తా ప్రదర్శించేందుకు అదే అతి పెద్ద రంగస్థలం. ఇక్కడ ఉవ్వెత్తున ఎగసి చరిత్రలో తమ పేర్లు లిఖించుకునేవారు కొందరైతే... ఉస్సురని కూలి నిరాశగా నిష్క్రమించేవారు కూడా ఎందరో...!

10 అత్యుత్తమ జట్లు... 46 రోజులు... 48 మ్యాచ్‌లు...సంక్షిప్తంగా 12వ వన్డే వరల్డ్‌ కప్‌ చిత్రమిది. ప్రతీ జట్టు ఇతర తొమ్మిది జట్లతో కచ్చితంగా ఆడాల్సిన ఫార్మాట్‌... ఉదాసీనతకు తావు లేదు. ఒక్క మ్యాచ్‌ను తేలిగ్గా తీసుకున్నా తగిన ఫలితం అనుభవించాల్సి రావచ్చు. తొలి ప్రపంచ కప్‌లో 8 జట్లతో మొదలై ఆపై విస్తరించి 16 జట్ల వరల్డ్‌ కప్‌ వరకు చేరి ఇప్పుడు మళ్లీ 10 జట్లకే పరిమితం అవుతోంది. సరిగ్గా చెప్పాలంటే చాంపియన్స్‌ ట్రోఫీ ప్లస్‌ మరో రెండు టీమ్‌లు! అయితే పేరులో ప్రపంచం ఉంది కాబట్టి ప్రతీ ఒక్కరికీ టోర్నీ ప్రతిష్టాకరమే. ఈ సుదీర్ఘ మహా యుద్ధంలో సరైన అస్త్రశస్త్రాలు వాడి చివరకు విజేతగా నిలిచేది ఎవరు! అభిమానులను అన్ని విధాలా అలరించి, ఆనందింపజేసేది ఎవరు?   

లండన్‌: ప్రపంచ క్రికెట్‌ అభిమానులందరూ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్‌ కప్‌ 2019కు రంగం సిద్ధమైంది. నేడు ఈ మెగా టోర్నీకి తెర లేవనుంది. ఆతిథ్య జట్టు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మధ్య ఓవల్‌ మైదానంలో జరిగే మ్యాచ్‌తో ప్రపంచ కప్‌ ప్రారంభమవుతుంది. మొత్తం 46 రోజుల పాటు జరిగే విశ్వ సమరంలో 45 లీగ్‌ మ్యాచ్‌లతో పాటు రెండు సెమీ ఫైనల్స్, ఫైనల్‌ మ్యాచ్‌ ప్రేక్షకులను అలరించనున్నాయి. జూలై 14న ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో ఫైనల్‌ పోరు జరుగుతుంది. మొత్తం 10 జట్లు బరిలో నిలవగా, వీటిని ఎలాంటి గ్రూప్‌లుగా విభజించలేదు. 1992 టోర్నీ తరహాలో రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతీ జట్టు ఇతర తొమ్మిది టీమ్‌లతో తలపడాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో టాప్‌–4లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.  

తీవ్రమైన పోటీ...
1996 నుంచి 2015 వరకు ఉన్న వరల్డ్‌ కప్‌ ఫార్మాట్‌తో పోలిస్తే ఈసారి ప్రపంచ పోరు కాస్త కఠినంగా మారింది. నిస్సారంగా, ఏకపక్షంగా సాగే మ్యాచ్‌లు ఉండరాదని భావించిన అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చిన్న జట్లను తప్పించి పది టీమ్‌లకే ప్రపంచ కప్‌ను పరిమితం చేసింది. ఇందులో ర్యాంకింగ్‌ ప్రకారం టాప్‌–8లో ఉన్న టీమ్‌లు నేరుగా అర్హత సాధించగా... క్వాలిఫయింగ్‌ టోర్నీ ద్వారా మాజీ చాంపియన్‌ వెస్టిండీస్, అఫ్గానిస్తాన్‌ బరిలో నిలిచాయి. ఫార్మాట్‌ ప్రకారం ప్రతీ టీమ్‌ మరో తొమ్మిది జట్లతో ఆడాల్సి ఉన్నందున ఆటగాళ్లందరూ టోర్నీ చివరి వరకు ఫిట్‌గా ఉంటూ అదే జోరును కొనసాగించడం కీలకం. అలా నిలకడ ప్రదర్శించిన జట్లకే విజయావకాశాలు ఉంటాయి. 

