చైనా గ్రాండ్‌ప్రి చాంప్‌ రికియార్డో | Sakshi
Sakshi News home page

చైనా గ్రాండ్‌ప్రి చాంప్‌ రికియార్డో

Published Mon, Apr 16 2018 1:11 AM

China GrandPrime Champ Riccardo - Sakshi

షాంఘై: ఈ సీజన్‌లో జోరుమీదున్న సెబాస్టియన్‌ వెటెల్‌ ‘హ్యాట్రిక్‌’ ఆశలపై రెడ్‌బుల్‌ డ్రైవర్‌ డానియెల్‌ రికియార్డో నీళ్లు చల్లాడు. ఫార్ములావన్‌ చైనా గ్రాండ్‌ప్రిలో రికియార్డో విజేతగా నిలిచాడు. షాంఘై సర్క్యూట్‌లో ఈ ఆస్ట్రేలియన్‌ డ్రైవర్‌ అసాధారణ వేగంతో దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన ప్రధాన రేసును ఆరో స్థానం నుంచి ప్రారంభించిన రికియార్డో 56 ల్యాప్‌ల రేసును గంటా 35 నిమిషాల 36.380 సెకన్లలో పూర్తి చేశాడు. తన కెరీర్‌లో అతనికిది ఆరో విజయం. క్వాలిఫయింగ్‌లో పోల్‌ పొజిషన్‌ సాధించిన వెటెల్‌కు ఈ రేసు నిరాశను మిగిల్చింది.

ఇప్పటికే రెండు రేసుల్ని తన ఖాతాలో వేసుకున్న ఫెరారీ డ్రైవర్‌ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఇతని సహచరుడు, రెండో స్థానం నుంచి రేసును ఆరంభించిన రైకోనెన్‌కు మూడో స్థానం లభించగా, మెర్సిడెస్‌ డ్రైవర్‌ బొటాస్‌ రన్నరప్‌గా నిలిచాడు. ఫోర్స్‌ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్‌ వరుసగా 11, 12వ స్థానాలు పొందారు. ఈ సీజన్‌లో తదుపరి రేసు అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రి ఈ నెల 29న జరుగుతుంది.    

Advertisement
Advertisement