అపరిచితుడు కొణతాల

Political Story on Konathala Ramakrishna Visakhapatnam - Sakshi

పదిరోజుల కిందట చంద్రబాబుపై నిప్పులు   

ఇప్పుడు బాబే కావాలంటూ బాకా

లోకేష్‌ బండిలో చివరాఖరున ద్వితీయశ్రేణి నేతల వెనుక

ఐదేళ్లుగా అనుచరులతో దాగుడుమూతలు

ఉత్తరాంధ్ర చర్చావేదికను వాడేసుకున్న నేత

కొణతాలను నమ్ముకుని నిండా మునిగిన అనుచరులు

మార్చి 14 గురువారం సాయంత్రం.. అనకాపల్లిలోని రావుగోపాలరావు కళాక్షేత్రం..ఆత్మీయ సమావేశం పేరిట నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఐదేళ్ల పాలనలో బాబు అన్ని రంగాల్లో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. బాబు లక్ష్యంగా ఇంకా  చాలా చాలా మాటలన్నారు.
కట్‌ చేస్తే..  మార్చి 24 ఆదివారం రాత్రి.. మునగపాకలోని కోళ్లపారం సమీపంలో మీటింగ్‌..చంద్రబాబుకే ఈసారి నేను మద్దతిస్తున్నాను.. మీరూ నాతోనే రండి. అని తన క్యాడర్‌కు క్లాస్‌..
తాజాగా మార్చి 27 బుధవారం మధ్యాహ్నం .. ఏజెన్సీలో లోకేష్‌బాబు వెనుక ఎక్కడో నిలబడి.. ఆనక ప్రసంగించే అవకాశం ఇచ్చినప్పుడు నోరారా సీఎం చంద్రబాబుపై పొగడ్తలు..
ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రి పార్టీలు మార్చే జంప్‌ జిలానీలను చూస్తుంటాం కానీ.. విలువలు, సీనియారిటీ.. అంటూ సుద్దులు చెప్పుకునే కొణతాల రామకృష్ణ వంటి కుçహానావాదుల అసలు స్వరూపం ఇన్నాళ్లకు బట్టబయలైందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఐదేళ్లలో ఎన్నో దారులు మార్చి.. నమ్ముకున్న క్యాడర్‌ను ఏ మార్చి.. వివిధ పార్టీల గుమ్మాలు తొక్కి చివరికి ‘పచ్చ’ గుమ్మం ముందు నిలబడి...  మీకు నేను సేవలందిస్తాను బాబో.. అని దేబిరిస్తున్న కొణతాలను ఇప్పుడందరూ ‘అపరిచితుడు’.. అని అంటున్నారు.  ఎనీ డౌట్‌.. అయితే... పూర్తి కథనంలోకి వెళ్దాం.. రండి..

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఐదేళ్లు.. ఓ రాజకీయ నాయకుడి జీవితంలో ఈ సమయం తక్కువేమీ కాదు. ఉత్థానపతనాలను నిర్దేశించే కాలమది. ఇప్పుడిదంతా ఎందుకంటే మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అండతో జిల్లాలో ఒకప్పుడు చక్రం తిప్పిన కొణతాల రామకృష్ణ ఐదేళ్ల క్రితం తెర వెనక్కి వెళ్లిపోయారు. మధ్యలో అడపాదడపా ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్‌ పేరితో హడావుడి చేసి.. మళ్లీ అడ్రస్‌ ఉండే వారు కాదు. వైఎస్‌  ప్రోద్బలంతో కాంగ్రెస్‌లో ఘనచరిత్ర సొంతం చేసుకున్న కొణతాల ఈ ఐదేళ్ల ప్రస్థానాన్నే పరిశీలిద్దాం.

