
'ఫార్ములా వన్ లో ఇదే నా బెస్ట్'
ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్ లో సాధించిన ఘనతల పట్ల మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హమిల్టన్ ఆనందం వ్యక్తం చేశాడు.
న్యూయార్క్: ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్ లో సాధించిన ఘనతల పట్ల మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హమిల్టన్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది ఇప్పటివరకూ 10 రేసుల్లో విజేతగా నిలిచిన హమిల్టన్ విశ్వ విజేతగా అవతరించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు. తన కెరీయర్ లో 2015 సంవత్సరం ఒక గొప్ప అనుభూతిని ఇచ్చిందని పేర్కొన్నాడు. ఈ సంవత్సరం తన కెరీయర్ లో అత్యంత ఉత్తమమైనదనిగా హమిల్టన్ స్పష్టం చేశాడు. ' ఈ ఏడాది యూఎస్ గ్రాండ్ ప్రితో పాటు అంతకుముందు సాధించిన రెండు టైటిల్స్ నన్ను మరోసారి ప్రపంచ చాంపియన్ గా నిలపడంలో సహకరించాయి. ఈ ఏడాది నాకు చాలా ఇచ్చింది. ఇదే నా కెరీయర్ లో ఓ అద్భుతమైన సంవత్సరం. నన్ను మరింత శక్తివంతుడిగా చేసింది. ప్రపంచ చాంపియన్ అయ్యానంటే నిజంగా నమ్మబుద్ధిగా లేదు' అని బ్రిటీష్ రేసర్ హమిల్టన్ పేర్కొన్నాడు.
ఈ సీజన్ ఆరంభం నుంచి నిలకడగా రాణిస్తున్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరో మూడు రేసులు మిగిలుండగానే ప్రపంచ విజేతగా అవతరించిన సంగతి తెలిసిందే. భారత కాలమాన ప్రకారం ఆదివారం జరిగిన యూఎస్ గ్రాండ్‌ప్రిలో ఈ బ్రిటిష్ రేసర్ విజేతగా నిలిచాడు. 56 ల్యాప్‌ల రేసును హామిల్టన్ గంటా 50 నిమిషాల 52.703 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. దీంతో పాటు మూడోసారి ఫార్ములా వన్ ప్రపంచ చాంపియన్ షిష్ ను కైవసం చేసుకున్నాడు.