భారత్‌కు ఉందా అవకాశం?
నిస్సందేహంగా ఈ ప్రపంచ కప్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌నే అంతా ఫేవరెట్‌గా భావిస్తున్నారు. బౌలింగ్‌లో కొన్ని లోపాలున్నా... భీకరమైన బ్యాటింగ్‌ లైనప్, ఇటీవలి ఆ జట్టు ప్రదర్శనను బట్టి ఇంగ్లండ్‌పై అంచనాలు పెరిగిపోయాయి. ఒడిదుడుకుల తర్వాత ఇటీవలే కోలుకున్న డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా కూడా టైటిల్‌ గెలిచేందుకు అవకాశం ఉన్న మరో జట్టు. అంచనాలు లేకపోయినా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న దక్షిణాఫ్రికాతో పాటు విధ్వంసక బ్యాటింగ్‌తో వన్డేలను మలుపు తిప్పగల వెస్టిండీస్‌ కూడా రేసులోనే ఉంది. న్యూజిలాండ్‌ సంచలనాలు ఆశిస్తున్నా... చివరి వరకు ఆ జట్టు ఎంత నిలకడ చూపిస్తుందనేది సందేహమే. పాకిస్తాన్‌ పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. వరుసగా తొమ్మిది వన్డేల్లో రాణించగల జట్టుగా ఇటీవలి కాలంలో ఆ జట్టు ఎప్పుడూ కనిపించలేదు.

ప్రస్తుత జట్టు బలాబలాలు, ఫామ్, స్టార్‌ ఆటగాళ్లవంటి అంశాలను చూసుకుంటే శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గా్గనిస్తాన్‌ టోర్నీలో ముందుకెళ్లటం కష్టంగానే కనిపిస్తోంది. ఈ జట్లు టాప్‌–4లో నిలవాల్సిన స్థాయిలో పటిష్టంగా కనిపించడం లేదు. ఇక ఫేవరెట్‌లలో ఒకటిగా భారత్‌పై కూడా అందరి దృష్టీ నిలిచింది. గత కొన్నేళ్లుగా నిలకడగా విజయాలు సాధిస్తున్న భారత్‌ను కూడా గెలుపు గుర్రంగానే చూడవచ్చు. కోహ్లి స్ఫూర్తిదాయక నాయకత్వంతో పాటు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో కూడా టీమిండియా పటిష్టంగా కనిపిస్తోంది. మన ఫామ్‌ ప్రకారం చూస్తే సెమీఫైనల్‌ ఖాయంగా చేరవచ్చు కాబట్టి మిగిలిన ఆ రెండు మ్యాచ్‌లలో ఒత్తిడిని ఎలా అధిగమిస్తారనేదే కీలకం.  

పరుగుల వరద...   
గత కొన్నేళ్లుగా ఇంగ్లండ్‌ గడ్డపై వన్డేల్లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. నాటింగ్‌హామ్‌ మైదానంలో 481, 444, 391... బర్మింగ్‌హామ్, సౌతాంప్టన్, బ్రిస్టల్‌ మైదానాల్లో 408, 373, 371... ఇలా ఇటీవలి మ్యాచుల్లోనే పరుగులు పోటెత్తాయి. వీటిలో ఎక్కువ భాగం ఇంగ్లండ్‌ నమోదు చేసినవే. టి20 ప్రభావంతో బ్యాటింగ్‌లో పెరిగిన దూకుడు, ఇంగ్లండ్‌లో మైదానాలు చిన్నవి కావడం ప్రధాన కారణం కాగా దాదాపు పిచ్‌లన్నీ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించేలా మారిపోయాయి. నిజానికి ఈ సీజన్‌లో ఇంగ్లండ్‌లో పరిస్థితులు స్వింగ్‌కు అనుకూలంగా ఉంటాయి.