ముందు అనుయాయులను పంపేసి..
2014 ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ గెలవడంతో దశల వారీగా తన అనుచరులను, సన్నిహితులను ఆ పార్టీలోకి పంపిస్తూ వచ్చారు. ఆ క్రమంలోనే పెందుర్తికి చెందిన గండిబాబ్జీ, ఆ తర్వాత దివంగత అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావులను పంపించారన్న వాదనలున్నాయి. మీరు వెళ్ళండి.. నేను వెనకే వస్తాను.. అని చెప్పి.. ముందుగా వాళ్ళను తోసేసినా.. ఈయన మాత్రం తటపటాయిడంతో అక్కడ గేట్లు మూసుకుపోయాయని అంటారు. దాంతో ఈ మధ్య కాలంలో ఉత్తరాంధ్ర చర్చావేదిక పేరిట మీడియా సమావేశాలు, వివిధ పార్టీల నేతలతో భేటీలతో కాలక్షేపం చేస్తూ వచ్చారు. ఎన్నికల సీజన్‌ వచ్చేసరికి ‘ఆ పార్టీ వాళ్లు రమ్మంటున్నారు.. ఈ పార్టీ ఆహ్వానిస్తున్నారు’.. అని లీకులిచ్చి పబ్పం గడిపేశారు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన తర్వాత ఇక ఆలస్యం చేయకుండా ఆత్మీయులతో సమావేశాల పేరిట హల్‌చల్‌ చేసి ఈ నెల 14న అనకాపల్లిలో జరిగిన సమావేశంలో చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

మార్చి 14న బాబుపై నిప్పులు
సీఎం చంద్రబాబు అన్ని రంగాల్లో విఫలమయ్యారని అనకాపల్లి ఆత్మీయ సమావేశంలో కొణతాల ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర ప్రగతిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పోలవరం ప్రాజెక్టును తరతరాలుగా ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయేలా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రూపుదిద్దినా  ప్రస్తుత సీఎం చంద్రబాబు ఆ ప్రాజెక్టును వేగంగా నిర్మించడంలో వెనకడుగు వేశారని విమర్శించారు. ఆ రోజు కొణతాల ఆవేశకా‘వేషాలు’ చూసిన ఆయన క్యాడర్‌.. కొణతాల రూటు చంద్రబాబుకు దూరంగానే ఉందని భావించారు.

నేడు లోకేష్‌ వెంట తోకలా..
ఇక బుధవారం హుకుంపేట, పాడేరుల్లో జరిగిన  లోకేష్‌బాబు బహిరంగ సభల్లో పాల్గొని కొణతాల చేసిన ప్రసంగాలు  చూసి గిరిజనం విస్తుపోయారు. నిన్నటి వరకు బాబును తెగిడిన నోటితోనే రాష్ట్రానికి  టీడీపీతోనే మంచి భవిష్యత్తు ఉందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు పాలనలోనే సంక్షేమం జరుగుతోందని, ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి  పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరి నూరుశాతం మంచి పనిచేసిందని కితాబునిచ్చారు. ఇలా కొణతాల చేసిన వ్యాఖ్యలు, ఆయన లోకేష్‌ వెంట నిలబడిన దృశ్యాలు చూసిన రాజకీయ విశ్లేషకులు ఎప్పటికప్పుడు రంగులు మార్చిన కొణతాల పరిస్థితేమో గానీ.. ఆయన్నే నమ్ముకున్న క్యాడర్‌ మాత్రం నిండా మునిగిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మార్చి 24న బాబే కావాలంటూ సుద్దులు
ఐదేళ్లుగా తన ప్రయాణం ఎటువైపో స్పష్టం చేయకుండా క్యాడర్‌ను ముప్పుతిప్పలు పెట్టిన కొణతాల ఇన్నాళ్లకు సరైన దారి ఎంచుకున్నారని అందరూ అనుకున్నారు. కానీ అంతలోనే ఆయన యూ టర్న్‌ తీసుకున్నారు. పది రోజులకే.. మార్చి 24న మునగపాకలోని కోళ్లపారం సమీపంలో మీటింగ్‌  పెట్టి.. చంద్రబాబుకే ఈసారి నేను మద్దతిస్తున్నాను.. మీరూ నాతోనే రండి. అని తన క్యాడర్‌కు పిలుపునిచ్చారు. ఇదేమిటని తలపట్టుకున్న క్యాడర్‌కు.. నేనింతే.. అంటూ బాబుకు వ్యతిరేకమంటూ వేసుకున్న ముసుగు తీసేశారు.

కొసమెరుపు..
పాడేరులో బుధవారం జరిగిన సభలో ప్రచార వాహనంపైన ముందు లోకేష్‌ నిలబడి మాట్లాడుతుంటే.. బండి చివరాఖరున.. ద్వితీయ, తృతీయ శ్రేణులందరి వెనకాల కొణతాల నిలబడి ఉన్న దృశ్యం చూసి..  ఒకప్పుడు జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగువెలిగిన  కొణతాలకు టీడీపీ వాకిట్లో ఏ స్థాయి గౌరవం దక్కుతోందో అర్ధమవుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top