మంత్రి నారాయణ ఖాతాలోకి వేల కోట్లు

Minister Narayana Looting Thousands Of Crores Rupees : Somu Veerraju - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగేళ్లుగా సమర్థవంతమైన అవినీతి పాలన నడుస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అవినీతిని సమర్థవంతంగా పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. అర్బన్ హౌసింగ్ స్కీమ్‌లో సుమారు 30 వేల కోట్ల అవినీతి జరిగిందని, మట్టి-నీరు పథకంలో మరో 30 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇసుక తవ్వకాల ద్వారా వేల కోట్లు దోచేస్తున్నారని మండిపడ్డారు. జన్మభూమి కమిటీల ద్వారా అవినీతి చేసుకోమంటూ కిందస్థాయి నేతలకు అనుమతి ఇచ్చేశారని దుయ్యబట్టారు.

'సర్వశిక్షా అభియాన్‌కు కేంద్రం ద్వారా మూడు వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి. విద్యకు 30 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. వీటిలో 8 నుంచి 9 వేల కోట్లు చేతులు మారుతున్నాయి. విద్యకు కేటాయించిన నిధులన్నీ మంత్రి నారాయణ పరమవుతున్నాయి. అంతేకాకుండా సర్వశిక్షాఅభియాన్‌లో పోస్టులు అమ్ముకుంటున్నారు. దేశంలో ఎన్‌ఆర్‌జీఎస్‌ కింద సంవత్సరానికి 40వేల కోట్లు కేటాయిస్తే 9వేల కోట్లు కేవలం ఏపీకి ఇస్తున్నారు. జీవో 51 ద్వారా 10 ప్రాజెక్టులను తాకట్టు పెట్టి 6500 కోట్లు తేవాలని చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఉపాధి హామీ పథకాలుగా మారిపోయాయి' అని సోము వీర్రాజు ఆరోపించారు

గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు, ఎల్‌ఈడీ బల్బులు, ఇల్లులు, 24 గంటల కరెంట్, నీరు చెట్టు, ప్రధాన మంత్రి భీమా, మరుగుదొడ్లు వంటి వాటిని కేంద్రమే భరిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అవీనీతికి పాల్పడుతోంది. ఆ సొమ్ముతో రాష్ట్రంలోని ఉన్న ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేయొచ్చు. బీజేపీ బలం పెరుగుతుందనే టీడీపీ నేతలు మా పార్టీ నాయకులపై దాడులు చేయిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే లక్షా 20 వేల కోట్ల అప్పు తెచ్చారు. ఇంత అప్పు ఉండగా మళ్లీ అప్పు తేవడానికి సిద్ధమయ్యారు. సీఎం అప్పులకు సిద్ధమౌతుంటే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఏంచేస్తున్నారు. పైగా సీఎం సభలకు రాకపోతే ప్రభుత్వ పథకాలు ఇవ్వమంటూ ప్రజలను బెదిరిస్తున్నా'రని సోము వీర్రాజు మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top