కానీ ఇప్పుడవి నామమాత్రంగా మారిపోయాయి. ఫీల్డింగ్‌ నిబంధనలతో పాటు ఇరు వైపుల నుంచి రెండు కొత్త బంతులు వాడుతుండటంతో బౌలర్లకు అసలు ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోతోంది. ఫలితంగా ఈసారి వరల్డ్‌ కప్‌లో ప్రతీ జట్టు భారీ స్కోర్లపైనే దృష్టి పెడుతుంది. భారత కెప్టెన్‌ కోహ్లి చెప్పినట్లు తొలిసారి 500 పరుగులు స్కోరు కూడా నమోదు కావచ్చు. ఈ నేపథ్యంలో మెగా టోర్నీ బౌలర్లకు సవాల్‌ విసురుతోంది.  

 

 

నోట్‌: మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు 2 పాయింట్లు లభిస్తాయి. ఒకవేళ మ్యాచ్‌ ‘టై’ అయితే రెండు జట్లకు ఒక్కో పాయింట్‌ ఇస్తారు. వర్షం లేదా ఇతరత్రా కారణాలతో మ్యాచ్‌ రద్దు అయితే కూడా రెండు జట్లకు ఒక్కో పాయింట్‌ కేటాయిస్తారు. లీగ్‌ దశ ముగిశాక జట్లు పాయింట్ల పట్టికలో సమంగా నిలిస్తే ఎక్కువ విజయాల సంఖ్య ఉన్న జట్టు ముందంజ వేస్తుంది. ఇక్కడ కూడా సమమైతే మెరుగైన రన్‌రేట్‌ ఉన్న జట్టు ముందుకు వెళుతుంది. ఒకవేళ రన్‌రేట్‌ కూడా సమంగా ఉంటే లీగ్‌ దశలో ముఖాముఖి మ్యాచ్‌లో గెలిచిన జట్టు ముందుకు వెళుతుంది.  సెమీఫైనల్స్, ఫైనల్‌ మ్యాచ్‌లకు రిజర్వ్‌ డే ఉంది. 

►11ఇప్పటి వరకు జరిగిన ప్రపంచ కప్‌లు  

►5 ఆస్ట్రేలియా గెలిచిన టైటిల్స్‌  

►62అత్యధికంగా ఆస్ట్రేలియా గెలిచిన మ్యాచ్‌లు  

►417అత్యధిక స్కోరు (ఆస్ట్రేలియా; 2015లో అఫ్గానిస్తాన్‌పై)

►36 అత్యల్ప స్కోరు (కెనడా; 2003లో శ్రీలంకపై)   6ఎక్కువ సెంచరీలు   (సచిన్‌–భారత్‌)

►688ఒక మ్యాచ్‌లో నమోదైన అత్యధిక పరుగులు (ఆస్ట్రేలియా 376+శ్రీలంక 312; 2015లో)

►275 పరుగుల తేడా అతి పెద్ద విజయం (ఆస్ట్రేలియా; అఫ్గానిస్తాన్‌పై 2015లో)  

►372అత్యుత్తమ భాగస్వామ్యం (గేల్, శామ్యూల్స్‌ కలిసి జింబాబ్వేపై 2015లో)  

►237అత్యధిక వ్యక్తిగత స్కోరు – మార్టిన్‌ గప్టిల్‌ (న్యూజిలాండ్‌–237 నాటౌట్, వెస్టిండీస్‌పై 2015లో)  

►673ఒక ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు  చేసిన ప్లేయర్‌ సచిన్‌ (2003 ప్రపంచకప్‌)

►105ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌ స్నెడెన్‌ (న్యూజిలాండ్‌–1983లో)

►28ప్రపంచకప్‌లో అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న ఫీల్డర్‌ రికీ పాంటింగ్‌

►26ఒకే టోర్నీలో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ (2007)

►46ఓవరాల్‌గా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌  రికీ పాంటింగ్‌

►2278ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధికపరుగులు చేసిన క్రికెటర్‌ సచిన్‌

►71వరల్డ్‌కప్‌లో ఓవరాల్‌గా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌

►7/15ఓ మ్యాచ్‌లో నమోదైన అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు (మెక్‌గ్రాత్, నమీబియాపై 2003లో)

►46 అన్ని ప్రపంచ కప్‌లలో పాల్గొన్న భారత్‌ మొత్తం 75 మ్యాచ్‌లు ఆడింది. 46 గెలిచి  27 మ్యాచ్‌లు ఓడింది. 1 మ్యాచ్‌ ‘టై’ కాగా... మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top